నితిన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుుకు వచ్చింది. హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కి ఈ ‘రంగ్ దే’ ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? కీర్తి సురేష్ కు ఇది ఎలాంటి సినిమా అవుతుంది? లాంటి విశేషాలను తెలుసుకుందాం.
కథలోకి వెళితే..
మనిషిలో ఎందుకు ప్రేమ పుడుతుందో? ఎందుకు ద్వేషం పెరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇది అలాంటి ప్రేమ కథే. చిన్నప్పుడే ఓ బుల్లి పాపను చూసి ఆ పాప మీద క్రష్ ను ఏర్పరచుకుంటాడు అర్జున్ (నితిన్). ఆ పాప పేరే అనుపమ (కీర్తి సురేష్). ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. చిన్నప్పటి నుంచి తనను ఇబ్బంది పెడుతోందనే భావనతో అనుపై ద్వేషం పెంచుకుంటాడు అర్జున్.
అను మాత్రం అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ వివాహం చేసుకోవల్సి వస్తుంది. అయినా అను మీద అర్జున్ కు ప్రేమ ఏర్పడదు. ప్రేమ, సంఘర్షణ, ద్వేషం సమాహారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇంతకీ అర్జున్ తో అను అలా ఎందుకు ప్రవర్తిస్తుంది.. వీరి మధ్య సఖ్యత ఏర్పడిందా.. వీరి బంధం నిలబడిందా అన్నది మిగతా కథ.
ఎలా చేశారు? ఎలా తీశారు?
నితిన్ తండ్రిగా నరేష్ వీకే, తల్లిగా కౌసల్య, కీర్తి సురేష్ తల్లిగా రోహిణి నటించారు. ప్రేమ, సంఘర్షణ, ద్వేషం.. ఈ మూడు భావనల తెరకెక్కించడంలో లాజిక్ మిస్సయినట్టు అనిపిస్తుంది. అనును ద్వేషించడానికి అర్జున్ దగ్గర సరైన కారణం కనిపించదు. మళ్లీ అతను రియలైజ్ అవడాన్ని కూడా దర్శకుడు కన్విన్సింగ్ గా చూపలేకపోయాడు. ఇప్పిటిదాకా ఈ తరహా ప్రేమ కథలను ఎన్నో చూశామన్న అనుభూతి కలుగుతుంది. కథనంలో సాగదీత కనిపిస్తుంది. ప్రథమార్థం వినోదాత్మకంగా సాగినా, ద్వీతీయార్థం కథ ముందుకు నడవలేదు. అను, అర్జున్ ల చుట్టూ కథని తిప్పే ప్రయత్నం చేయడంలో ఏదో లోపం ఉందన్న భావన కలుగుతుంది.
అను పాత్రను మెప్పించడంలో కీర్తి సురేష్ మరోసారి తనదైన ప్రతిభను చాటుకుంది. రంగులమయం అనుకుని ఏదేదో ఊహించుుకుని సినిమాకి వెళితే మాత్రం నిరాశ తప్పదు. సెకండాఫ్ లో ఎమోషన్ మరీ ఎక్కువై విసుగు కలుగుతుంది. అడవి శాస్త్రి పాత్రలో వెన్నెల కిషోర్, హీరో ఫ్రెండు పాత్రల్లో అభినవ్ గోమటం, సుహాస్ లు మెప్పించారు. తండ్రిగా వీకే నరేష్ తనదైన రీతిలో నటించారు. అర్జున్ పాత్ర పోషణ విషయంలోనూ, డైలాగ్ డెలివరీలోనూ నితిన్ ప్రత్యేకత కనిపిస్తుంది. బ్రహ్మాజీ, వినీత్ ల పాత్రలు కథమేరకే ఉపయోగపడ్డాయి. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఒకటి రెండు పాటలు మినహా దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ప్రత్యేకత కనిపించలేదు.
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్, నరేష్, కౌసల్య, రోషిణి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, బ్రహ్మాజీ, సుహాస్, వినీత్ తదితరులు
సాంకేతిక వర్గం: సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ , ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్, ఎడిటింగ్: నవీన్ నూలి.
నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: వెంకీ అట్లూరి
విడుదల: 26-03-2021
ఒక్క మాటలో: కలర్ డల్లు
రేటింగ్: 2.5/5