సహజమైన నటనకు ఆమె ప్రతిరూపం .. అపూర్వమైన అభినయానికి ఆమె ప్రతిబింబం. అప్పుడే విరిసినట్టుగా అనిపించే కళ్లు .. జలతారు మీటినట్టుగా అనిపించే నవ్వు .. మనసులపై మంత్రంలా ప్రభావం చూపే ప్రత్యేకమైన వాయిస్ జయసుధ సొంతం.
కథ ఎంతటి బలమైనదైనా .. పాత్ర ఎంతటి సమర్థవంతమైనదైనా అవలీలగా పోషించి మెప్పించగలగడం జయసుధ గొప్పతనం. జయసుధ అసలు పేరు ‘సుజాత’ .. 1958 .. డిసెంబర్ 17వ తేదీన ఆమె మద్రాసులో జన్మించారు. ఊహ తెలిసిన దగ్గర నుంచే జయసుధకు నటనపట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అప్పటికే కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘విజయనిర్మల’ .. జయసుధకు దగ్గర బంధువు. 1972లో జయసుధ ఆసక్తిని గమనించిన విజయ నిర్మల, కృష్ణగారి సరసన తను నటిస్తున్న ‘పండంటి కాపురం‘ సినిమా ద్వారా పరిచయం చేశారు. ఏ శుభముహూర్తాన జయసుధ కెమెరా ముందుకు వచ్చిందో తెలియదుగానీ, అప్పటి నుంచి ఆమె కెరియర్ ఊపందుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు.
‘సోగ్గాడు’ సినిమా మంచి గుర్తింపు తీసుకురాగా, ఆ తరువాత చేసిన ‘జ్యోతి’ సినిమాతో జయసుధకు స్టార్ డమ్ వచ్చేసింది. ఈ సినిమాలోని ‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు .. ‘ అనే పాట జయసుధను యూత్ హృదయాలకు చేరవేసింది. వాళ్ల మనోఫలకాలపై చెరిగిపోని ఓ సంతకం చేసింది. కెరియర్ ను ఆరంభించిన చాలా తక్కువ సమయంలోనే ‘జ్యోతి’ వంటి బరువైన పాత్రలో .. నాయిక ప్రాధాన్యత కలిగిన కథలో మెప్పించడం జయసుధ నటనాపటిమకు నిదర్శనమని చెప్పొచ్చు. ఆ తరువాత చేసిన ‘శివరంజని’ సినిమా జయసుధ కెరియర్ కి మరింత బలాన్నిచ్చింది. తెరపై అందంగా మెరిసే కథానాయికల జీవితంలోని వేదనను ఆవిష్కరించే పాత్రలో ఆమె నటన ప్రశంసలు అందుకుంది.
‘జ్యోతి’ .. ‘శివరంజని’ సినిమాలను రెండు కళ్లుగా చేసుకుని జయసుధ తన కెరియర్ ను నడిపించారు. 80వ దశకంలో తిరుగులేని కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. కృష్ణంరాజు .. శోభన్ బాబులతో ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. కథానాయకుడు ఎవరైనా నాయిక పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయేవారు. తన పాత్ర ఏదైనా అసమానమైన అభినయంతో సన్నివేశాలకి బలాన్ని చేకూర్చేవారు. ముఖ్యంగా కృష్ణ .. కృష్ణంరాజు .. శోభన్ బాబుల సరసన జయసుధ చేసిన సినిమాలు .. అవి సాధించిన విజయాలను పరిశీలిస్తే, ఎవరి జోడీగా ఆమె ఎక్కువ మార్కులు కొట్టేసిందనేది చెప్పడం కష్టం. ఆ ముగ్గురు హీరోల ‘హిట్ పెయిర్’ గురించిన ప్రస్తావన వస్తే, ఆ జాబితాలో జయసుధ పేరు కామన్ గా కనిపిస్తుందనడంలో సందేహం లేదు.
Must Read ;- కూచిపూడి నృత్యం : నెమలికి నేర్పిన నడకలివి!
అల్లరి .. ఆనందం .. ఆవేశం .. ఆవేదన .. ఆక్రోశం .. విరహం .. విన్నపం .. విషాదం .. ఇలా ఏ అంశానికి సంబంధించిన సన్నివేశంలోనైనా పాలలో పంచదారలా జయసుధ కలిసిపోయారు. ప్రేక్షకుల మనసు పాత్రలోకి మంచుబిందువులా జారిపోయారు. ‘అడవిరాముడు’ .. ‘అనురాగదేవత’ .. ‘ప్రేమాభిషేకం’ .. ‘మేఘసందేశం’ .. ‘శక్తి’ .. ‘భార్యామణి’ .. ‘ఇల్లాలి కోరికలు’ ‘కటకటాల రుద్రయ్య’ .. ‘త్రిశూలం’ .. ‘గృహప్రవేశం’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. నవరసాలనే నిధులు జయసుధ కళ్లలో నిక్షిప్తమై ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తాయి.
ఒక వైపున శారద .. వాణిశ్రీ వంటి సీనియర్ స్టార్ హీరోయిన్ల పోటీని తట్టుకుంటూ, మరో వైపున జయప్రద – శ్రీదేవి వంటి తోటి కథానాయికల దూకుడును దాటుకుంటూ జయసుధ ముందుకు వెళ్లారు. ఇటు నటన పరంగాను .. అటు గ్లామర్ పరంగాను జయప్రద – శ్రీదేవిని తట్టుకుని నెగ్గుకురావడం అంత తేలికైన పనేం కాదు. ఆ పోటీకి సహజమైన తన నటనతోనే జయసుధ సమాధానం చెప్పడం విశేషం. జయసుధ 300కి పైగా సినిమాలు చేసినప్పటికీ. ఆమె నటనను తూచడానికి ‘ఇది కథాకాదు’ .. ‘కలికాలం’ .. ‘కాంచనగంగ’ అనే మూడు సినిమాలు సరిపోతాయి. ఆమె అభినయ శిఖరమనే విషయాన్ని అంగీకరించడానికి ఈ సినిమాలే ఊరంత ఉదాహరణలు.
తెలుగులో దాసరి నారాయణరావు .. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అత్యధిక సినిమాలు చేసిన జయసుధ, తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను తన జోరు చూపించారు. అక్కడ కూడా ఆనాటి అగ్రకథానాయకుల సరసన నటించి మెప్పించారు. ఇక అప్పుడప్పుడూ హిందీ సినిమాల్లోను మెరిశారు. ఆయా భాషల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన .. కీలకమైన .. ప్రత్యేకమైన పాత్రలను చేస్తూ తనదైన ముద్ర చూపుతూనే ఉన్నారు.
అసమానమైన తన అభినయానికి తగిన గుర్తింపుగా జయసుధ పలుమార్లు ఉత్తమనటిగా నంది అవార్డులను అందుకున్నారు. ఎన్నోమార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకున్నారు. ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలను .. మరెంతోమంది నుంచి అభినందనలు అందుకున్నారు. నటిగా జయసుధ కెరియర్ ను పరిశీలిస్తే ‘నవరసాలను నడిపించిన కథ ఆమె .. నవరసాలను గెలిపించిన నాయిక ఆమె’ అనే విషయం అర్థమవుతుంది. ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తోంది.
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- తెలుగు తెర మరువని మల్లెపువ్వు లక్ష్మీ (జన్మదిన ప్రత్యేకం)