పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి కమ్ బ్యాక్ అవుతున్న సినిమా ‘వకీల్ సాబ్’ . బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకి దర్శకుడు వేణు శ్రీరామ్. దిల్ రాజ్ , బోనీకపూర్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద్రాబాద్ లోని శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్ గా జరిపారు. పరిమిత సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు హాజరైన ఈ వేడుకలో ఎన్నో విశేషాలున్నాయి.
‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ లతో పాటు .. పవన్ కళ్యాణ్ కు భక్తుడ్నని చెప్పుకొనే బండ్లగణేశ్, దర్శకుడు క్రిష్, దర్శకుడు హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు తమన్, ఇందులో ముఖ్యపాత్రలు పోషించిన అంజలి, అనన్య నాగళ్ళ తదితరులు హాజరయ్యారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన కారణంగా ఈ వేడుకకు నివేదా థామస్ హాజరు కాలేకపోయింది.
పవర్ స్టార్ తో 22 ఏళ్ళ నుంచి సినిమా తీయాలనే తన కల నెరవేరిందని నిర్మాత దిల్ రాజు చెప్పారు. త్రివిక్రమ్ వల్ల పవర్ స్టార్ డేట్స్ సంపాదించి.. ఆయన తో సినిమా తీయడం సాధ్యమైందని .. పింక్ తమిళ వెర్షన్ లో అజిత్ ను చూసిన వెంటనే .. తనకు తెలుగు లో తీస్తే పవన్ కళ్యాణే హీరోగా యాప్ట్ అనిపించిందని చెప్పారు.
పవర్ స్టార్ ఒక హిమాలయ పర్వతం అని, తాను ఓ టైలర్ కొడుకునని, ఆయన ఊ అంటే.. దేశంలో ఉన్న దర్శకులంతా క్యూలో ఉంటారని , కానీ వకీల్ సాబ్ సినిమా కు తనను దర్శకుడిగా ఎంపిక చేయడం తన అదృష్టమని ఉద్వేగంగా చెప్పారు. అలాగే.. దర్శకుడు హరీశ్ శంకర్ , క్రిష్ లు సైతం ‘వకీల్ సాబ్’ సినిమా పవర్ స్టార్ అభిమానులకు ఒక పండుగ లాంటిదని చెప్పారు.
ఇక వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రధాన ఆకర్షణ గా నిలిచి నవ్వులు పూయించాడు పవన్ భక్తుడ్ని చెప్పుకొనే బండ్లగణేశ్. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ.. మొదలు పెడుతూనే.. అభిమానుల్ని అలరించారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనమని, అలవాటు చేసుకుంటే వదల్లేము, వదిలించుకోలేము .. కొన్ని జన్మలంతే .. కొంతమందిని ఇష్డపడ్డమే కానీ వదులుకోవడం ఉండదు. అంటూ పవర్ స్టార్ మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనకి సీ.యమ్ సీటుకన్నా మీ గుండెల్లో స్థానం ఇష్టం అంటూ అభిమానుల్ని ఖుషీ చేశారు. దిల్ రాజు లాంటి నిర్మాత తనతో సినిమా తీయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఆయనలా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తులంటే చాలా గౌరవమని చెప్పారు. అలాగే.. వేణు శ్రీరామ్ లాంటి దర్శకులు పేషన్ తో వస్తారు, తనమీద ఇష్టంతో సినిమా తీస్తారు. అలాంటి వారన్నా తనకి చాలా గౌరవమని .. ఆయన కూడా కింద నుంచి పైకి వచ్చారు. అంటూ అభిప్రాయ పడ్డారు.
ఇక ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్ లు అద్భుతంగా నటించారని, మా వకీల్ సాబ్ సినిమా మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించేవారికి, వారిని చిన్నచూపు చూసేవారికి చెంప పెట్టని చెప్పారు. స్త్రీల పట్ల గౌరవ భావంతో మెలగమని మా సినిమా చెబుతుందని, నిజంగా తనకి స్త్రీలంటే చాలా గౌరవమని .. అలాంటి తనకి వకీల్ సాబ్ లాంటి సినిమా చేసే అవకాశమిచ్చినందుకు నిర్మాత దిల్ రాజు కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక పవర్ స్టార్ మాట్లాడుతుంటే.. అభిమానులు సి.యం, సి.యం అంటూ నినదించారు. దాంతో .. సి.యం అనేది జరగాలి , మనం కోరుకుంటే రాదు అంటూ.. చెప్పారు.
Must Read ;- విజిల్స్ వేయించే ‘వకీల్ సాబ్’ ఇంట్రడక్షన్ సీన్