23 జిల్లాలతో, సమృద్ధిగా ఆదాయం సమకూరుస్తున్న హైదరాబాద్ తో ఉమ్మడి ఏపీ అలరారేది. అయితే తెలుగు నేల విభజనతో హైదరాబాద్ కేపిటల్‌గా ఏర్పడ్డ కొత్త రాష్ట్రం తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. కనీసం రాజధాని కూడా లేకుండా, హైదరాబాద్ లేకుండా, 13 జిల్లాలతో కొత్త ప్రస్థానం మొదలెట్టిన ఏపీకి అప్పటికే నెత్తి నిండా అప్పులే. అందుకే కాబోలు.. ఈ తరహా పరిస్థితి నుంచి ఏపీని గట్టెక్కించడం పాలనలో అనుభవజ్ఞుడిగా పేరున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏపీ ప్రజలు అధికారం అప్పగించారు. ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయలేదు కదా.. జనం అంచనాలను మించి పని చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీని అగ్రస్థానంలో నిలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాన్ని టాప్ 4లో కొనసాగేలా చేశారు. అయితే ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ కు జనం ఓటేశారు. అయితే తనను గెలిపించిన ప్రజల ఆశలను అడియాశలు చేస్తూ రాష్ట్రాన్ని జగన్ అధోఃగతి బాట పట్టించేశారు. ఇదేదో జగన్ అంటే గిట్టని వారు చెబుతున్న మాట కాదు. గడచిన రెండేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చెబుతున్న మాట. బాబు హయాంలో ఈ విషయంలో ఏపీ నిత్యం టాప్ 4లో కొనసాగగా.. జగన్ జమానాలో ఆ టాప్ 4 ప్లేసు నుంచి రాష్ట్రం ఏకంగా 13వ స్థానంలోకి పడిపోయింది.
జగన్ హయాంలో వచ్చిందిదే
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి గురువారం రాత్రి కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం..2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ వరకు ఏపీకి కేవలం రూ.2,577.1 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణకు రూ.17,709.15 కోట్లు వచ్చాయి. అంటే.. ఏపీ కంటే తెలంగాణకు ఏకంగా 8 రెట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అయినా కూడా తెలంగాణకు 8వ ర్యాంకే దక్కింది. ఇక టాప్ 3లో చోటు దక్కించుకున్న దక్షిణాది రాష్ట్రం కర్ణాటక రూ.1,49, 715.38 కోట్లను సాధించింది. రాజకీయంగా అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. కర్ణాటక ఈ మేర సత్తా చాటుతుంటే.. 151 మంది ఎమ్మెల్యేలతో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా జగన్.. ఏపీని అధోఃగతి పాలు చేస్తున్న వైనంపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి. ఇక మరో దక్షిణాది రాష్ట్రం తమిళనాడును తీసుకుంటే.. రూ.30,078.87 కోట్ట మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సాధించి ఐదో స్థానంలో నిలిచింది. అటు జయలలిత, ఇటు కరుణానిధి మరణం తర్వాత తమిళనాడులోనూ రాజకీయ అస్థిరత్వమే రాజ్యమేలుతోంది. అయినా కూడా ఆ రాష్ట్రం కూడా సత్తా చాటింది.
సంక్షేమం.. అప్పులపైనే దృష్టి
అయినా ఏ రాష్ట్రం, దేశమైనా తనకు వచ్చే రాబడిని పెంచుకునే దిశగానే ఆలోచన చేస్తాయి. ఆదాయం పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు సాగిస్తాయి. ఆ పెరిగిన ఆదాయం ఆధారంగానే అభివృద్ధి అయినా, సంక్షేమం అయినా నిర్ధారించుకుంటాయి. అయితే జగన్ జమానా అందుకు పూర్తిగా విరుద్ధమనే చెప్పాలి. టీడీపీ హయాంలో చేపట్టిన చర్యల ఫలితంగా సర్కారీ ఆదాయం క్రమంగా పెరుగుతోంది. గత నెల జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు 30 శాతం కంటే అధికంగా ఏపీలో 33 శాతం వృద్ది నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. మరి పెరుగుతున్న ఆదాయాన్ని అంచనా వేసి అందుకు సరిపడ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే ప్రణాళిక రచించుకోవాలి. అయితే జగన్ ఆ విషయాన్ని పక్కనపెట్టేసి.. ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీలను అన్నింటినీ ఒకే దఫా అమల్లోకి తెచ్చేశారు. అలవి కాని హామీలు ఇవ్వడం, వాటి అమలుకు ముందూవెనుకా చూసుకోకుండా దిగిపోవడం వంటి చర్యలు వ్యవస్థలను నాశనం చేస్తాయని ఓ వైపు ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నా.. జగన్ పట్టించుకోలేదు. రాష్ట్ర ఆదాయానికి మించి నాలుగైదు రెట్ల నిధులు అవసరమయ్యే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. వాటి అమలు కోసం అప్పుల కోసం ఉన్న మార్గాల అన్వేషణకే టైం సరిపోతుంటే.. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై దృష్టి సారించే అవకాశం ఎక్కడిది? ఈ కారణంగానే బాబు హయాంలో అభివృద్ధి బాటలో దూసుకుపోయిన నవ్యాంధ్ర జగన్ జమానాలో తిరోగమన దిశగా పయనిస్తోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- జగన్ ‘ఇన్‌సైడర్’ బొమ్మ అట్టర్ ప్లాఫ్