కరోనా వేడి పెరుగుతోంది కానీ సినిమాలో వాడి తగ్గుతోందా? గత నాలుగు నెలలుగా విడుదలైన సినిమాలను చూస్తుంటే వస్తున్న అనుమానమిది.
సినిమా ధియేటర్లు ప్రారంభమయ్యాక ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం శుభారంభం పలికింది. సంక్రాంతి సినిమాల్లో ‘క్రాక్’ దుమ్ము రేగ్గొట్టింది. ఆ తర్వాత కలెక్షన్ల ‘ఉప్పెన’ ప్రారంభమైంది. మన సినిమాలు జాతిరత్నాలేనని నిరూపితమైనా ఏదో లోటు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. థియేటర్లు ప్రారంభమయ్యాక ఇప్పటిదాకా దాదాపు ఓ 50 చిత్రాలు విడుదలైనా హిట్లు మాత్రం చాలా తక్కువే. అంచనాలతో విడుదలైన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. సినిమా ఫస్టాఫ్ చూశాక చించేశారు అన్న నోళ్లు సెకండాఫ్ పూర్తయి బయటికి వచ్చాక చంపేశారు అనేస్తున్నాయి. ఈ లోపం ఎక్కడుంది అన్నదానిపై పోస్టుమార్టం చేస్తే అనేక విషయాలు వెల్లడవుతున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఓ వారం రోజులు ఫుల్ రన్ వస్తే చాలా వరకు డబ్బులు వచ్చేస్తున్నాయి. కానీ మొదటిరోజు థియేటర్ కు వెళ్లి బయటికి వచ్చే జనం నుంచి నెగిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు అమాంతం పడిపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో డబ్బులు వచ్చేయాలంటే ఆ సినిమాలో పెద్ద స్టార్ ఉండాలి. దాంతో మౌత్ టాక్ ను బట్టి జనం సినిమాలకు వెళుతున్నారు. వారం క్రితం కార్తి హీరోగా నటించిన ‘సుల్తాన్’ సినిమా విడుదలైంది. సినిమా ఫస్టాఫ్ చూసిన వారంతా బాగా తీశారు అన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ కు మంచి ప్రశంసలు లభించాయి. దాంతో సెకండాఫ్ మీద అంచనాలు పెరిగాయి.
శుభం కార్డు పడ్డాక నిట్టూర్పులే
తీరా సెకండాఫ్ ముగిసేసరికి జనం నిట్టూర్చారు. అలాగే ‘అరణ్య’ సినిమా విషయంలోకి వద్దాం. ఫస్టాఫ్ చూసి జనం బాగా తీశారన్న నిర్ణయానికి వచ్చేశారు. ఫస్టాఫ్ లో కనిపించిన మెరుపులు కాస్తా సెకండాఫ్ లో మరకల్ని మిగిల్చాయి. దానికి కారణం సినిమా కంటిన్యుటీలో లొసుగులు. కొన్ని పాత్రలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. మెలోడ్రామా ఎక్కువై పోయింది. జనం సహనానికి పరీక్ష పెట్టింది. ఫస్టాఫ్ కనిపించిన విష్ణు విశాల్ పాత్ర ఏమైందో అర్ధం కాదు.
కనీసం తన ఏనుగు చావుకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునే చర్యలు కూడా కనిపించలేదు. రానా పాత్ర నిడివి పెంచడం కోసమే విష్ణు విశాల్ పాత్రను చంపేశారన్న విమర్శలు వచ్చాయి. ఇలా చూస్తే ఇటీవల విడుదలైన చాలా సినిమాలు కనిపిస్తాయి. రంగ్ దే, శ్రీకారంలోనూ ఇలాంటి లొసుగులు ఉన్నాయి. సినిమా దారి తప్పితే దగా పడేది నిర్మాతేనన్న విషయం సినిమా అనే నావకు కెప్టెన్ గా వ్యవహరించే దర్శకుడు తెలుసుకుంటే మంచిది.
ఎవరి ప్రమేయంతో ఇలా జరుగుతోంది?
సినిమాలు తప్పుల తడకలుగా తయారవడం వెనక అదృశ్య శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా అన్న అనుమానాలు కలగక మానదు. సినిమా అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటే కాదు. ప్రేక్షకుడిని సినిమా ఆసాంతం కుర్చీలో కట్టి పడేసే సినిమాలు అసలు రావడం లేదు. కథ ఎలా ఉన్నా కథనం బాగుంటే ఇలాంటి లొసుగులు కనిపించవు. అసలు కొన్ని సినిమాలు ఎందుకు హిట్టవుతున్నాయో కూడా అర్థం కావడం లేదు. కొంత పబ్లిసిటీ స్టంట్ కూడా బాగా పనిచేస్తోంది. ఇటీవలే ఓ చిన్న సినిమా పెద్ద సినిమా అంత వసూళ్లు సాధించడానికి ప్రధాన కారణం పబ్లిసిటీ బాగుండటమే. సినిమా ప్రమోషన్ సరిగా లేక కిల్ అవుతున్న చిన్న సినిమాలు చాలానే ఉంటున్నాయి.
పక్కా స్క్రిప్టుతో సినిమాలు సెట్స్ మీదకు వెళుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దర్శకులు చేసే పనిలో వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవడం కూడా ఫ్లాప్ లకు సగం కారణం అనే మాట వినిపిస్తోంది. దర్శకుడి మీద నమ్మకం లేక వేరే వ్యక్తుల సహకారం తీసుకోవడం వల్ల సినిమా అతుకుల బొంతలా తయారవుతోంది. సెట్స్ మీదకు వెళ్లాక స్క్రిప్టులో ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కనీసం ఓ షో పడ్డాకైనా కొంత ఎడిటింగ్ పరమైన మార్పులు చేయకపోవడం వల్ల కూడా సినిమా దెబ్బతింటోంది.
ప్రేక్షకుడితో బలవంతంగా నవ్వించడం, భారంగా థియేటర్లో కూర్చునేలా చేయడం, సినిమా ఎప్పుడు ముగుస్తుందా? అనే ఎదురుచూసేలా చేయడం ఇటీవల కాలంలో చూసిన సినిమాల విషయంలో అనిపించింది. అందుకే ఫస్టాఫ్ చించేశారు.. సెకండాఫ్ చంపేశారు అనాల్సి వస్తోంది. సెకండాఫ్ దంచేశారు అనేలా వచ్చే సినిమా కోసం జనం ఎదురు చూస్తున్నారు. అలాగని మళ్లీ ఫస్టాఫ్ లోనే చంపేసే ప్రయత్నం మాత్రం చేయకుండా ఉంటే మంచిది. రెండ్రోజుల్లో విడుదలకాబోయే ‘వకీల్ సాబ్’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- గ్రాండ్ గా పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విశేషాలెన్నో.. !