వేగంగా దర్యాప్తు జరిపి నివేదిక అందించిన బృందం..!
బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదంపై భారత వాయు సేనకు చెందిన ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ చాలా వేగంగా దర్యాప్తు జరింపింది. ఈ దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఈ బృందం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించింది. ఈ బృందంలో భారత నావికా దళానికి చెందిన సీనియర్ హెలికాప్టర్ పైలట్ ఒకరు, సైనికాధికారి మరొకరు కూడా ఉన్నారు. మానవేంద్ర సింగ్ బెంగళూరులోని ఐఏఎఫ్ ట్రైనింగ్ కమాండ్ కు అధిపతిగా ఉన్నారు. విమానాలు, హెలికాప్టర్లు కూలిపోయిన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో మానవేంద్ర సింగ్ నిపుణులు.
నివేదికలోని అంశాలు ఇవే..!
త్రివిద దళాదిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి, మరో 12 మంది ప్రాణాలను బలికొన్న హెలికాప్టర్ ప్రమాద రహస్యాలను త్రివిధ దళాల దర్యాప్తు బృందం వెలికితీశారు. బుధవారం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో దర్యాప్తు బృందం భేటి అయింది. దీనిపై జాతీయ మీడియా ద్వారా అందిన సమాచారం మేరకు హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడానికి అందరూ ఊహించినట్లు సాంకేతిక లోపం కారణం కాదని వెల్లడించినట్లు తెలుస్తోంది! ప్రమాదానికి గురయ్యే ముందు ఈ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోందని, ఓ రైల్వే లైను గుండా అది వెళ్తోందని, ఆ సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పైలట్ నియంత్రణలోనే ఉన్న హెలికాప్టర్, అనుకోకుండా భూమిపైకి దించారని, అలా ఎందుకు దించాల్సిన వచ్చిందో తేలాల్సి ఉందని వివరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సాయుధ దళాల ఉన్నతాధికారులు ప్రయాణించే హెలికాప్టర్లను నడిపేటప్పుడు ప్రమాణాలను సవరించాలని ఈ నివేదిక సూచించినట్లు సమాచారం.











