పోలీసులను పోలీసులే వేటాడితే ఎలా ఉంటుంది. అలా పుట్టిన కథతోనే మలయాళంలో ‘నాయట్టు’ సినిమా రూపొందింది. ఈ సినిమాని తెలుగులో పునర్నిర్మించేందుకు గీతా ఆర్ట్స్ ప్రయత్నిస్తోంది. అందుకే దీని హక్కులను కూడా దక్కించుకుంది. జోజు జార్జ్, కుంచాకో బోబన్, నిమిష సజయన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాలోని ఆ పాత్రలకు తెలుగులో ఎవరైతే సరిపోతారో అన్వేషణ సాగుతోంది. సినిమా కథంతా ఈ ముగ్గురి చుట్టూనే తిరుగుతుంది. ఒకవిధంగా ఇది పొలిటికల్ థ్రిల్లర్ అని కూడా అనవచ్చు.
ఇద్దరు పోలీసులు, ఓ ఏఎస్సై అనుకోకుండా ఓ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కోవడంతో కథ మలుపుతిరుగుతుంది. అంతకుముందు వారు ఓ రాజకీయ పార్టీ వ్యక్తులతో ఘర్షణకు దిగుతారు. యాక్సిడెంట్ ఎవరో చేస్తే ఈ ముగ్గురూ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ప్రమాదానికి గురైన వ్యక్తి పోలీస్ స్టేషన్ లో గొడవకు దిగిన వ్యక్తికి బంధువు. దాంతో ఆ సామాజిక వర్గం వారు ఆందోళన చేయడంతో దీనికి రాజకీయ రంగు పులుముకుంటుంది. దాంతో ఈ ముగ్గురూ పరారవుతారు. వారి కోసం పోలీసుల వేట సాగుతుంది.
మరి వీరు పోలీసులకు దొరికారా? చివరికి ఈ కథ ఎలా ముగిసింది అన్నదే ఇందులోని ఆసక్తికర అంశం. బహుశా దీన్ని తెలుగులో అనువదించి ‘ఆహా’ ఓటీటీలో విడుదల చేయవచ్చని గీతా ఆర్ట్స్ భావించి ఉండవచ్చు. కానీ దీన్ని పునర్నిర్మిస్తేనే బాగుంటుందని ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిమిష సజయన్ పాత్ర కోసం నటి అంజలిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఏఎస్సై జోజు జార్జ్ పాత్రకు రావు రమేష్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇక కుంచకో బొబన్ పోషించిన పాత్రకకు సత్యదేవ్ అనుకుంటున్నారు. లేకుంటే శ్రీవిష్ణు ఆ పాత్ర వరించే అవకాశం ఉంది. నాయట్టులో జోజు జార్జ్ పాత్ర చనిపోతుంది.
నటుడిగా అతడి సత్తాని మరోసారి నిరూపించిన సినిమా ఇది. దీనికి న్యాయం చేయాలంటే ప్రకాష్ రాజ్ లేదా రావు రమేష్ ల వల్లే సాధ్యం. మరి ఇలాంటి ప్రాజెక్టు దర్శకత్వ బాధ్యతలను ఎవరి చేతుల్లో పెట్టాలన్నది ఇంకో ఆలోచన. దీని తమిళ వెర్షన్ ను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు. అతనికే ఆ బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరో ఆప్షన్ గా సుధీర్ వర్మ పేరు పరిశీలనలో ఉంది. రీమేక్ చిత్రమే కాబట్టి త్వరగానే దీన్ని పూర్తి చేసి విడుదల చేసే అవకాశం ఉంది.
Must Read ;- మెగా ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ నటిస్తున్నాడా?











