ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి ‘శివుడు’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశాల్ తో ‘పల్నాడు’, కార్తీతో ‘నా పేరు శివ’ సినిమాల దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ఒక పోస్టర్ ద్వారా విడుదల చేశారు. దీనికి ‘శివుడు‘ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ పోస్టర్‌లో ఆది పినిశెట్టి తీక్షణమైన చూపులతో తలకు, ముక్కుకు గాయాలతో కనిపిస్తున్నాడు. టైటిల్ లోగోపై కూడా రక్తపు మరకలు కనిపిస్తాయి.

‘శివుడు’ టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తుండగా, మరో బలమైన కంటెంట్‌తో ఆది పినిశెట్టి మళ్లీ మన ముందుకు వస్తున్నారనే నమ్మకాన్ని కలిగించేలా ఈ పోస్టర్ ఉంది. ఆదర్శ చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఆది పినిశెట్టి అన్నయ్య సత్యప్రభాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవిరాజా పినిశెట్టి ఈ సినిమాకి సమర్పకుడు. నిక్కీ గల్రానీ, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు కాగా.. సునీల్, హరీష్ ఉత్తమన్, కంచరపాలెం రాజు, జేపీ, శత్రు తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం శివుడు సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తికావచ్చింది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Must Read : మహోన్నత వ్యక్తి.. తిరుగులేని శక్తి











