నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక దగ్గరపడడంతో పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తామే గెలుస్తామనే ధీమాతో ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలోనూ వ్యూహాత్మకంగానే వ్యవహరించాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి పేరు ఖరారైంది. మంగళవారంతో నామినేషన్లు ముగియనుండగా సోమవారం నాడు బీజేపీ, టీఆర్ఎస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక టీడీపీ మొవ్వ అరుణ్ కుమార్‌ను తన పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రధాన పార్టీల వ్యూహాలు, గెలుపు అంచనాల విషయానికి వస్తే.. ముగ్గురు అభ్యర్థులు మూడు సామాజిక వర్గాలకు చెందిన వారని చెప్పవచ్చు. అయితే జానారెడ్డి విషయంలో సామాజికవర్గంతో పాటు ఆయన సీనియర్టీ కూడా కీలకంగా మారిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఎవరి లెక్కలు వారికి..
అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల్లో అసమ్మతి తలెత్తే అవకాశం కనిపిస్తోంది. అసమ్మతివాదులు నామినేషన్లు వేసినా, వేయకున్నా..ఎన్నికల్లో ఆయా పార్టీల కోసం పనిచేస్తారా..సైలెంట్‌గా ఉంటారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఆయా పార్టీల బలాబలాలు, సామాజిక వర్గాల ఓట్లు, ప్రతికూల అంశాలను పరిశీలిస్తే..
టీఆర్ఎస్ అనుకూల అంశాలుః
అధికార పార్టీ కావడం, పార్టీకి ఉన్న కేడర్.
నోముల నర్సింహయ్యకు ఉన్న ఛరిష్మా, సానుభూతి.
మొత్తం 2.1లక్షల ఓట్లలో 34వేల ఓట్లు ఆ సామాజికవర్గానికి ఉండడం
నోముల భగత్ విద్యావంతుడు కావడం, ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం.
టీఆర్ఎస్ ప్రతికూల అంశాలు
నోముల నర్సింహయ్య స్థానికుడు కాకపోవడం.
నోముల నర్సింహయ్య నియోజకవర్గ ప్రగతి కోసం చేసిన పనుల్లో పెద్దగా నిధుల కేటాయింపు లేకపోవడం.
కేవలం సానుభూతి, ఛరిష్మా, కేసీఆర్‌పై ఆధారపడడం.
నోముల భగత్ గెలుపొందినా మంత్రులు, పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అదే నియోజకవర్గంలోని సీనియర్ల పెత్తనం ఎక్కువవుతుందనే ప్రచారం.
టిక్కెట్ దక్కని వారు ఎంతవరకు సహకరిస్తారనే అనుమానాలు ఉండడం.
కాంగ్రెస్ అనుకూల అంశాలు
జానారెడ్డి సీనియార్టీ, పార్టీ సంస్థాగత నిర్మాణం
జానారెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి
సామాజిక, ఆర్థిక సమీకరణాలు
అన్ని సామాజికవర్గాల్లో జానారెడ్డి వర్గీయులు ఉండడం
కాంగ్రెస్ ప్రతికూల అంశాలు
పార్టీ ప్రస్తుతం వైఫల్యాల బాటలో ఉండడం.
నియోకజవర్గంలో జానారెడ్డి వర్గీయుల్లో కొందరు టీఆర్ఎస్, కొందరు బీజేపీ వైపు వెళ్లడం.
బీసీ ఓట్లను టీఆర్ఎస్, ఎస్టీ ఓట్లను బీజేపీ చీల్చే సూచనలు ఉండడం.
జానారెడ్డి గెలిస్తే.. కేసీఆర్‌కే మంచిదని, బీజేపీకి బ్రేక్ వేయవచ్చని మరో వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం
బీజేపీ సానుకూల అంశాలు
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు
ఎస్టీ సామాజికవర్గం నుంచి అభ్యర్థి ఎంపిక
రెడ్డి, బీసీ ఓట్లు కాంగ్రెస్, టీఆర్ఎస్ లు చీల్చడంతో ఎస్సీ,ఎస్టీ ఓట్లు 40వేలు తమకే పడతాయన్న అంచనా
మోదీ, అమిత్ షాల ఛరిష్మా
బీజేపీ ప్రతికూల అంశాలు
ఇప్పటివరకు పార్టీకి వ్యవస్థాగతంగా పట్టులేకపోవడం
ఇప్పటికే నివేదిత రెడ్డి నామినేషన్ వేయడం, తరువాత పార్టీ నుంచి అభ్యర్థిగా రవికుమార్ నాయక్ ఎంపిక కావడం
కాంగ్రెస్, టీఆర్ఎస్‌లతో పోల్చితే ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు బలహీనంగా ఉండడం
అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్య
ఈ సమీకరణాలను బట్టి పార్టీలు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీలకు ఇది జీవన్మరణ సమస్యగా మారిన తరుణంలో పార్టీలు ప్రతి ఓటును కీలకంగా భావిస్తున్నాయని చెప్పవచ్చు. అదే సమయంలో పార్టీలు అసమ్మతి తలెత్తకుండా చూడడం, రెబెల్స్‌ను శాంతపర్చడం, హామీలు ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టాయి. అయితే అవి ఎంతవరకు ఫలితాలన్నిస్తాయో చూడాలి. ఇక గతంలో ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంకు బలంగా ఉండేది. ఇప్పుడు ఆ ఓట్లు ఎటు వెళ్తాయి, టీడీపీ కూడా బరిలో ఉన్నందున టీడీపీకి పడతాయా అనేది కూడా పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తుందని చెప్పవచ్చు.
Must Read ;- కాంగ్రెస్ VS టీఆర్‌ఎస్ మధ్యలో బీజేపీ.. సాగర్ ఈదేదెవరో..?