తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త, ఈ కేసులో ఏ3గా ఉన్న భార్గవరామ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన దొరికితేనే ఈ కేసులో ఏం జరిగిందనే విషయాలు వెల్లడి కానున్నాయి. ఈ కేసులో తొలుత ఏ1గా సుబ్బారెడ్డి , ఏ2గా మాజీ మంత్రి అఖియప్రియ పేర్లను చేర్చిన పోలీసులు.. రిమాండ్ రిపోర్ట్‌లో ఏ1గా అఖిలప్రియ పేరును చేర్చారు. ఏ2గా ఏవీ సుబ్బారెడ్డి పేరును చేర్చారు. కాగా ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు పిలిపించి విచారించి వదిలేసినట్లు తెలుస్తోంది. తన తండ్రిని పోలీసులు విచారించి వదిలేశారని సుబ్బారెడ్డి కుమార్తె మౌనికారెడ్డి సోషల్ మీడియాలో వీడియోలో చెప్పారు.
గతంలోనే ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు
కాగా ఏవీ సుబ్బారెడ్డి గత ఏడాది అఖిలప్రియపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను హత్య చేయించేందుకు అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ ప్రయత్నిస్తున్నారని గతంలో ఫిర్యాదు చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ కేసుతో తనకు సంబంధం లేదని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజా కేసులో ఏ3గా ఉన్న భార్గవ్‌రామ్, మరో నిందితుడిగా భావిస్తున్న భార్గవ్‌రామ్ సోదరుడు చంద్రహాస్‌లు పరారీలో ఉన్నారు. వీరు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేక టీంలను అక్కడికి పంపినట్టు తెలుస్తోంది.
తెలియకుండా సెటిల్‌మెంట్ ..వివాదం
హఫీజ్‌పేటలోని సర్వే నెంబరు 80లో ఉన్న 25 ఎకరాల భూవివాదం ఈ కిడ్నాప్ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఈ భూముల లావాదేవీల్లో సుబ్బారెడ్డికి, కిడ్నాపైన ప్రవీణ్‌రావుకి, మాజీ మంత్రి అఖిలప్రియకు మధ్య వివాదం నడుస్తోంది. గతంలో ఏవీ ఎస్టేట్‌గా ఉన్న బోర్డు..కొంత కాలం క్రితం పీవీ ఎస్టేట్‌గా మారిన నేపథ్యంలో.. అఖిలప్రియ భర్త భార్గవ్ ఈ విషయంలో వివాదానికి దిగారని తెలుస్తోంది. సుబ్బారెడ్డికి సంబంధం లేని వ్యవహారంలో ఆయనతో ఎలా సెటిల్‌మెంట్ చేసుకుంటారని ప్రవీణరావుతో గతంలో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.
Also Read: వారు దొరికితేనే.. కిడ్నాప్‌పై క్లారిటీ
రేపు వాదనలు..
ఈ కేసులో అఖిలప్రియతో పాటు మరో ఏడుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. అఖిలప్రియను సికింద్రాబాద్ కోర్టులో ప్రవేశపెట్టగా..రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అఖిలప్రియ గర్భిణి అని, తనకు వైద్య సహాయం అవసరమని, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. జైలులోనే అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని, ఆమె ఆరోగ్య పరిస్థితిని బట్టి జైలు అధికారుల నివేదిక వస్తే.. పరిశీలిస్తామని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
కీలకంగా మారిన ఫోన్ కాల్స్..
ఇక పోలీసుల అదుపులో ఉన్న కిడ్నాపర్లు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిలప్రియ, భార్గవ్‌రామ్, అతని సోదరుడు చంద్రహాస్ తదితరుల ఫోన్ కాల్స్ కీలకంగా మారనున్నాయి. ప్రవీణ్ రావును కిడ్నాప్ చేసే కంటే ముందు నుంచి వీరి నుంచి ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయి..ఏ లొకేషన్‌లో ఆ ఫోన్లు ఉన్నాయనే అంశంపై పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. కిడ్నాపర్లు డైరెక్ట్‌గా భార్గవ్ రామ్‌తో మాట్లాడారా లేక మరోవ్యక్తి ద్వారా మాట్లాడారా అనేది తేలాల్సి ఉంది.
రంగంలోకి ఐటీ శాఖ..
తాజా ఘటనలో పెద్దయెత్తున డబ్బు చేతులు మారినట్టు చర్చ జరుగుతోంది. రూ.వందల కోట్ల విలువైన భూ వ్యవహారంలో గతంలో తాము సుబ్బారెడ్డితో వివాదాన్ని పరిష్కరించుకుంటున్నట్లు ప్రవీణ్‌రావుల సంబంధీకులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఆ పరిష్కారం కోసం ఆర్థిక లావాదేవీలేమైనా జరిగాయా అనే కోణంలో ఐటీ శాఖ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కిడ్నాపర్లు ఐటీ అధికారులమని చెప్పడం, నకిలీ ఐడీ కార్డులు చూపించడంతో ఆ శాఖ కూడా రంగంలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భార్గవ్ పోలీసులకు దొరికితేనే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.
Also Read: ఆ హరీష్ కోసం వచ్చి.. వీరిని కిడ్నాప్ చేశారా?