ఆనంద్ దేవరకొండ పేరు చెప్పగానే ‘దొరసాని’ సినిమా గుర్తుకు వస్తుంది. తొలి సినిమానే అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా నటించాడు. ప్రేమకి పేదరికం లేదనే నిరూపించే ‘రాజు’ అనే పల్లెటూరి కుర్రాడిగా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ సినిమా చూసినవాళ్లు ‘రాజు’ అనే ఆయన పాత్రను మరిచిపోలేదు. అదే తరహాలో ఇప్పుడు ‘రాఘవ’ పేరుతో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘ సినిమాలో ఆయన పాత్ర పేరే ‘రాఘవ’. మారుమూల గ్రామానికి చెందిన ఒక మధ్యతరగతి కుర్రాడు, తన ఆశయ సాధన కోసం ఎన్ని అవస్థలు పడ్డాడు? .. చివరికి ఎలా విజయాన్ని సాధించాడు? అనే కథాకథనాలతో ఈ సినిమా నడుస్తుంది.
ఇటీవలే ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో‘ నుంచి విడుదలైంది. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఆనంద్ దేవరకొండ ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. దొరసాని చేస్తున్న టైమ్ లో వినోద్ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘ కథను నాకు వినిపించాడు. నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినే. ఆ కష్టాలు .. కన్నీళ్లు ఎలా ఉంటాయనేది నాకు తెలుసు. అందువలన ఈ కథకు వెంటనే కనెక్ట్ అయ్యాను.
వినోద్ చెప్పిన ‘రాఘవ’ పాత్రను గురించే నేను ఎక్కువగా ఆలోచించాను. ఆ పాత్రకి నేను సెట్ అవుతానా? అనే సందేహం కలిగింది. అదే విషయాన్ని వినోద్ తో అన్నాను. నువ్వు నాకు పక్కింటి కుర్రాడు లా కనిపించావు .. అందుకే వచ్చాను. నువ్వు చేయవలసిందల్లా గుంటూరు యాస నేర్చుకోవడమే” అని చెప్పాడు. ఆ మాటతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. ఆ తరువాత ప్రతిరోజూ ఆయనను కలుస్తూ .. గుంటూరు యాసపై దృష్టిపెడుతూ .. షూటింగు సమయానికి నేర్చేసుకున్నాను.
ఈ సినిమా కోసం నేను గుంటూరు యాసను మాత్రమే కాదు, దోశలు వేయడం .. బొంబై చట్నీ చేయడం కూడా నేర్చుకున్నాను. అందువలన నా పాత్రను ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ సినిమాలో నేను పోషించిన ‘రాఘవ’ పాత్రతో పాటు, మిగతా పాత్రలను కూడా దర్శకుడు వినోద్ చాలా సహజంగా మలిచాడు. ప్రతి పాత్ర ఇటు సరదాగానూ .. అటు ఎమోషనల్ గాను ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ప్రేమ .. పంతం .. ఆశ .. ఆశయం చుట్టూ తిరుగుతుంది. తెరపై సన్నివేశాలు నడుస్తూ ఉంటే, ఇలాంటి సంఘటనలు నా లైఫ్ లోను జరిగాయికదా అని ప్రతి ఒక్కరూ అనుకునేలా ఉంటుంది.
‘దొరసాని’ సినిమాలో నేను చేసిన పాత్రకి పూర్తి భిన్నమైన పాత్రలో నన్ను ఈ సినిమాలో వినోద్ చూపించాడు. టిఫిన్ సెంటర్లో లుంగీ కట్టుకుని .. కట్ బనీన్ వేసుకుని పనిచేయడం సరదాగానే అనిపించింది. ఈ సినిమాను గురించి అంతా మాట్లాడుకోవడం సంతోషంగా వుంది. ముఖ్యంగా ‘రాఘవ’ పాత్ర తెచ్చిపెడుతున్న గుర్తింపు ఎంతో ఆనందాన్నిస్తోంది. నన్ను విజయ్ దేవరకొండ బ్రదర్ గానే చూస్తున్న వాళ్లూ వున్నారు .. ఆనంద్ దేవరకొండగా ఆదరిస్తున్న వాళ్లూ వున్నారు. మరికొన్ని సినిమాలు చేసిన తరువాత నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను.
ఇక నేను .. అన్నయ్య కలిసి తెరపై కనిపించాలనే ఆశాభావాన్ని చాలామంది అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అన్నయ్యతో కలిసి నటిస్తే, సెట్స్ పై ఆయన నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అన్నయ్యతో కలిసి నటించాలని నాకూ వుంది. ఒకవేళ మేము తెరపై కనిపిస్తే అన్నదమ్ముల పాత్రల్లోనే కనిపించవలసి ఉంటుంది. అందుకు తగిన కథ .. పాత్రలు కుదరాలి. అందువలన అభిమానుల కోరిక నెరవేరాలంటే చాలా సమయమే పడుతుందని అనుకుంటున్నాను” అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.
Must Read ;- ‘ఫైటర్’ కోసం భారీ సెట్ .. రంగంలోకి విజయ్ దేవరకొండ











