ఇప్పటికే కొవిడ్ విషయంలో భయాందోళనకు గురవుతోన్న ప్రజలను బ్లాక్ ఫంగస్ మరింత టెన్షన్ పెడుతోంది. నిన్నమొన్నటివరకు గుజరాత్,మహారాష్ట్రలో ఈ కేసులను గుర్తించగా తాజాగా తెలంగాణలోనూ బయటపడ్డాయి. బ్లాక ఫంగస్‌తో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిర్మల్ జిల్లా భైంసాకి చెందిన లింగురామ్ అనే వ్యక్తి చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.కొవిడ్ చికిత్స అనంతరం ఈ వ్యాధి బయటపడినట్టు తెలుస్తోంది.అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం ఈ అంశాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. స్టెరాయిడ్స్ ఎక్కువగా వినియోగించడం వల్ల కొద్దిమందికి ఈ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉందని, అందరికీ రాదని వైద్యులు చెబుతున్నారు.ఇక గాంధీ ఆసుపత్రిలోనూ మూడు కేసులు గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా,ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.గాంధీ ఆసుపత్రిలో మూడు కేసులు ఉన్న విషయాన్ని వైద్యులు ప్రకటించారు.అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులకు సంబంధించి డేటా అందుబాటులో ఉంటుండగా ప్రైవేటు ఆసుపత్రుల్లో వచ్చే కేసులు ఎన్ని ఉంటాన్నాయనేది తేలాల్సి ఉంది.
కరోనా సోకి స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వారికి..
మ్యుకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)గా పిలిచే ఈ వ్యాధి కరోనా సోకి స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వారికి, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని, కరోనా సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ ఫంగస్ సోకిన వ్యక్తికి వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణంతకంగా మారుతుందని, ముక్కు, గొంతుద్వారా మెదడుకి సోకుతుందని, కొన్నిసార్లు కంటిచూపు కూడా కోల్పోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఈ వ్యాధి బారిన పడిన నిజామాబాద్ జిల్లాకు చెందిన అస్ఫియా కంటి చూపును కోల్పోయిన ఘటనకూడా వెలుగులోకి వచ్చింది. కరోనాను జయించినా బ్లాక్ ఫంగస్ కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది.మరోవైపు సరోజినీ దేవి ఆసుపత్రిలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరికి లైపొసొమాల్ యాంఫోటెరిసిన్ బీ ట్రీట్‌మెంట్ ఇస్తునట్లు సమాచారం. అందులో భాగంగా యాంఫోటెరిసిన్ బీ (Amphotericin B) ఇంజెక్షన్‌ను వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్‌ను ఇప్పటివరకు కేంద్రం నోటిఫై (రికార్డుల నమోదు) చేయలేదని, దీంతో కచ్చితమైన డేటా అందుబాటులోలేదని వైద్యులు కూడా చెబుతున్నారు.కొవిడ్ చికిత్సల సమయంలో గుజరాత్‌లో తొలుత ఈ ఫంగస్ కేసులు ఎక్కువయ్యాయి.ఈ వ్యాధి పాతదే అయినా..ఖర్చుతో కూడుకుని ఉండడంతోపాటు ఇంజెక్షన్ల లభ్యత కూడా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇటీవలే కొన్ని కంపెనీలకు అనుమతిలిచ్చింది.
Must Read ;- కరోనాకు తోడు.. భయపెడుతున్న బ్లాక్ ఫంగస్
మహారాష్ట్రలో 1500 కేసుల నమోదు..
కాగా కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్‌ల సమయంలో మహారాష్ట్రలో ప్రభుత్వాసుపత్రుల్లో 1500బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే బుధవారం ప్రకటించారు.ముందుజాగ్రత్తగా లక్ష ఆంఫోటెరిసిన్-బీ యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ల కోసం టెండర్ పిలుస్తున్నామని ప్రకటించారు.కర్ణాటక కూడా 25వేల ఇంజెక్షన్లు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసింది.బెంగళూరులోని ఒకే ఆసుపత్రిలో 38 కేసులు బయటపడడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.యూపీలో 73కేసులు నమోదుకాగా వారణాసి ఆసుపత్రుల్లో 20, లక్నోలో 15, గోరక్ పూర్‌లో 10 కేసులు నమోదయ్యాయి.శుక్రవారం ఒక్కరోజే పాట్నాలోనూ 6కేసులు వెలుగులోకి వచ్చాయి.ఇక గురువారం కేటీఆర్ నిర్వహించిన Ask KTR కార్యక్రమంలోనూ ఓ నెటిజన్ బ్లాక్ ఫంగస్‌పై ప్రభుత్వ సన్నద్ధతపై ప్రశ్నించగా, ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌పై పరిశీలిస్తోందని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైందని వెల్లడించారు.
కేంద్ర మంత్రి ట్వీట్..
బ్లాక్ ఫంగస్‌కి సంబంధించి కేంద్ర వైద్య మంత్రి డా.హర్షవర్దన్ ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారన్నారు.ముందుజాగ్రత్త, సత్వర వైద్యంతోనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని చెబుతూ ముందు జాగ్రత్త చర్యలను ట్వీట్ చేశారు.
Also Read ;- భారత్‌కు త్వరలో mRNA కరోనా టీకాలు.. లుపిన్ ఫార్మా సన్నాహాలు











