సెల్ఫీ అంటే యువతకు మహా సరదా. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని, ప్రతి ఘటనను సెల్ఫీలలో బంధించిన దాచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మరీ కొందరరైతే.. నిద్ర లేసింది మొదలు కాఫీ.. టీలకు బదులు సెల్ఫీలు దిగి కావాల్సిన వారికి పంపుతూ గుడ్ మార్నింగ్ లు చెప్తుంటారు. యువతకు సెల్ఫీ అనేది వారి దైనందిక చర్యలో భాగంగా మారిపోయిందంటే నమ్మండి. కానీ, ఒక్కోసారి సెల్ఫీ పిచ్చి శృతి మించి రాగాన పడి.. ప్రాణాల మీదకు తెస్తుంది. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ
తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ యువతి బావి మీద నిలబడి సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నించి పొరపాటున బావిలో పడిపోయింది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా సుఖేడా గ్రామానికి చెందిన ఓ యువతి బావి వద్ద సెల్ఫీ తీసుకోవాలని భావించింది. ఇందుకోసం బావి అంచున నిలబడింది. అలా నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో అదుపుతప్పి ఆ బావిలో పడిపోయింది. యువతికి ఇంకా భూమిపై నూకలు ఉన్నట్లున్నాయి. యువతి అరుపులు విని ఆ దారిన వెళుతున్న ఓ యువకుడు బావిలోకి దిగి అమెనైతే కాపాడాడు కానీ.. పైకి ఎలా రావాలో అర్ధం కాలేదు. దీంతో ఇద్దరు కలిసి అరవడం మొదలుపెట్టారు. వారిద్దరి అరుపులు విన్న గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చివరకు పోలీసులు, గ్రామస్థులు కలిసి తాళ్ల సాయంతో వారిని బయటకు లాగి కాపాడారు.
అవసరమా ఇదంతా..
సెల్ఫీ తీసుకోవాలనే ముచ్చట ఉండాలి కానీ.. ప్రాణాల మీదకు తెచ్చుకునేంత ఉండకూడదు. రైలు పట్టాల మీద, బావి అంచుల మీద, మేడపైన గోడల మీద, కరెంటు స్ధాంబాలపైన, కొండల అంచున, జలపాతాల దగ్గర.. ఇలా ఎన్నో ప్రమాదకరమైన ప్రదేశాలలో సెల్ఫీల పిచ్చితో ఎందరో ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నిపుణులు జాగ్రత్తలు చెప్తున్నా కూడా యువత ఏ మాత్రం లెక్కచేయడం లేదు.. మా ధోరణి మాదే అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. అదృష్టవశాత్తూ.. మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఏమాత్రం ఆలస్యం జరిగినా.. సెల్ఫీ సరదా ఆమె ప్రాణాలనో లేదా ఇద్దరి ప్రాణాలను బలిగొనేది. నేటి యువత సరదాలతో పాటు.. అప్రమత్తంగా వ్యవహారించడం చాలా అవసరమని తెలుసుకోండి.










