నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు మీద ఉండగా బీజేపీ, టీఆర్‌ఎస్‌లు అభ్యర్థుల ఎంపికలో తడబడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లతో వాతావరణం వేడెక్కింది. కాగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి గెలుపు అంత సులువు కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పటికే దుబ్బాకలో టీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీలోనూ బీజేపీ ఝలక్ ఇచ్చింది. ఓవైపు టీఆర్ఎస్‌కు ఎదురుగాలి మొదలైందన్న చర్చ జరుగుతున్న తరుణంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. త్వరలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది.
బరిలో మళ్లీ జానారెడ్డే..
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఈ జాప్యం వెనుక వ్యూహాత్మక మౌనం ఏమైనా ఉందా లేక పార్టీలో నిర్ణయం తీసుకునే విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయా అనేది తేలాల్సి ఉంది. శుక్రవారం ఇదే విషయంపై సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. మంత్రులతో పాటు ఇతర ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకున్న కేసీఆర్ త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని, తాను ప్రకటించబోయే అభ్యర్థి..కచ్చితంగా గెలుస్తారని, అలాంటి అభ్యర్థినే నిలుపుతానని సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మళ్లీ బరిలోకి దిగారు. ఆయన కుమారుడు రఘువీర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా స్వయంగా జనారెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే..ఆ పార్టీ ప్రచారం చేస్తున్నా అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీలోనూ పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. టీడీపీ తన అభ్యర్థిగా న్యాయవాది, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మొవ్వ అరుణకుమార్‌ను బరిలోకి దింపింది.
టీఆర్ఎస్‌కు పరీక్షే..
కాగా నాగార్జునసాగర్‌లో గెలుపు టీఆర్ఎస్‌కు పరీక్షగా మారనుంది. టీఆర్ఎస్ తరఫున కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.తేడా చిన్నపరెడ్డి గతంలో టీడీపీలో ఉన్నారు. 2009లో జానారెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. అప్పట్లో ఆయనకు 61వేల ఓట్లు వచ్చాయి. తరువాతి కాలంలో తేరా చిన్నపరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఎన్నికల వ్యూహాలు అమలు చేసే కేసీఆర్ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పీవీ కుమార్తె సురభి వాణీదేవిని ఎంపిక చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై భారీగానే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే టీఆర్ఎస్‌కు కొంత ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ ఓడిపోతే వరుస ఎదురుదెబ్బల కారణంగా పార్టీలో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా. పార్టీ పరంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా సీఎం కేసీఆర్ ఇప్పటికే హాలియాలో బహిరంగ ఏర్పాటు చేసి నియోజకవర్గానికి నిధులు కేటాయించడంతోపాటు పార్టీని గెలిపించాలని కోరారు. తాను చెప్పేది అబద్దమైతే పార్టీని ఓడించాలని కూడా వ్యాఖ్యానించారు.
Must Read ;- బిగ్ ఫైట్ : సాగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మెగాస్టార్ ఫ్యామిలీ బంధువు..?
బీజేపీలో అంతర్మథనం..
ఇక దుబ్బాకను గెలుచుకోవడంతోపాటు జీహెచ్ఎంసీలోనూ ఊహించని విధంగా సీట్లు గెలుచుకున్న బీజేపీ టీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చింది. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని చెబుతూ దూకుడు కొనసాగిస్తోంది. అయితే నాగార్జునసాగర్‌లో ఏం చేస్తుందనేది చూడాల్సి ఉంది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఉన్న పరిస్థితులు, ఆ పార్టీ ప్రభావానికి నాగార్జునసాగర్ పరిధిలో ఉన్న పరిస్థితికి తేడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇక్కడ డిపాజిట్ కోల్పోయింది. అయితే తరువాతి పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ కొంతమందిని చేర్చుకుంది. నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతగా ఉన్న కడారి అంజయ్యయాదవ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన, జానారెడ్డి అనుచరులుగా పేరున్న బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి ,రవి కుమార్ నాయక్‌లను బీజేపీలో చేర్చుకుంది. సామాజిక సమీకరణాలు కూడా కీలకంగా మారనున్న ఈ నియోజకవర్గంలో గతంలో పోటీచేసిన కంకణాల నివేదితరెడ్డిని మళ్లీ అభ్యర్థిగా ప్రకటిస్తుందా లేక బీసీ వర్గాలకు కేటాయిస్తుందా అనేది చూడాలి. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని కేటాయించే అవకాశం ఉంది. అందుకే టీఆర్ఎస్ వ్యూహాత్మక జాప్యం చేస్తోందని చెప్పవచ్చు.
కాంగ్రెస్‌లో జానా..బాహుబలి అవుతారా..
వరుస ఓటములు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌ను వెంటాడుతున్న ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పార్టీకి కీలకం అని చెప్పవచ్చు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బరిలోకి దిగారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే..రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వస్తుందని చెప్పవచ్చు. అయితే నియోజకవర్గంలో గతంలో ఉన్న పరిస్థితులకి, ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా కనిపిస్తోంది. పార్టీ విధేయత, అధికార పార్టీ వ్యూహాలు, అంగబలం, అర్థబలం, బీజేపీ దూకుడు, టీడీపీ పోటీ ..ఇవన్నీ కాంగ్రెస్‌కు సవాలే అని చెప్పవచ్చు.
ఓట్ల లెక్క ఇదీ..
నాగార్జునసాగర్ లో గత ఎన్నికలను పరిశీలిస్తే.. 2009లో జానారెడ్డి 6వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి తెరా చిన్నపరెడ్డిపై గెలవగా 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై దాదాపు 16వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్యకు 83, 655ఓట్లు రాగా జానారెడ్డికి 75,884ఓట్లు వచ్చాయి. 7771ఓట్ల తేడాతో టీఆర్ఎస్ గెలిచింది. ఇదే ఎన్నికల్లో బీజేపీ నుంచి కంకణాల నివేదిత రెడ్డి పోటీ చేయగా 2675ఓట్లు వచ్చాయి. డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చింది. గతంలో టీడీపీలో ఉన్న కడారి అంజయ్య యాదవ్ 2019లో బీజేపీలో చేరారు. ఈయన ఇక్కడ కీలకనేతగా ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన, టీఆర్ఎస్ గాలిలోనూ ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన కడారి అంజయ్య యాదవ్ 27,858 ఓట్లు సాధించారు. ప్రస్తుతం అంజయ్య యాదవ్ బీజేపీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గ ఓట్లు, ఎస్టీ ఓట్లు కీలకంగా మారనున్నాయి.
Must Read ;- ఉద్యోగాలపై రచ్చ@గన్ పార్క్.. టీఆర్ఎస్‌పై శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు