ఎంతటి పెద్ద హీరో సినిమాకయినా విడుదల కష్టాలు తప్పవు. ఏవో కారణాలతో ఏళ్ళ తరబడి బాక్సులు ల్యాబ్స్ లో ఉండిపోతుంటాయి. లేదా.. నిర్మాతల ఆఫీసుల్లోనే మొగ్గిపోతుంటాయి. అలాంటి తెలుగు సినిమాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 39 ఏళ్ళ క్రితం చిత్రీకరణ పూర్తి చేసుకొని ఆర్దిక కారణాలతో ల్యాబ్ లోనే ఉండిపోయిన అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఒకటి .. ఇప్పుడు విడుదలవుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా పేరు ‘ప్రతిబింబాలు’.
జయసుధ , తులసి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను మొదట .. రాఘవేంద్రరావు తండ్రి కె.యస్.ప్రకాశరావు దర్శకత్వం వహించగా.. ఆయన మరణానంతరం సింగీతం శ్రీనివాసరావు మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. విష్ణుప్రియా సినీ కంబైన్స్ పతాకంపై జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి నిర్మాణంలో రూపొందిన‘ ప్రతిబింబాలు’ చిత్రం అప్పట్లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. చక్రవర్తి సంగీతం అందించగా.. సెల్వరాజ్ ఛాయా గ్రహణం నిర్వహించారు. 1982 సెప్టెంబర్ 4వ తేదీన ప్రతిబింబాలు చిత్రం అన్నపూర్ణ స్డూడియోస్ లో ప్రారంభమైంది.
ANR starrer prathibimbalu movie Releasing After 39 years :
ఇప్పుడు ‘ప్రతిబింబాలు’ సినిమా హీరో అక్కినేని నాగేశ్వరరావు, మొదటి దర్శకుడు కే.యస్.ప్రకాశరావు మరి కొందరు నటీనటులు జీవించి లేరు. దాదాపు 39 ఏళ్ళ తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తుండడం, అందులోనూ డిజిటల్ ఫార్మేట్ లోకి మారిపోయిన ఈ కాలంలో ఆ సినిమా ఈ జెనరేషన్ ఆడియన్స్ ముందుకు వస్తుండడం విశేషంగా మారింది. మరి అప్పటి ప్రతిబింబాలు ఇప్పుడు ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read : మళ్ళీ ‘మనం’ అంటోన్న అక్కినేని ఫ్యామిలీ











