పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అధికార, విపక్ష పార్టీలు ఓటర్ల ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. అందులో ఎన్నికలకు సంబంధించి పలు హామీలను గుప్పించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
టీఆర్ఎస్, బీజేపీతోపాటు ఇతర రాజకీయ పార్టీలన్నీ ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార టీఆర్ఎస్ ఇప్పటికే రోడ్ షోల కోసం మంత్రి కేటీఆర్‌ను రంగంలోకి దింపింది. గ్రేటర్‌లో ప్రతి రోజు రోడ్ షోలను నిర్వహించి ఓట్లను రాబట్టే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. మరోవైపు గులాబీ దళపతి సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి గ్రేటర్ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫోస్టోను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మేనిఫోస్టోను ప్రకటించారు.
వాటర్ ఫ్రీ…
డిసెంబర్ నుంచి రెసిడెన్షియల్ ప్రాంతాల్లో నెలకు 20 వేల లీటర్ల నల్లా నీళ్లు ఉపయోగించుకున్న వారు ఆ నల్లా బిల్లు కట్టనవసరంలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ పరిధి దాటిన వారికి కొంత మేర ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్ షాపులకు ఫ్రీ పవర్ సప్లయ్, రజకులు ఉపయోగించుకునే దోబీఘాట్‌లు, లాండ్రీల్లో ఉచితంగా కరెంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమర్షియల్ సంస్థలకు కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు విద్యుత్ బిల్లుల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ట్రాన్స్ పోర్టు వాహనాలకు పన్నులు కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రజల కోసమే తమ పార్టీ పనిచేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
Must Read ;- గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య, లోకేష్!