ఏపీలో అమూల్ అడుగు పెట్టడంతో డెయిరీల మధ్య ధరల యుద్దం నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సంగం, విజయ, జెర్సీ డెయిరీలు రైతులకు చెల్లించే దానికి ఒక్కో లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.7 వరకు ఎక్కువ రేటు లభిస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రభుత్వ ప్రకటనలో నిజం లేదని సంగం డెయిరీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. గుంటూరు జిల్లాలో సంగం డెయిరీ ద్వారా 6 వెన్నశాతం ఉండే గేదె పాలకు రూ.46.83 చెల్లిస్తున్నామని, అమూల్ ఇదే పాలకు చెల్లించేది కేవలం రూ.45.48 మాత్రమేనని సంగం డెయిరీ ఛైర్మన్ తెలిపారు. అమూల్ డెయిరీ లీటరు పాలకు రూ.7 దాకా అదనంగా చెల్లిస్తోందని సాక్షాత్తూ సీఎం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తేటతెల్లం అవుతోందని సంగం డెయిరీ పాలక మండలి అభిప్రాయపడింది.
ధరల్లో పెద్ద తేడాలు లేవు
పాల సేకరణ ధరల్లో అన్ని డెయిరీల మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. ఒక వేళ ఉన్నా అది పైసల్లో మాత్రమే. లీటరుకు ఐదారు రూపాయలు తేడా ఉంటే ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే పాలు పోస్తారు. అందుకే సహకార, ప్రైవేటు డెయిరీలన్నీ కూడా కాంపిటీటివ్ ప్రైస్ చెల్లిస్తున్నాయి. అమూల్ ఏపీలో పాల సేకరణ ప్రారంభించినా ఇదే పరిస్థితి. అయితే ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు అమూల్‌కు ఇవ్వడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
అమూల్ పై అంత ప్రేమ ఎందుకంటే?
ఏపీలో ప్రతిపక్ష అధినేత కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీని దెబ్బతీసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చని వారు చెబుతున్నారు. అనేక ప్రయివేటు డెయిరీలు, సహకార డెయిరీలు మూడు దశాబ్దాలుగా పాడి రైతులకు సేవలు అందిస్తున్నాయి. అమూల్ కన్నా పది పైసలు ఎక్కువే చెల్లించేందుకు డెయిరీలు సిద్దం అవుతున్నాయి. పాడి రైతులకు సమాన ధర చెల్లిస్తే ఇక అమూల్ పాల సేకరణ అంత ఈజీ కాదని అర్థం అవుతోంది. రాష్ట్రంలో సహకార రంగంలో విజయవంతంగా నడుస్తోన్న సంగం, విజయ డెయిరీలను బొందపెట్టే ఆలోచనలను మానుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అనేక సేవలు అందిస్తున్న సహకార రంగం
సహకార డెయిరీలు పాడి రైతులకు అనేక సేవలు అందిస్తున్నాయి. ఉదాహరణకు సంగం డెయిరీని తీసుకుంటే ఏటా పశు వైద్యానికి రూ.3 కోట్లు ఖర్చు చేస్తోంది. పాడి రైతులు ఒక్క రూపాయి ఖర్చు చేసే పనిలేకుండా పశువులకు వైద్యం అందిస్తోంది. ఇక పాడి రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ అందిస్తోంది. ఏటా రెండు సార్లు బోనస్ పంపిణీ చేస్తోంది. వీటికి అదనంగా రాయితీతో పశువుల దాణా సరఫరా చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సహకార డెయిరీలు భవనాలు నిర్మించి పాడి రైతులకే అప్పగించింది. ఇన్ని సేవలు చేస్తున్న సహకార డెయిరీలను కాదని వేల కోట్లు ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసి, అమూల్‌ను ఏపీలో దింపడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Must Read ;- జగనన్న మిస్ ఫైర్ : చంద్రబాబుని మెంటల్ హాస్పటల్లో వేయాలి!











