తెలంగాణలో వైద్య మంత్రి ఈటల ఉద్వాసన తరువాత చానాళ్లపాటు మీడియాకు దూరంగా అధికారిక సమీక్షలకే ప్రభుత్వం పరిమితమైంది.అడపాదడపా మంత్రులు మీడియాతో మాట్లాడినా..పూర్తి స్థాయి ప్రతికా సమావేశాలు మాత్రం జరగలేదు. తాజాగా గురువారం కేటీఆర్ ట్విట్టర్‌లో నిర్వహించిన #AskKTR లో చాలా వరకు వైద్యఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి.అందులోనూ ముఖ్యంగా కొవిడ్‌కి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతోపాటు తాను కొవిడ్ నుంచి ఎలా బయటపడిందనే అంశాన్ని వెల్లడించారు.
మానసికంగా ధైర్యంతో..
మీరు కొవిడ్ సమయంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా కేటీఆర్ స్పందిస్తూ.. ‘వారంపాటు జ్వరం వచ్చింది.తక్కువ నుంచి అతి ఎక్కువ డీగ్రీలకు చేరింది. ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ వచ్చింది.నేను డయాబెటిక్ కావడంతో బ్లడ్ షుగర్ మరియు హైపర్ టెన్షన్ నియంత్రణకు కొంత కష్టమైంది.అయితే వైద్యుల సూచనలతోపాటు మానసికంగా ధైర్యంగా ఉండడంతో ఎదుర్కొన్నాను. కోలుకున్న తరవాత కూడా కొంత బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అయినా తొందరగానే సాధారణ స్థితికి చేరుకున్నా.కొవిడ్ విషయంలో సొంత వైద్యం మాత్రం ఫాలో కావద్దు.ముఖ్యంగా వాట్సాప్ వైద్యం అనుకరించవద్దు.కొవిడ్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో చాలావరకు వాస్తవాలకు దూరంగా ఉంటున్నవేనని నా అభిప్రాయం.అవి చూస్తే ఇంకా టెన్షన్ పెరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.లక్షణాలు కనిపించగాన ICMR సూచనలను ఫాలో కావాలి.విటమిన్ల టాబ్లెట్లను వేసుకోవాలి.రిజల్ట్ వచ్చే వరకు జాప్యం చేయవద్దు అని సూచించారు.
మిగతా ప్రశ్నలకు సమాధానాలు ఇలా..
వీటితోపాటు తెలంగాణలో ఉదయం 10గంటల తరువాత లాక్ డౌన్ విధించడం ద్వారా ప్రజలకు కొంతమేరకు తక్షణావసరాలకు ఇబ్బంది లేకుండా చూశామన్నారు.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల ద్వారా కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతుందని వెల్లడించారు.ఆక్సిజన్ సరఫరా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని,ఈ విషయంలో దేశం సవాళ్లను ఎదుర్కొంటోందని,రెమ్‌డెసివిర్ వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహితోందని వ్యాఖ్యానించారు. కొందరు కొవిడ్ బాధితుల నుంచే ఈ ఇంజెక్షన్ వినియోగానికి ఒత్తిడి వస్తున్న విషయాన్ని వైద్యులు కూడా తమకు చెప్పారని, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నాని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇంటింటి సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని,60 లక్షల ఇళ్ల సర్వే పూర్తయిందన్నారు.తెలంగాణలో 45 సంవత్సరాలకు పైబడినవారు 92 లక్షల మంది ఉంటే అదులో 45లక్షల మందికి వ్యాక్సిన్ అందిందని,మరో పదిలక్షల మందికి రెండో డోసు కూడా పూర్తయిందన్నారు.మొదటి డోసు వేసుకున్నవారికి రెండవ డోసు అందించడమే తమ ప్రాధాన్య అంశమని వెల్లడించారు.రోజుకి 9లక్షల వ్యాక్సిన్లు వేసే యంత్రాంగం ఉందని,వ్యాక్సిన్ సరఫరానే సమస్య అని వెల్లడించారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీరం,రెడ్డీస్,భారత్ బయోటెక్ లాంటి సంస్థలతో మాట్లాడుతోందన్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తాం
ఇక కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశంపై ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని,ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.కోవిడ్ ద్వారా తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్‌ని ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.కొవిడ్ నియంత్రణ విషయంలో కొందరు రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.కాగా కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశంలో సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంపై సోషల్ మీడియాతో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేసే చర్యలకు ఇది ఉపయోగపడుతుందనే కామెంట్లు వస్తున్నాయి.
Must Read ;- భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. తెలంగాణాలోనూ వెలుగులోకి










