వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారో గానీ.. రాష్ట్ర అభివృద్ధి తిరోగమన బాట పట్టేసింది. కొత్త పరిశ్రమలు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకపోగా.. అప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న బడా పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రాన్ని వీడిపోతున్నాయి. ఇప్పటికే లులూ గ్రూప్ తో పాటు దేశీయ పారిశ్రామిక రంగ దిగ్గజం రిలయన్స్ కూడా తిరుపతిలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ను రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఈ విఫరిణామాల ఫలితంగానే.. ఏపీలో విమాన సర్వీసులు నడపలేమంటూ ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. పారిశ్రామిక ప్రగతి పడకేస్తే.. బయటి నుంచి రాష్ట్రానికి ప్రముఖులు అయినా, సామాన్యులు అయినా పెద్దగా రాకపోకలు సాగించే అవకాశాలుండవు కదా. ఈ కారణంగా ఇటీవలి కాంలో స్పైస్ జెట్ బుకింగ్ లు దారుణంగా పడిపోయాయట. గతంలో పోలిస్తే కనీసం 30 శాతం బుకింగ్ లు కూడా కావడం లేదట. వెరసి ఓ రెండు నెలల పాటు ఏపీలో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా ఆ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటన వెలువడినంతనే.. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు ఖాళీగా మారిపోయిందట.
స్పైస్ జెట్ ఏమందంటే..?
కనీసం 30 శాతం కూడా బుకింగ్ లు లేని కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తమ విమాన సర్వీసులను నడపలేమని, ఓ రెండు నెలల పాటు ఇక్కడి నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లుగా స్పైస్ జెట్ శుక్రవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. గన్నవరం నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం నగరాలకు తాము నడిపే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే గన్నవరంలో ఉన్న స్పైస్ జెట్ విమానాలను అక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని తమ కేంద్ర కార్యాలయానికి ఉన్న గురుగ్రామ్ కు వెళ్లిపోయాయట. దీంతో ఒక్కసారిగా గన్నవరం ఎయిర్ పోర్టు బోసిపోయి కనిపించింది. అయినా 30 శాతం బుకింగ్ లతో విమాన సర్వీసులను తామే కాదు.. ఏ సంస్థ కూడా నడపలేదని సంస్థ అభిప్రాయపడింది. ఒకవేళ ట్రాఫిక్‌తో పాటు బుకింగ్ లు పెరిగితే అప్పుడు చూద్దామని, ఓ రెండు నెలల తర్వాత తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని ఆ సంస్థ వెల్లడించింది. గన్నవరంతో పాటుగా రాష్ట్రంలోని ఇతర ఎయిర్ పోర్టుల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొన్నట్లుగా సమాచారం.
టీడీపీ జమానాలో పరిస్థితి ఎలా?
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా.. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు, ప్రభుత్వంతో చర్చించేందుకు, ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాలు చూసేందుకు, ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి నిత్యం ప్రముఖులు విజయవాడ వచ్చేవారు. వీరి రాకపోకలతో గన్నవరం ఎయిర్ పోర్టుతో పాటుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని ఎయిర్ పోర్టులు కూడా కళకళలాడేవి. విమానయాన సంస్థలకు కూడా పెద్ద ఎత్తున బుకింగ్ లు జరిగేవి. ఇలా ఒక్క స్పైస్ జెట్ కే ఏకంగా 80 శాతం మేర బుకింగ్ లు అయ్యేవట. దీంతో మంచి లాభాలతోనే స్పైస్ జెట్ తో పాటు ఇతర విమానయాన సంస్థలు తమ సేవలను అందించేవి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గన్నవరం ఎయిర్ పోర్టులో కొత్త రన్ వేను కూడా నిర్మించారు. ఈ రన్ వేను ఇటీవలే జగన్ సర్కారు ప్రారంభించింది. అయితే రన్ వే పెరిగినా.. ట్రాఫిక్ లేకుండా వినామాలు నడిచేదెలా? ఈ దిశగానే ఆలోచించిన స్పైస్ జెట్ కాస్తంత ధైర్యం చేసి ఇతర విమానయాన సంస్థల కంటే ముందుగా జగన్ సర్కారుకు ఝలక్ ఇచ్చింది.
Must Read ;- జగన్ అండ్ కోకు మరింత ముప్పు











