విశాఖ నగరానికి రూ.1400 కోట్లు కేటాయించాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు కేంద్రం ఆమోదం చెప్పే అవకాశం ఉంది. అదే జరిగితే.. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని ఉక్కునగరమేనని పరోక్షంగా ఒప్పుకున్నట్టే. ఒకవైపు బడ్జెట్లో అమరావతి ఊసే లేదు. నిధుల కేటాయింపు లేదు. విభజన హామీలు సాధించుకోవడంతో తీవ్రంగా విఫలమైన వైసీపీ ప్రభుత్వం విశాఖ కోసం మాత్రం.. ప్రతిపాదనలు పంపడం.. 1400 కోట్లరూపాయలకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేయడం చిత్రమే.
మూడు రాజధానులకు కేంద్రం సిద్దంగా ఉందా?
ఏపీలో అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను తెరమీదకు తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టును కర్నూలుకు తరలించాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరిన సంగతి తెలసిందే. పాలనా రాజధానిగా విశాఖపట్నం, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలు ఉంటుందని ఏపీ సీఎం స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. అప్పటి నుంచి అమరావతి రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో 93 కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ రోజు వారీ సాగుతోంది.
కోర్టు తీర్పుకోసం ఏపీ ప్రభుత్వం కూడా వేచిచూస్తోంది. హైకోర్టులో తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే రాజధానిని విశాఖ తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే విశాఖలో రూ.116 కోట్ల వ్యయంతో అతిథి గృహం పేరుతో భారీ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తోంది. హైకోర్టులో రాజధాని తరలింపుపై అనుకూల తీర్పు వెలువడిన వెంటనే అమరావతి నుంచి దుకాణం సర్థివేయాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. లేదంటే మరలా అమరావతి రాజధాని కేసు సుప్రీంకోర్టులో మరికొంతకాలం నడిచే అవకాశం ఉంది. అందువల్ల హైకోర్టు తీర్పు వచ్చి, సుప్రీంకోర్టులో కేసు నమోదు కాకముందే సర్దేయాలని వైసీపీ నేతలు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Must Read ;- అమరావతిపై కమలం ‘త్రి’కరణశుద్ధి అందుకేనా..
కేంద్రం అడుగులు కూడా ఆ దిశగానే …
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ను కోల్పోయినందుకు ప్రతిగా రాజధాని నిర్మించుకునేందుకు ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. అంటే అమరావతి రాజధానికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అమరావతికి ఒక్క రూపాయి ఇవ్వకపోగా విశాఖ నగరంలో మౌలికసదుపాయాల అభివృద్ధి పేరుతో రూ.1400 కోట్లు కేటాయించారు. అవి కూడా ఈ బడ్జెట్లో కాదట. రాబోయే రెండు బడ్జెట్లలో వాటిని సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది. అంటే విశాఖకు ఎప్పుడో ఇవ్వబోయే నిధులకు ఇప్పుడే ఆర్థిక సంఘం సిఫారసు చేస్తోంది. తద్వారా, విశాఖను కేంద్రం రాజధానిగా గుర్తించినట్లే కనిపిస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా కేంద్ర మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గడచిన ఏడాది కాలంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను 8సార్లు కలిశారు. కానీ ఆర్థికమంత్రిని కలిసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. అంటే ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో ఆర్థిక మంత్రిని కలవకుండా కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడంపై నెటిజెన్లు అనేక విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టి, తనపై ఉన్న కేసుల నుంచి బయట పడేయాలని అమిత్ షాను సీఎం అనేకసార్లు కలిశారనే వార్తలను కొట్టివేయలేం.
విశాఖ ఉక్కు ఇక ప్రైవేటు పరం
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమం చేసి 32 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఈ కర్మాగారానికి 22 వేల ఎకరాల భూమి ఉంది. ఇది విలువైన విశాఖ నగరంలో ఉండటంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరం కనీసం రూ. 10 కోట్లు పలుకుతోంది. అందుకే కొందరు బడా పారిశ్రామిక వేత్తలు విశాఖ ఉక్కుపై కన్నేశారని తెలుస్తోంది. ముందుకుగా కంపెనీలో 51 శాతం వాటాను కైవశం చేసుకుని యాజమాన్య హక్కులు చేతుల్లోకి తీసుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయని తెలుస్తోంది.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తే ఉత్తరకోస్తా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అందుకు ప్రతిగా విశాఖ నగర అభివృద్ధికి రూ.1400 కోట్లు కేటాయించారని తెలుస్తోంది. ఇక వైసీపీ నేతలు విశాఖ నగరాన్ని రాజధానిగా చేయాలనుకుంటున్నారు…కాబట్టి రెండు విధాలా కలసి వచ్చే విధంగా నగరానికి నిధుల సిఫారసులు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. విశాఖ అభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అమరావతి రాజధానికి ఒక్క రూపాయి కేటాయించకుండా, విభజన హామీలను తుంగలో తొక్కడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కేంద్రం దృష్టిలో కూడా విశాఖనగరమే రాజధానిగా కనిపిస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది.
Also Read ;- ఒక్కొక్కటిగా విశాఖను వీడుతున్న కంపెనీలు