దుబ్బాకలో దుమ్ము రేగింది. గ్రేటర్‌లో మ్యాటర్ అదిరింది. గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకా అదుర్స్ అనిపించాయి. కమలం గ్రాఫ్ ఒక్కసారిగా లేచి.. అలా దిగి.. ఇలా పడిపోయినట్లైంది. గులాబీ గ్రాఫ్ కూడా అలా పడినట్లే పడి మళ్లీ లేచింది. దీంతో తెలంగాణలో ఇప్పుడు అందరి చూపు నాగార్జునసాగర్ వైపే ఉంది. సాగర్‌లో ఈది గెలిచేదెవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మొన్నటి వరకు బీజేపీ సూపర్.. కారు పంక్చర్ అనుకున్నోళ్లంతా.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కాస్త వెనక్కు తగ్గుతున్నారు.
కాంగ్రెస్ , టీఆర్ఎస్ రెండూ బలంగానే..
నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ బలంగానే ఉంది. టీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది. గడచిన రెండు ఎన్నికల్లోనూ పోటాపోటీ నడిచింది. అవటానికి టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అయినా.. కాంగ్రెస్‌కు కార్యకర్తల బలం బాగానే ఉంది. జానారెడ్డి కూడా సీనియర్ నేత. కాని సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద కాన్ఫిడెన్స్ రోజురోజుకు పోతోంది. అది సాగర్ ప్రాంతంలోనూ అలానే ఉందా లేదా అన్నది చూడాలి. కాకపోతే టీఆర్ఎస్‌కు ఇక్కడ పోటీ లేదా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే.. అదైతే క్లియర్. ఇక్కడ కోమటిరెడ్డి బదర్స్‌తో ఉన్న వైరం జానారెడ్డికి మైనస్. ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో కాస్త పట్టు ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ జానారెడ్డికి సహకరించేలా లేరు. ముఖ్యంగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరతానని డైరెక్టుగా చెప్పేశారు. వెంకటరెడ్డి ఎదుగుదలని అడ్డుకోవడానికి జానారెడ్డి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందువల్ల బ్రదర్స్ ఇద్దరూ చేసే అవకాశం లేదు. జానారెడ్డి సైతం గత కొంతకాలంగా యాక్టివ్‌గా లేరు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నయం.. అసెంబ్లీలోనైనా ఏదో ఒకటి మాట్లాడి హైలెట్ అయ్యేవారు.. ఓడిపోయాక… అది కూడా లేదు.
సామాజిక వర్గం, సానుభూతి
ఇక టీఆర్ఎస్ సంగతి చెప్పాలంటే.. నోముల నర్సింహయ్య కొడుకు భగత్‌కే టిక్కెట్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. యాదవ సామాజికవర్గం, పైగా నోముల వారసుడిగా సానుభూతి రెండూ కలిసొస్తాయనుకుంటోంది. అధికార పార్టీగా ఎటూ అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే టిక్కెట్ ఆశిస్తున్న ఇతర నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పని చేయకుండా చూసుకోవాల్సి ఉంటుందనే అంచనాలో ఉంది.
బీజేపీది మూడో స్థానమే..
ఇక బీజేపీది ఇక్కడ మూడో స్థానమే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరిని అభ్యర్ధిగా నిర్ణయించాలో తేల్చుకోలేకపోతోంది. పైగా ఇక్కడ స్థానికంగా పెద్దబలం లేదు. ఇంకోవైపు కేంద్రంలోని తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణ పాలసీలు.. పైగా తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బయపడ్డ విషయం… ఇవన్నీ బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి.
మొత్తం మీద ఎటు నుంచి చూసినా.. టీఆర్ఎస్ కాంగ్రెస్‌ల మధ్య పోరు గట్టిగానే జరగనున్నది. అయితే టీఆర్ఎస్ అధికార పార్టీ కావడం.. కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం.. అన్నీ కలిసొచ్చి.. గులాబీయే జయకేతనం ఎగరేస్ ఛాన్స్ కనపడుతోంది.
Must Read ;- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చెమటలు.. సాగర్ బరిలోనూ తీన్మార్ మల్లన్న?