ఏపీలో కరోనా కేసులు ఒకవైపు రోజు రోజుకు పెరిగిపోతుంటే, మరో వైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలుతున్నారు. నిన్న ఒక్క రోజే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మంది, కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నలుగురు కరోనా రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు.అధికారులు మాత్రం కరోనా రోగులు ఆక్సిజన్ అందక చనిపోలేదని చెబుతున్నారు. ఆక్సిజన్ అందకే తమవారు చనిపోయారని మృతుల బంధువులు చేస్తున్నఆరోపణలను అధికారులు ఖండిస్తున్నారు.అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది రోగులు ఆక్సిజన్ బెడ్లపై కరోనాకు చికిత్స పొందుతున్నారు. శనివారం అకస్మాత్తుగా ఆక్సిజన్ కొరత ఏర్పడంతో రోగులు గగ్గోలు పెట్టారు. దీంతో అధికారులు వెంటనే వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. మార్గమధ్యంలోనే 14 మంది కరోనా రోగులు చనిపోయారని వారి బంధువులు ఆందోళన దిగారు. అయితే ఆసుపత్రిని సందర్శించిన జాయింట్ కలెక్టర్ ఆక్సిజన్ అందక రోగులు చనిపోలేదని ప్రకటించారు.
ఆక్సిజన్ కొరత వేధిస్తోంది..
ఏపీకి ప్రస్తుత అవసరాలకు ప్రతి రోజూ 480 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని వైద్యాధికారులు గుర్తించారు. ఈ అవసరాలు క్రమంగా పెరుగుతున్నాయి.రోజుకు కనీసం 600 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయగలిగితేనే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల అవసరాలు తీరుతాయి. ఆక్సిజన్ వినియోగంలో మెలకువలు తెలియకపోవడం వల్ల కూడా 20 శాతం ఆక్సిజన్ వృధాగా పోతోందని వైద్యఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు వేగంగా పెరగడం కూడా ఆక్సిజన్ వినియోగం పెరగడానికి దారి తీసింది. నిన్న ఒక్క రోజే 19 వేల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడం,ఆక్సిజన్ అవసరం అవుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటంతో పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిండుకుంటోంది.ఒక్కసారిగా ఆక్సిజన్ అవసరాలు పెరిగిపోవడం, సరఫరా చేసే వాహనాలు కూడా అందుబాటులో లేకపోవడంతో నైట్రోజన్ తరలించే వాహనాలు వినియోగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read ;- ఆస్పత్రిలో ఆర్తనాదాలు : ఆక్సిజన్ అందక 20 మంది మృతి, ప్రాణాపాయంలో వందల ప్రాణాలు

విశాఖ ఉక్కు నుంచి ఆక్సిజన్ తీసుకోలేరా?
ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులతోపాటు ఆక్సిజన్ అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి.ఆక్సిజన్ అవసరాలు తీర్చుకునేందుకు ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించినట్టు కనిపించడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో రోజుకు వంద టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. విశాఖ స్టీల్ నుంచి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, డిల్లీ రాష్ట్రాలకు ప్రతి రోజూ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, మన అవసరాలు తీరిన తరవాత మిగిలిన ఆక్సిజన్ తీసుకెళ్లాలని కనీసం సీఎం జగన్మోహన్‌రెడ్డి కేంద్రాన్ని అడగకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.మరో వైపు తమిళనాడు సీఎం తెలుగు రాష్ట్రాలకు తమ రాష్ట్రం నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిపివేయాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు.ఆ మాత్రం చొరవ కూడా ఏపీ సీఎం తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో వైపు ఒరిస్సాలో ప్రతి రోజూ వెయ్యి టన్నుల ఆక్సిజన్ తయారవుతోంది.దేశంలోని వివిధ రాష్ట్రాలకు అక్కడ నుంచే సరఫరా చేస్తున్నారు.ఏపీ సీఎం దృష్టి పెడితే వెంటనే ఒరిస్సా నుంచి ఉత్తరాంధ్రకు వెంటనే ఆక్సిజన్ సరఫరా మెరుగు పరచే అవకాశం దక్కుతుంది. కానీ ఆక్సిజన్ సమకూర్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న అరకొర చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని రోగుల మరణాలు తేటతెల్లం చేస్తున్నాయి.
విజయనగరం ఘటన మరవక ముందే..
విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో 26వ తేదీ అర్థరాత్రి అకస్మాత్తుగా ఆక్సిజన్ అయిపోవడంతో ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న 50 మంది రోగులను హుటాహుటిన విశాఖ తరలించాల్సి వచ్చింది. దీంతో మార్గ మధ్యంలోనే నలుగురు కరోనా రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు. దీనిపై విజయనగరం కలెక్టర్ హరిజవహర్ లాల్ స్పందిస్తూ, ఆక్సిజన్ లేక ఎవరూ చనిపోలేదని ప్రకటించారు. కరోనా వల్ల మాత్రమే ఇద్దరు రోగులు చనిపోయారని సర్దిచెప్పారు. అయితే కరోనా రోగుల బంధువులు మాత్రం ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వల్లే తమ వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు.ఇక రాజంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆక్సిజన్ అందుబాటులో లేక కరోనాతో సీరియస్‌గా ఉన్న రోగిని ఆవరణలోనే వదిలేశారు. దీంతో ఆ రోగి ఆసుపత్రి ఆవరణలోనే చనిపోయారు.కృష్ణా జిల్లా గూడూరులోనూ ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు కరోనా రోగులకు ఆక్సిజన్ నిలిచిపోవడంతో సుధాకర్ అనే రోగి గాలి పీల్చలేక గగ్గోలు పెట్టారు. దీంతో వారి బంధువులు అతన్నివేరే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. ఏపీ ప్రభుత్వం చేతగాని తనంతో పదుల సంఖ్యలో కరోనా రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రతి రోజూ అన్ని ఆసుపత్రులకు అవసరం మేరకు ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Must Read ;- ఆస్పత్రిలో ఆర్తనాదాలు : ఆక్సిజన్ అందక 20 మంది మృతి, ప్రాణాపాయంలో వందల ప్రాణాలు











