పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ అధినేతగానే కాకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. గడచిన ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ ఒక్క చోట కూడా గెవలేకపోయారు. అయితే ఆయన పార్టీ మాత్రం ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టింది. తాజాగా పవన్ మార్కు స్టేట్ మెంట్లతో ఆయన ప్రస్తావన రాష్ట్రాన్ని దాటేసి ఏకంగా తమిళనాడు అసెంబ్లీ భేటీలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. తనదైన మార్కు పరిణతితో వ్యవహరించిన పవన్.. తమిళనాడు అసెంబ్లీలో మరోమారు తెలుగు మాట వినిపించేలా చేశారు. పవన్ నేరుగా తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టకపోయినా.. తనపై ప్రశంసల జల్లు కురిసేలా చేశారు. తమిళ మంత్రి నోట తెలుగు ప్రసంగం వెలువడేలా చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగునాట వైరల్ గా మారిపోయింది.
స్టాలిన్ పై ప్రశంసలే నేపథ్యం..
ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. ఎప్పుడైతే సీఎం సీట్లో స్టాలిన్ కూర్చున్నారో.. అప్పుడే ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పేశారు. రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే.. డీఎంకే కార్యాలయానికి వెళ్లిపోతున్న స్టాలిన్.. సీఎంఓలో మాత్రం రాజకీయాల ప్రస్తావనకు అవకాశం ఇవ్వడం లేదు. సీఎంగా ఉంటూ రాజకీయాలు ఎలా మాట్లాడేది అంటూ సాగుతున్న ఆయన.. విపక్షానికి చెందిన నేతల ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా ఇట్టే వాలిపోతున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా అందరు సీఎంలకు ఆదర్శంగా నిలుస్తున్న స్టాలిన్ మొన్నటి ఇండియా టుడే సర్వేలో బెస్ట్ సీఎంగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో స్టాలిన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కూడా స్టాలిన్ వ్యవహార సరళిని కీర్తిస్తూ ఇటీవలే ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ప్రధానంగా చర్చకు వచ్చింది. దానిపై తమిళనాడు కేబినెట్ మంత్రి పవన్ ను ఆకాశానికెత్తేస్తూ.. పవన్ ట్వీట్ ను తెలుగులోనే చదివి సభ్యులకు వినిపించారు.
పవన్ ట్వీట్ లో ఏముందంటే..?
సీఎం అయ్యాక రాజకీయాల ప్రస్తావన అవసరం లేదన్న రీతిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్న స్టాలిన్ తీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ స్టాలిన్ ను ప్రశంసలు తెలిపారు. పవన్ ట్వీట్ లో ఏముందంటే.. ‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు’’ అంటూ పవన్ ట్వీటారు. ఈ ట్వీట్ ను తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ ప్రస్తావించడంతో పాటుగా పవన్ ట్వీట్ ను తెలుగులోనే చదివి వినిపించారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Must Read ;- స్టాలిన్ గారూ!.. మీరు డబుల్ సూపరండి!











