ఆయిల్ మాఫియా ఆగడాలతో కొత్త తలనొప్పి!
కర్నూలు జిల్లా, బేతంచెర్లలో ఇద్దరు వైసీపీ నాయకులు సాగిస్తున్న కొత్తదందా స్థానిక ప్రజలకు తలనొప్పిలా మారింది! ఆర్థిక మంత్రి బుగ్గన ఇలాకాలో వైసీపీ నాయకులు రేషన్ డీలర్ల ద్వారా ఆయిల్ దందాకు తెరతీశారు. సివిల్ సప్లయ్ నిబంధనలను తుంగలో తొక్కి మరి విజయ్ పామోలిన్ ఆయిల్ ప్యాకెట్ కొంటేనే రేషన్ బియ్యం ఇస్తామని లబ్ధిదారులకు హుకుం జారీ చేశారు. చేసేదేమీ లేక జనాలు ఆయిల్ ప్యాకెట్లు కొంటున్నారు. మార్కెట్ ధరకంటే అధిక ధరకు విక్రయిస్తూ.. కార్డుదారుల నుంచి వసూళ్లు పాల్పడుతున్నారని లబ్ధిదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఇలాకాలోనే దందానా?
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాకాలోనే రేషన్ డీలర్ల ద్వారా ఈ దందా సాగుతోంది. జిల్లాలోని బేతంచెర్ల లో ఇద్దరు వైసీపీకి చెందిన నాయకులు డీలర్ల సాయంతో విజయ్ పామాయిల్ ప్యాకేట్స్ ను కార్డు దారులకు అంటగడుతున్నారు. రేషన్ షాపులో బియ్యం, కందిపప్పు, చక్కెర వంటివి లబ్ధిదారులకు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో అధికారం ఉంది కదా.. అని కోవెలకుంట్లలో తెలిసిన వ్యక్తి ద్వారా హోల్సేల్ గా విజయ్ పామోలిన్ ఆయిల్ ప్యాకెట్లను దిగుమతి చేసుకుని డీలర్లకు అందిస్తున్నారు. దీంతో సదరు డీలర్లు రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. ఒక ప్యాకెట్ ధర రూ. 84 కాగా.. రేషన్ షాపులో మాత్రం రూ. 125కు అమ్ముతున్నారు. ఇదేంటని నిలదీస్తే.. వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా.. తమకేమి తెలియదని సమాధానమివ్వడం గమనార్హం!
Must Read:-రేషన్ సరఫరా పథకం వాయిదా..











