మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తరచూ ఎందుకు వార్తల్లోకి ఎక్కుతోంది? దేని కోసం ఈ రాద్దాంతం? ఇంత రచ్చ అవసరమా?.. ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్నలివి. అసలు ఇది నటీనటుల సంఘంలోని అంతర్గత వ్యవహారం. వారికి వారే దీన్ని పరిష్కరించుకోవాలి. మీడియా కూడా దీన్ని మసిపూసి మారేడుకాయ చేస్తోంది. నటి హేమ ఏదో లేఖ రాసిందని రాద్దాంతం జరిగిపోయింది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు రాసిన లేఖకూ హేమ లేఖకూ పెద్ద తేడా ఏమీలేదు.
కాకపోతే నిధుల వినియోగం విషయంలోనే ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు హేమ ఆరోపణలపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. మాలో జరుగుతున్న వివాదం మెగాస్టారుకు కూడా ఆగ్రహం తెప్పించింది. మా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న వారిని ఉపేక్షించవద్దని చిరంజీవి సూచించారు. మాకు త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కూడా చిరంజీవి కోరారు. మా అసోసియేషన్ లో నిధుల దుర్వినియోగం జరగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నాన్ని అధ్యక్ష, కార్యదర్శులు నరేష్, జీవిత చేశారు.
హేమ ఆరోపణలు బాధ్యతా రహితంగా ఉన్నాయన్నారు. హేమ చేసిన ఆరోపణలను క్రమశిక్షణ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. లీకైన హేమ వాయిస్, ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా ఈ ఫిర్యాదుకు జత చేశారు. మూడు రోజుల్లోగా హేమ నుంచి వివరణ రావాలని క్రమశిక్షణ సంఘం హేమను ఆదేశించింది. లేకుంటే ఆమెపై చర్యలు తప్పవని పేర్కొంది. మా ఎన్నికల వ్యవహారం గానీ, హేమ వ్యవహారం గానీ క్రమశిక్షణ సంఘం చేతుల్లోనే ఉంది. కోవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా పడటంతో ప్రస్తుతం మాకి అపద్ధర్మ బాడీ కొనసాగుతోంది.
ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఈ బాడీ ఎక్కువకాలం కొనసాగే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికలు జరిగితే పోటీ కూడా రసవత్తరంగానే ఉంటుంది. అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నటి హేమ, సీవీఎల్ నరసింహారావు ఉండే అవకాశం ఉంది. జీవిత కూడా ఈ పదవికి పోటీ పడవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఒక్క ప్యానల్ మాత్రమే బయటికి వచ్చింది. విష్ణు ప్యానల్ ను ప్రకటించాల్సి ఉంది. హేమ, సీవీఎల్ నరసింహారావులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారు. వీరిలో ఎవరైనా ఉపసంహరించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Must Read ;- మెగాస్టార్ ఎంట్రీ.. ‘మా’కు తక్షణ ఎన్నికలే