తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో నిధి అగర్వాల్ ఒకరు. పేరు తగినట్టుగానే ఈ అమ్మాయి అందాల నిధిలా కనిపిస్తుంది .. అజంతా శిల్పంలా అనిపిస్తుంది. చక్కని కనుముక్కుతీరుతో ‘బాపు’ బాల్ పెన్నుతో గీసిన బొమ్మలా ఉంటుంది. ‘సవ్యసాచి‘ సినిమాలో చైతూ జోడీగా ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమైంది. తొలిసారిగా ఈ సుందరిని చూసిన కుర్రాళ్లు, రెండు కళ్లు మాత్రమే ఇచ్చినందుకు దేవుడిపై చాలా రోజుల పాటు అలిగారు. అరువుగానైనా ఓ అరడజను కళ్లు ఇవ్వమని అడిగారు.
మత్తెక్కించే అందం .. మతిమరుపు తెప్పించే అందం పుష్కలంగా ఉన్నప్పటికీ, తొలి సినిమాతో ఈ అమ్మాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కేరళ కొబ్బరిలాంటి సుందరి తెరపై కనిపిస్తుంటే కథ ఎవరికి కావాలి? అని కుర్రాళ్లు థియేటర్ల చుట్టూ తిరిగారు. యూత్ లో ఈ బ్యూటీపై గల క్రేజ్ కారణంగానే, అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ను’ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక్కడ కూడా పాలకోవాలాంటి ఈ పిల్లను సక్సెస్ పకలరించలేదు .. సక్సెస్ ను తీసుకొచ్చి ఎదురుగా నుంచోబెట్టలేదు. అయినా ఈ అమ్మాయి డీలాపడిపోకుండా, గ్లామర్ కి కంటెంట్ తోడైతే ఎలా ఉంటుందనేది, ‘ఇస్మార్ట్ శంకర్‘ సినిమాతో చూపించింది.
ఈ అమ్మాయి అందాల ధాటి నుంచి .. దాడి నుంచి కోలుకోవడానికి కుర్రాళ్లకి కొన్నాళ్లు పట్టేసింది. అలాంటి నిధి అగర్వాల్ ఆ తరువాత తమిళ సినిమాలపై కూడా తన గ్లామర్ గాలం వేసింది. ఇప్పుడిప్పుడే ఒక్కో అవకాశం వచ్చి చిక్కుకుంటున్నాయి. ఇదే సమయంలో ఆమెకి పవన్ సరసన ‘హరి హర మహాదేవ’ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. పవన్ తో సినిమా అంటే, పది హిట్లు పడితే వచ్చే పాపులారిటీ ఆ సినిమాతో వచ్చేస్తుంది. ఆయన సినిమాలో అవకాశం రావడమంటే, విడుదలకు ముందే హిట్టు రావడం లాంటిది. అందుకే ఈ అమ్మాయి ఇప్పుడు పారితోషికం పెంచేసిందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే ఈ భామను బాలీవుడ్ కి వెళ్లి బ్రతిమాలుకోవలసిందే!
Must Read ;- ఉప్పెన బ్యూటీకి డిమాండ్ మామూలుగా లేదుగా..











