ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మొదలయ్యాయి.. ఇటీవల వరసగా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. తక్కువ గ్యాప్‌లోనే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన జగన్.. తాను ప్రీ పోల్స్‌కి వెళ్లాలని భావిస్తున్నానని, తనకు లైన్ క్లియర్ చేయాలని కోరారని ప్రచారం జరుగుతోంది.. దీనికి కేంద్ర పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది.. ముందస్తుకు రెడీ అయిన వైసీపీ అధినేత ముందుగా అభ్యర్దుల ఎంపికపై కసరత్లులు మొదలుపెట్టారట.. ఈ దఫా ఎన్నికలలో సుమారు 50-60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్ టీమ్ ఇచ్చిన రిపోర్టులతో అప్రమత్తమైన జగన్.. వారి స్థానంలో కొత్తవారికి చాన్స్ లు ఇవ్వాలని భావిస్తున్నట్లు వైసీపీ నేతల్లోనే చర్చ మొదలయింది.. ఈ విషయాన్ని ఇప్పటికే ఒకటికి రెండు సార్లు జగన్ కూడా పార్టీ విస్తృత మీటింగ్‌లో ఓపెన్‌గా వివరించారు.. దీంతో, వ్యతిరేకత ఎక్కువగా ఉన్న సిట్టింగ్‌లకి గుడ్ బై చెప్పి, కొత్త రేసుగుర్రాలని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని సమాచారం..
మారబోయే అభ్యర్ధుల లిస్టులో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలున్నాయి.. గత ఎన్నికలలో రెండు స్థానాలు హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాలు మినహా.. మిగిలిన 12 స్థానాలలో వైసీపీ ఫ్యాన్ గాలి వీచింది.. నాలుగేళ్లకే సీన్ రివర్స్ అయిందని ఐ ప్యాక్ టీమ్ జగన్ కి అందించిన సర్వే ఫలితాలతోనే తేలిపోయిందని తెలుస్తోంది.. ఏకంగా ఆ 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో పది మందికిపైగా ఎమ్మెల్యేలను మార్చాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చారట.. అంటే, అధికార పార్టీ నేతలపై ఏ రేంజ్‌లో వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
రాప్తాడులో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కంచుకోటను బద్ధలు కొడుతూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా తోపుదుర్తి పనితీరు ఎలా ఉన్నా.. జగన్ ఇమేజ్ మీదే వచ్చే ఎన్నికల్లో విజయం ఆధారపడి ఉంది. ప్రత్యేకించి జగన్ ఇమేజ్ తో పని లేకుండా సొంతంగా గెలిచేంత స్థాయిలో మాత్రం ప్రకాష్ రెడ్డి ఎదగలేకపోయారు! అనుచరవర్గం, సొంత క్యాస్ట్ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు అండగా లేదు. ఈ సీటు విషయంలో జగన్ అభ్యర్థి మార్పు చేయబోతున్నారనేది టాక్! అది కూడా బోయ గిరిజమ్మను రాప్తాడు నుంచి నిలబెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.. తెలుగుదేశం పార్టీ నుంచి రాప్తాడు నుంచి వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబమే పోటీ లో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక సాధారణ బోయ మహిళ వారిని ఢీ కొట్టాల్సి ఉంటుంది.
పుట్టపర్తి నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యే చాన్స్ ఉందట.. ఇక్కడ సిట్టింగ్ కి జగన్ హ్యాండ్ ఇవ్వనున్నాడని సమాచారం.. ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి స్థానంలో ఇంద్రజిత్ కు అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా ఇప్పటి వరకూ ఊహకు అందని వ్యవహారమే! ప్రస్తుతం ఇంద్రజిత్ రెడ్డి బుక్కపట్నం మండలం ఎంపీటీసీగా ఉన్నారు. అటు కడపల కుటుంబం, మరోవైపు 2014 లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిన సోమశేఖర్ రెడ్డి కూడా ఆశావహుడే. అయితే వారి కన్నా ఇప్పుడు అనూహ్యంగా పాముదుర్తి కుటుంబం పేరు వినిపిస్తోంది!
కేవలం ఇవి మాత్రామే కాదు మరిన్ని మార్పులు కూడా ఉండవచ్చనే టాక్ నడుస్తోంది. హిందూపురం ఎంపీ స్థానం నుంచి ఇక్బాల్ కు అవకాశం దక్కవచ్చని, అనంతపురం ఎంపీ స్థానం నుంచి ప్రస్తుత కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పోటీ చేయవచ్చని సమాచారం. ప్రస్తుత అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ను కల్యాణదుర్గం పంపుతారట.
ఇక కచ్చితంగా టికెట్ పొందే సిట్టింగుల్లో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాత్రమే అని ప్రచారం జరుగుతూ ఉంది. అనంతపురం నుంచి అనంతవెంకట్రామిరెడ్డి స్థానంలో వేరే అభ్యర్థి తెరపైకి రావొచ్చని తెలుస్తోంది. ఉరవకొండ, కదిరి, రాయదుర్గం, పెనుకొండ, హిందూపురం, మడకశిర, గుంతకల్ ఈ అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ కొత్తవాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉండవచ్చని తెలుస్తోంది. 14 అసెంబ్లీ సీట్లకు గానూ 12 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో నెగ్గింది. 12 మంది నలుగురైదుగురు సిట్టింగులకు కూడా సీట్లు కేటాయిస్తారని.. మిగతా స్థానాల్లో అభ్యర్థులు మారిపోయే అవకాశాలే ఎక్కువనేది సమాచారం.
మొత్తమ్మీద, బటన్ నొక్కుడు సీఎంగా పేరు తెచ్చుకున్న జగన్.. అభివృద్ధిని పడకేసేలా చేశాడు.. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఆయన చేసిన నవ మోసాలను ప్రజలు గ్రహించారు.. అందుకే, సిట్టింగులని సైతం గెలిపించుకోలేని స్థితికి చేరుకున్నారు జగన్… ఏకంగా మూడో వంతుకుపైగా ఎమ్మెల్యేలను మార్చుకోవాల్సిన రేంజ్‌కి చేరుకున్నారంటే.. జగన్ సర్కార్‌పై ప్రజాగ్రహం, వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈ వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేలపై కాదని, సర్కార్ విధానపరమైన నిర్ణయాల వైఫల్యమే అని జగన్‌కి, ఆయన కిచెన్ కేబినెట్ కి తెలియని విషయమేమీ కాదు, కేవలం తప్పులను పక్క వారి నెట్టడం, తాను తప్పించుకోవడానికి జగన్ వేస్తోన్న ఈ ఎత్తు ప్రజాగ్రహం, ప్రజా వ్యతిరేకత ముందు చిత్తు అవడం ఖాయం.. సిట్టింగులతోపాటు ఏపీ ముఖ్యమంత్రి పోస్ట్ కూడా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోందని సొంత సర్వేలే ఘోషిస్తున్నాయి… మరి, దీనికి ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి..