తెలుగు రాష్ట్ర రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నా.. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి పేర్లు తెలియకుండా ఉండవు. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాల రాజకీయాల్లో ఆ కుటుంబానికి మంచి పట్టుంది. అదే సమయంలో రాజకీయ ఆధిపత్య పోరులూ ఉండేవి. అయితే వాటన్నిటినీ ఎదుర్కొంటూనే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు రాజకీయంగా పట్టు నిలుపుకున్నారు. పీవీపై పోటీ చేయడంతో పాటు తరువాత ఎన్నికల్లో వరుస విజయాలతో నాగిరెడ్డి తిరుగులేని నేతగా మారారు. శోభా నాగిరెడ్డి కూడా కీలక నేత స్థాయికి ఎదిగారు. అయితే, 2009లో టీడీపీని వీడి పీఆర్‌పీకి వెళ్లి..తరువాతి కాలంలో వైసీపీలో చేరారు. 2014లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా శోభానాగిరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభా నాగిరెడ్డి..చికిత్స పొందుతూ చనిపోయారు. అప్పటి నుంచి రాజకీయాల విషయంలో నాగిరెడ్డిపై ఒత్తిడి పెరిగింది. తరువాతి కాలంలో టీడీపీలో చేరారు. 2017లో గుండెపోటుతో మరణించారు. తరువాతి కాలంలో భూమా అఖిల ప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేశారు. నాగిరెడ్డి మరణించిన కొంత కాలం నుంచి అఖిల ప్రియను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలు, ఆస్తి తగాదాలు మరో వైపు కేసులు వెంటాడుతున్నాయి.
భార్గవ్ దూకుడు..ప్రత్యర్థుల కేసులు..
అఖిల ప్రియ 2018లో రెండో వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు ఉన్న సమయంలో ఆమెకు వైఎస్ బావమరిది, వైసీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడితో వివాహమైంది. వివాహమైన కొన్ని రోజులకే వారు విడిపోయారు. తరువాత ఆమెకు పారిశ్రామికవేత్త భార్గవ్‌రామ్ పరిచయమయ్యారు. ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు మాజీ అల్లుడైన, ఏపీ మాజీ మంత్రి నారాయణకు బంధువైన భార్గవ్‌రామ్ (అప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు)ని వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత అఖిల ప్రియకు సంబంధించిన రాజకీయాలు, ఆస్తుల వ్యవహారంలో భార్గవ్‌రామ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని, అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి కూడా తోడయ్యారని గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. కర్నూలు జిల్లాలో కేసులూ నమోదయ్యాయి.
- భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డితో అఖిలప్రియకు డబ్బు విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గతంలోనే సుబ్బారెడ్డి అఖిలప్రియ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
- టీడీపీ నేతగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేస్తుండగా భూమా అఖిల వర్గీయులు రాళ్ళ దాడి చేశారన్న ఆరోపణా ఉంది. నంద్యాలలో కూడా అఖిల వర్గీయులు , ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు ఘర్షణకు కూడా దిగారన్న ఆరోపణలున్నాయి.
- ఏవీ సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు..కడపలోనూ వీరిపై కేసు నమోదైంది.
- భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు భూమా కిశోర్‌రెడ్డి.. అఖిలప్రియతో విభేదించి బీజేపీలో చేరడంతో వారి మధ్య కూడా విభేదాలు తలెత్తాయి.
- ఆ జిల్లాలో విజయా డైరీ చైర్మన్ పదవి మరో వివాదానికి కారణమైంది. చైర్మన్‌గా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆ పదవి నుంచి తప్పుకుని..జగత్ విఖ్యాత్‌రెడ్డికి పదవి ఇవ్వాల్సిందిగా తమపై ఒత్తిడి చేశారని, ఇంటికి వచ్చి బెదిరించారని నారాయణరెడ్డి అఖిలప్రియ, భార్గవ్, జగత్ విఖ్యాత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
- ఆళ్లగడ్డలో క్రషర్‌లో భాగస్వామిగా ఉన్న తనపై బెదిరింపులకు దిగారని, క్రషర్‌ని తమకు ఇచ్చేయాల్సిందిగా బెదిరించారని ఆరోపణ. ఆ నియోజకవర్గ పరిధిలో దొర్లిపాడు మండల పరిధిలో ఉన్న శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ యజమానులు శివరాంరెడ్డి, మాధవీలతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- అదే ప్రాంతంలోని కొండాపూర్ క్రషర్ విషయంలోనూ పోలీసులకు ఇలాంటి ఫిర్యాదులే అందాయి.
- ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి కేసులూ నమోదయ్యాయి. గతంలో హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ ఏరియాలో ఓ స్కూల్‌లో భార్గవ్‌రామ్ ఉండడంతో పోలీసులు ఓ కేసులో విచారించేందుకు అక్కడికి వెళ్లారు. ఆ సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, ఓ కానిస్టేబుల్ మొబైల్ లాక్కున్నారన్న ఫిర్యాదు మేరకు గచ్చిబౌలిలో కేసు నమోదైనట్టు సమాచారం.
- తమ విధులకు భార్గవ్ సహకరించడం లేదని ఆళ్లగడ్డలోనే ఎస్సై రమేష్ కుమార్ స్వయంగా పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయడం సంచలనం రేపింది.
- ఇక కొంత కాలం క్రితం తన భర్త భార్గవ్‌రామ్ కనిపించడం లేదని, వైసీపీ , పోలీసులే ఇందుకు కారణమని అఖిల ప్రియ ఆరోపణలు చేశారు. వారే తన భర్తను తీసుకెళ్లారని, తమపై కక్ష సాధింపు జరుగుతోందని, ఫేక్ కేసులు పెడుతున్నారని విమర్శించారు అఖిల ప్రియ.
- కాగా గతంలో అఖిలప్రియపై ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డి ఆస్తుల తగదాతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారని ప్రచారం జరిగినా.. జగత్ విఖ్యాత్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. తనకు, తన సోదరికి ఎలాంటి వివాదం లేదని, తాను దుబాయ్‌లో ఉన్నానని, తమ ప్రత్యర్థులే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆ వీడియోలో వెల్లడించారు.
మొత్తం మీద శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిల మరణం తరువాత అఖిల ప్రియ పలు వివాదాల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలు ఉన్న సమయంలో ఆ కుటుంబానికి నమ్మకస్తులుగా ఉన్నవారు కొందరు హ్యాండ్ ఇవ్వడం, మరికొందరు కూడా రాజకీయ, ఆర్థిక కారణాలు, అఖిల ప్రియ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దూరమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నాగిరెడ్డి ప్రత్యర్థులైన శిల్ప వర్గం ఆళ్లగడ్డ, నంద్యాలలో తన పట్టును పెంచుకుంటోందనే ప్రచారం జరుగుతోంది