Botsa Satyanarayana Comments Against Jagan On Three Capitals Issue :
నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధానిగా ఎంపిక చేసిన అమరావతిని పురిట్లోనే చంపేసే దిశగా కదిలిన జగన్ సర్కారు.. మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చి తనదైన మార్కు మోసానికి తెర తీసింది. ఇప్పటికే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఏర్పాటైన అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేసేసి.. విశాఖలో పరిపాలనా రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. దీనిపై అసెంబ్లీతో వ్యతిరేకత రాకున్నా.. టీడీపీ మెజారిటీ ఉన్న శాసనమండలిలో ఏ మేర రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అసవరం లేదు. అయితే మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ ఏ ముహూర్తాన చేపట్టారో గానీ.. అన్నింటా అడ్డంకులే ఎదురవుతున్నాయి. హైకోర్టు మెట్లు ఎక్కిన ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇక అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు 600 రోజులకు పైబడి నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కరోనా జగన్ ను ఎక్కడికీ కదలనీయడం లేదు. వెరసి.. ఇన్ని అపశకునాల నేపథ్యంలో మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ అటకెక్కించేశారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయితే జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్న పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం మూడు రాజధానులపై వెనక్కు తగ్గేదే లేదన్నట్లుగా సోమవారం నాడు సంచలన ప్రకటన చేశారు.
పిటిషనర్లు వాయిదా కోరవద్దా?
మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా.. ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకునేలా జగన్ సర్కారును ఆదేశించాలని కోరుతూ రాజదాని రైతులతో పాటుగా మరికొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని గతంలో చెప్పిన హైకోర్టు ధర్మాసనం.. వాటి విచారణను సోమవారం నాడు చేపట్టింది. ఈ సందర్భంగా అనివార్య కారణాలను చూపుతూ పిటిషనర్ల తరఫు న్యాయవాది విచారణను వాయిదా వేయాలని కోరారు. మరో పిటిషనర్ తరఫు న్యాయవాది ఇప్పటికిప్పుడే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈలోగా కల్పించుకున్న ప్రభుత్వ న్యాయవాదిగా హాజరైన శ్రీరామ్.. ఈ పిటిషన్ల విచారణను ఏకంగా నవంబర్ నెలకు వాయిదా వేయాలని కోరారు. కోర్టులో ఇంత తతంగం జరిగితే.. మొత్తాన్ని వదిలేసిన బొత్స సోమవారం రాత్రి మీడియా ముందుకు వచ్చి.. తాము దాఖలు చేసిన పిటిషన్ల విచారణను పిటిషనర్లు ఎవరైనా కోరతారా? అంటూ తనదైన రీతిలో మాట్లాడారు. పిటిషనర్లే వాయిదా కోరితే.. అందులో ఏదో మతలబు దాగి ఉంది కదా అని కూడా బొత్స వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే.. మూడు రాజధానుల ప్రతిపాదనపై ఎలాంటి పరిస్థితుల్లోనే వెనక్కు తగ్గేది లేదని, పరిపాలన రాజధాని విశాఖకు వచ్చి తీరుతుందని సంచలన ప్రకటన చేశారు. కోర్టు తీర్పుల ద్వారానే రాజధానిని విశాఖకు తరలిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.
ఒక్కో అడుగూ వెనక్కు..
ఇదిలా ఉంటే.. అసలు మూడు రాజధానులను ఎప్పుడో అటకెక్కించినట్లుగా ఇప్పుడు జగన్ సర్కారు వరుసగా సంచలన నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదనను అటకెక్కిస్తున్నట్లుగా జగన్ ఒక్కొక్క సంకేతాన్ని విడుదల చేస్తూ సాగుతున్నారు. కర్నూలుకు హైకోర్టును తరలించే ప్రతిపాదనను విరమించుకున్న జగన్.. అమరావతిలోని ప్రస్తుత హైకోర్టు భవనాన్ని మరింత విస్తరించే ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో పాటుగా ఏకంగా నిధులను కూడా విడుదల చేశారు. తాజాగా అమరావతిని రాయలసీమతో కనెక్ట్ చేసేందుకు ఉద్దేశించిన జాతీయ రహదారి పనులకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు జగన్ సర్కారు సమాయత్తమవుతోంది. అనంతపురం జిల్లా నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా ఏర్పాటు కానున్న ఈ సిక్స్ లేన్ ను చంద్రబాబు సర్కారే ప్రతిపాదించగా.. జగన్ సీఎం అయ్యాక ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. అయితే మూడు రాజధానులపైతన మనసు మార్చుకున్నట్లుగానే కనిపిస్తున్న జగన్ ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం గమనార్హం. మరి జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలన్నీ బొత్సకు తెలియవనుకోవాలా? లేదంటే.. తెలిసినా.. జగన్ నిర్ణయాన్ని కూడా ధిక్కరించే రీతిలో బొత్స సాగుతున్నారా? అన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- ఫారిన్ టూర్ కు జగన్.. ఎందుకోసమంటే?