కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. ట్రిపుల్ ఆర్ విషయంలో అదే జరుగుతోంది. అన్నీ బాగుంటే రెండ్రోజుల్లో జనం ముందుకు ట్రిపుల్ ఆర్ వచ్చి ఉండేది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా భారీ హైప్ తో ఆర్ఆర్ఆర్ చిత్రం ఊరించింది. ఆది నుంచీ ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు విడుదలయ్యేది త్వరలోనే ప్రకటిస్తారు. ఈలోగా దీనికి మరో ప్రతిబంధకం వచ్చి పడింది. స్వాతంత్ర సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ప్రధాన పాత్రలుగా ఫిక్షనల్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు రాజమౌళి.
1920లో జరిగే కథ ఇది. రామరాజు, భీమ్ కలిసినట్టు చరిత్రలో లేకపోయినా వాటికి ఓ ఫిక్షన్ కథాంశాన్ని జోడించి సినిమా చేస్తున్నట్టు రాజమౌళి ముందే ప్రకటించారు. ఇది చరిత్రను వక్రీకరించడమేనని పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంకు చెందిన అల్లూరి సౌమ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వవద్దని కోరారు. సినిమా విడుదలను నిలిపివేయాలని కూడా కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం ఈ పిల్ చేరుకుంది. దీనిపై విచారణ జరుపుతామని జడ్జి ఉజ్జల్ భూయాన్ బెంచ్ తెలిపింది.
ఈ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో చూడాలి. ఒకవేళ సినిమా విడుదలపై స్టే వస్తే ఏంచేయాలి అన్న ఆలోచనలో చిత్ర బృందం ఉంది. సాధారణంగా సినిమాలకు ఇలాంటి సమస్యలు ఎదురవడం పరిపాటి. తర్వాత ఎలాగో దీన్ని పరిష్కరించుకుంటారు. ఏది ఏమైనా ఇలాంటి కథాంశాలను ఎంచుకుంటే మాత్రం తలనొప్పులే అనే విషయం మాత్రం అర్థమవుతోంది. పైగా ఇది భారీ చిత్రం. విడుదల ఆలస్యం కావడంవల్ల ఆర్థిక భారం పెరిగిపోయింది. ఎంత త్వరగా దీన్నుంచి బయటపడదామా అన్న ఆలోచన నిర్మాతలకు ఉంది.