అమెరికా బయట గూగుల్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఫస్ట్ AI డేటా సెంటర్ ప్రాజెక్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. కెనడాకు చెందిన ప్రతిష్టాత్మక CBC NEWS సంస్థ విశాఖపట్నంలో గూగుల్ చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుపై స్పెషల్ స్టోరీని ప్రసారం చేసింది. ఈ కథనంలో ప్రాజెక్టు గురించిన పూర్తి వివరాలు ప్రస్తావించింది. స్థానికుల ఆందోళనకు సైతం ప్రాధాన్యతనిచ్చింది.
విశాఖ పరిసర ప్రాంతాల్లో గూగుల్ సంస్థ ఏకంగా 600 ఎకరాల విస్తీర్ణంలో, మూడు వేర్వేరు క్యాంపస్‌లతో కూడిన భారతదేశపు అతిపెద్ద డేటా సెంటర్ హబ్‌ను వేగంగా నిర్మిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యంత వేగంగా భూసేకరణ, అనుమతులు పూర్తి కావడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంగా ఉన్న ఆ ప్రాంతం రాబోయే ఏళ్లలో ప్రపంచ స్థాయి టెక్ హబ్‌గా రూపాంతరం చెందనుందని సీబీసీ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
ఈ 1 గిగావాట్ డేటా సెంటర్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా వందలాది మందికి, పరోక్షంగా పదివేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో గూగుల్ విశాఖను ప్రధాన వేదికగా ఎంచుకోవడం ద్వారా స్థానిక యువతకు డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఏఐ టెక్నాలజీ రంగాల్లో అత్యున్నత ఉద్యోగ అవకాశాలు రానున్నాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం మౌలిక వసతుల ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, భారతదేశాన్ని గ్లోబల్ ఏఐ లీడర్‌గా నిలబెట్టడంలో కీలక మైలురాయిగా మారుతుంది.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే సరికొత్త కూలింగ్ టెక్నాలజీని గూగుల్ ఉపయోగిస్తోంది. అంతేకాకుండా, విద్యుత్ అవసరాల కోసం సంప్రదాయేతర ఇంధన వనరులైన విండ్,సోలార్ విద్యుత్‌ను పెద్దఎత్తున వినియోగించనున్నట్లు ప్రకటించింది. శబ్ద కాలుష్యం తదితర అంశాలపై పకడ్బందీ నివారణ చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.











