టాలీవుడ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది ఒక్క అక్కినేని నాగార్జునకు మాత్రమే సాధ్యం అవుతుంది. ఇప్పటికే ఆయన అనేకమంది కొత్త డైరెక్టర్స్ ను టాలీవుడ్ కు పరిచయం చేసారు. కొత్త కొత్త కథలతో సినిమాలు కూడా చేశారు. అలాగే ఏ హీరోతోనైనా మల్టీస్టారర్ సినిమాలను చేయడంలో ఎప్పుడు ముందుంటారు నాగ్. ఆయన ఇప్పటికే కొంత మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున మరో మల్టీస్టారర్ సినిమాకు సిద్ధం అవుతున్నారని టాలీవుడ్ లో టాక్ వినపడుతోంది.
ఈసారి తన కొడుకులు చైతన్య, అఖిల్ తో కలిసి నాగ్ నటించబోతున్నారని సమాచారం. ఇప్పటికే అక్కినేని కుటుంబం ‘మనం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్. కె కుమార్ తెరకెక్కించిన తీరు అద్బుతమనే చెప్పాలి. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, అమల, చైతు, అఖిల్ కలిసి నటించారు. ఈ చిత్రం అక్కినేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ‘మనం’ సినిమా ద్వారానే అఖిల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ తండ్రీకొడుకులు కలిసి నటిస్తున్నారు అని తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ కు రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహిస్తాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే రాహుల్, నాగార్జునతో ‘మన్మధుడు – 2’ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నాగార్జున కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది ‘మన్మధుడు – 2’. అయిన సరే రాహుల్ పనితనం నచ్చి నాగార్జున మరో అవకాశం ఇస్తున్నారని సమాచారం.
ఈ మల్టీస్టారర్ సినిమాను నాగార్జున సొంత బ్యానర్ లో నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా నాగార్జునతో హిట్ కొట్టాలని రాహుల్ రవీంద్ర కథను పక్కాగా రెడీ చేసుకుంటున్నాడని సమాచారం. మరి మల్టీస్టారర్ సినిమాతోనైనా దర్శకుడు రాహుల్ రవీంద్ర, నాగార్జునకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి.
Must Read ;- మాల్దీవుల తీరాన్ని తాకిన భారతీయ అందాలు











