తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి..తెలంగాణలో అస్తిత్వ ముప్పు వాటిల్లుతుందా, పటిష్టమైన వ్యవస్థాగత నిర్మాణం ఉన్నప్పటికీ.. కేడర్‌ను కాపాడుకునే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విఫలం అయ్యారా అనే చర్చ పార్టీలో మొదలైంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. కాని ఘన చరిత్ర కలిగిన పార్టీ, సీనియర్ అభ్యర్థులు కూడా కనీస పోటీ ఇవ్వలేకపోవడం వైఫల్యంగానే చెప్పాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ (హైదరాబాద్), వరంగల్-ఖమ్మం-నల్గొండ (నల్గొండ) గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ లీడ్‌లో కొనసాగుతోంది. ఇంకా గెలుపోటములు ఎవరివి అనేది తేలలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం గెలిచే అవకాశం లేదు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి చిన్నారెడ్డి నాలుగో స్థానంలో కొనసాగుతుండగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి, బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్ తొలిమూడు స్థానాల్లో ఉన్నారు. ఇక నల్గొండ ఎమ్మెల్సీ స్థానం విషయానికి వస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తొలినాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
Must Read ;- తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది: జేసీ దివాకర్ రెడ్డి
సహకారం అంతంతమాత్రమే..
నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ ఇప్పటికే కొన్ని విమర్శలు చేశారు. తనకు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఒక్కరే సహకరించారని, జిల్లా అధ్యక్షులు సహకరించలేదని వ్యాఖ్యానించారు. గతంలో చాలా తక్కువ ఓట్లు వచ్చిన కోదండరాంకి ఈ సారి 80వేల ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇదే పలు అనుమానాలకు కారణం అవుతోంది. ఖమ్మం జిల్లాలో వామపక్షాలు, టీఆర్ఎస్‌లకు ఎక్కువ పట్టు ఉందని కాంగ్రెస్ చెబుతున్నా.. నల్గొండలో కాంగ్రెస్‌కు కీలక నేతలు ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి వారు ఉన్నారు. వరంగల్ జిల్లాలోనూ కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు ఉంది. ఆ జిల్లాల్లోనూ గ్రాడ్యుయేట్స్ ఓట్లు కాంగ్రెస్ రాబట్టుకోలేకపోయింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. బీజేపీ, కాంగ్రెస్‌లు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేశాయి. స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్ బరిలో నిలిచారు. నామినేషన్లకు రెండురోజుల గడువు ఉందన్న సమయంలో టీఆర్ఎస్ అనూహ్యంగా పీవీ కుమార్తెను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి బరిలోకి దిగారు. పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డితోపాటు పలువురు నేతలు ప్రచారం చేశారు. అయినా కనీస పోటీ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్. ఓవైపు ఉద్యోగాల విషయంతోపాటు టీఆర్ఎస్‌ది అవినీతి పాలన అని రోజూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ..క్షేత్ర స్థాయిలో ఆమేరకు ప్రభావితం చేయలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
విభేదాలే కారణాలా..
కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ప్రధానంగా విబేధాలే కారణమని చెప్పవచ్చు. అభ్యర్థుల ఎంపిక సమయంలో ఉన్నంత ఉత్సాహం కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపించలేదు. ఎన్నికలకు మూడు రోజుల ముందు పరిస్థితి మరీ దారుణం. కొందరు నేతలు కనీస ప్రచారానికి కూడా రాలేదు. వర్గ విభేదాలు ఒక కారణం కాగా.. వీరు గెలిస్తే తమకు ప్రాధాన్యం తగ్గుతుందనే ఉద్దేశం కూడా కారణంగా కనిపిస్తోంది. ఇక వ్యూహాత్మక తప్పిదాల విషయానికి వస్తే మరో అంశం కూడా చర్చకు వస్తోంది. నల్గొండ స్థానం నుంచి పోటీ చేసిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తీన్మార్ మల్లన్న, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా కాంగ్రెస్ మద్దతు కోరారు. అయితే చానాళ్లపాటు నాన్చివేత ధోరణిని అనుసరించింది కాంగ్రెస్ పార్టీ. ఈ లోగా వాళ్లు ప్రచారం మొదలు పెట్టారు.
గతంలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరపునే పోటీ
గతంలో ఈ స్థానం నుంచి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరపునే పోటీ చేశారు.ఈ సారి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగినా కాంగ్రెస్ ఓట్లను తనవైపు తిప్పుకున్నారని చెప్పవచ్చు. వ్యవస్థాగతంగా బలమైన నిర్మాణం కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటర్లను ఆకర్షించలేక పోయింది. కమిటీల ఏర్పాటు జరిగినా…ఆ కమిటీల మధ్య సమన్వయం చేసేవారు కరవయ్యారని చెప్పవచ్చు. యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులు కూడా కొన్నిచోట్ల అంటీముట్టనట్టు వ్యవహరించారన్న చర్చ నడుస్తోంది. ఇందుకు కారణం కూడా ఉంది. ఓవైపు టీపీసీసీ ఇష్యూ పార్టీలో చిచ్చు రేపుతోంది. నాయకుల మధ్య పరస్పర విమర్శలు, అసమ్మతి, వర్గపోరు కారణంగా ఎవరికి సపోర్టు చేస్తే ఏ నాయకుడు ఏమంటాడోనన్న గందరగోళ పరిస్థితికి దారి తీసింది.
Also Read ;- రేవంత్, విశ్వేశ్వర్‌రెడ్డి జట్టు కడతారా.. కొత్త పార్టీ పెడతారా..?