నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉంటూ.. రాజధానికి వచ్చిపోయే వారికి అందుబాటులో ఉంటూ.. కేపిటల్ ఎయిర్ పోర్టుగా పేరుగాంచిన గన్నవరం ఎయిర్ పోర్టు గురించి ఇప్పుడు ఏపీ సర్కారు జబ్బలు చరుచుకుంటున్న వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పడకేసిన నేపథ్యంలో ఏపీలో ఎయిర్ ట్రాఫిక్ ఘోరంగా పడిపోయింది. ఫలితంగా స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఏకంగా తన సర్వీసులన్నింటినీ ఏపీ నుంచి ఉపసంహరించుకుంది. ఇలాంటి నేపథ్యంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు ఎయిర్ ఇండియా వన్ గా పిలిచే బోయింగ్ 777 వచ్చిందని చంకలు గుద్దుకోవడాన్ని చూస్తే.. నిజంగానే ఏపీ సర్కారుపై జాలి వేయక మానదు. అసలు ఎయిర్ ట్రాఫిక్కే లేని సమయంలో ఎయిర్ ఇండియా వన్ వచ్చినా.. దానికంటే పెద్ద విమానాలు వచ్చినా ప్రయోజనమేముందన్న రీతిలో కొత్త చర్చ జరుగుతోంది. ఎయిర్ ఇండియా వన్ విమానం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల పర్యటనకే వినియోగిస్తున్నా.. ఈ విమానం రాకతో ఏపీకి ఇంకా పెద్ద పెద్ద విమానాలు వస్తాయన్నట్లుగా జగన్ సర్కారు చెప్పుకోవడం నిజంగానే వింతగా ఉందన్న మాట వినిపిస్తోంది.
బాబు హయాంలో డబుల్ ట్రాఫిక్
తెలుగు నేల విభజన తర్వాత 13 జిల్లాలతో, లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణం ప్రారంభించిన నవ్యాంధ్రను వీలయినంత త్వరలో అభివృద్ధి పథాన నడపాలన్న దీక్షతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. సీఎం హోదాలో ఎంతగా తాపత్రయపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో విదేశాలు చుట్టివచ్చే చంద్రబాబు.. రాష్ట్రానికి ఆయా దేశాలకు చెందిన బహుళ జాతి సంస్థలు రాష్ట్రం వైపు చూసేలా చేశారు. ఫలితంగా రాష్ట్రానికి వచ్చిపోయే విదేశీ పారిశ్రామిక వేత్తలు, ఆయా దేశాల ప్రభుత్వాల ప్రతినిధులతో ఏపీలో ఎయిర్ ట్రాఫిక్ అమాంతంగా పెరిగిపోయింది. గన్నవరంతో పాటు విశాఖ ఎయిర్ పోర్టులోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనించిన చంద్రబాబు.. గన్నవరం ఎయిర్ పోర్టును విస్తరించాలని తీర్మానించారు. అందుకు కేంద్రం నుంచి అనుమతులు సాధించి గన్నవరం ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా వన్ వంటి పెద్ద విమానాలు కూడా దిగేలా కొత్త రన్ వేను నిర్మించారు. ఈ పనులు శరవేగంగా సాగుతున్న క్రమంలోనే 2019 ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ గెలవడం జరిగిపోగా.. తాను నిర్మించిన రన్ వేను ప్రారంభించకుండానే.. చంద్రబాబు సీఎం కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. చంద్రబాబు సర్కారు నిర్మించిన కొత్త రన్ వేను వైసీపీ సర్కారు ఇటీవలే ప్రారంభించింది. అంటే.. చంద్రబాబు హయాంలో నిర్మితమైన ఈ రన్ వేతోనే ఇప్పుడు ఏపీకి ఎయిర్ ఇండియా వన్ వచ్చేసింది.
లాభం లేదు బాసూ
ఇప్పుడు గన్నవరం ఎయిర్ పోర్టుకు ఎయిర్ ఇండియా వన్ వచ్చి దిగ్విజయంగా ల్యాండ్ అయ్యిందని జగన్ సర్కారు చంకలు గుద్దుకోవచ్చు గానీ.. దీని వల్ల కొత్తగా వచ్చిన లాభమేమిటన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. విదేశాల నుంచి వచ్చే వారు కాదు కదా.. కనీసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రానికి వస్తున్న వారు లేరు. అంతేనా.. రాష్ట్రంలో జగన్ సర్కారు సాగిస్తున్న పాలనను చూసి భయపడిపోతున్న రాష్ట్రవాసులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎయిర్ ట్రాఫిక్ అమాంతంగా పడిపోయింది. దీని కారణంగానే ఇప్పుడు రాష్ట్రంలో స్పైస్ జెట్ విమానాలు తిరగడం లేదు. మరి చిన్న విమానాలైన స్పైస్ జెట్ విమానాలకే సరిపడినంత మంది ప్రయాణీకులు లేకుంటే. ఇక ఎయిర్ ఇండియా వన్ రాష్ట్రానికి రావడం వల్ల ప్రయోజనం ఏముంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Must Read ; జగనోరి ఘనత.. ఎయిర్‌పోర్టులన్నీ ఖాళీ











