తమిళ డైరెక్టర్ శంకర్, హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ వివాదాల్లో ఉన్నాడు. వీటి నుంచి ఆయన బయటపడి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే విషయంలో బాగా ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ‘ఇండియన్ 2’ వివాదమే. కమల్ హాసన్ భారతీయుడుకు సీక్వెల్ గా లైక్ సంస్థ ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టింది. కొంత షూటింగ్ కూడా జరిగింది. మధ్యలో ఈ సినిమా సెట్ అగ్నిప్రమాదానికి గురైంది.
కారణం ఏదైనా గాని శంకర్ కూ, లైక్ సంస్థ అధినేతకూ మధ్య వివాదం కోర్టు దాకా వెళ్లింది. ఈ సినిమాని పక్కన పెట్టి శంకర్ ‘అపరిచితుడు’ రీమేక్ అంగీకరించాడు. ఇంకో పక్క రామ్ చరణ్ సినిమాని ప్రకటించాడు. తన సినిమా చిత్రీకరణను పూర్తిచేయకుండా శంకర్ వేరే సినిమాలు చేయడానికి వీల్లేదంటూ లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న కోర్టు ఈ సమస్యను సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకూ సూచించింది.
ప్రస్తుతం ఈ కేసు జూన్ కు వాయిదా పడింది. లైకా సంస్థ అక్కడితో ఆగలేదు శంకర్ కొత్త చిత్రం మొదలుపెట్టకుండా హిందీ ఫిలిం ఛాంబర్కు లేఖ రాసింది. ఈ వివాదం పరిష్కారమైతేనే గాని శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. ఎన్నో భారీ చిత్రాలు చేసిన శంకర్ కు ఈ కొత్త కష్టాలు గుక్కతిప్పుకోలేకుండా చేస్తున్నాయి.
Must Read ;- ‘పుష్ప’ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందంటోన్న మేకర్స్











