‘అరణ్య’ సినిమా రానా దగ్గుబాటికి నటుడిగా మంచి పేరు తెచ్చింది. అందులో అనుమానం లేదు. సినిమా ప్రథమార్థం బాగున్నా సెకండాఫ్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాకి కొంత నెగిటివ్ టాక్ రావడానికి ఆ సెకండాఫే కారణం అనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఫస్టాఫ్ లో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ సెకండాఫ్ లో మిస్సవడానికి కారణం రానా ఎలివేషన్ కోసమేనన్న టాక్ వినిపిస్తోంది. నటుడిగా రానా పాత్ర బాగున్నా కూడా సినిమాకి కావలసిన అంశాలు లోపించకూడదు. ముఖ్యంగా విష్ణు విశాల్ పాత్రను అర్థాంతరంగా ముగించేశారు.
విలన్ కోసం తన సేవలను అందించి విష్ణు విశాల్ పాత్ర చివరికి విలన్ మనుషుల కారణంగానే తన ఏనుగును కోల్పోవలసి వస్తుంది. అందుకు అతను ప్రతీకారం తీర్చుకోడానికైనా రానాతో చేతులు కలపాలి. అలా జరగలేదు. అసలు ట్రైలర్ లో కనిపించే సన్నివేశాలు కూడా సినిమాలో లేవు. నక్సలైట్ మల్లితో విష్ణువిశాల్ ప్రేమలో పడతాడు. ఆ మల్లి పాత్ర ఏమైందో కూడా తెలియదు. అవన్నీ పక్కన పెడితే నక్సలైట్లతో సంబంధాలు ఉన్న రానాను ఆదుకోడానికైనా వారు రంగంలోకి దగికపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. మల్లి పాత్ర మాయమవడానికి కారణం కూడా చూపించలేదు.
మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇందులో చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. నక్సలైట్ మల్లిని పోలీసు అధికారి రేప్ చేస్తాడట. ఈ విషయంలో ఆ పోలీసు అధికారితో విష్ణువిశాల్ గాని, రానా గాని తలపడే సన్నివేశాలు ఉండాలి. అవేవీ సినిమాలో కానరావు. కనీసం ఎడిటింగ్ లోనైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఉత్తమ నటుడిగా రానాకు అవార్డు కోసం ఈ సన్నివేశాలను తొలగించారనుకోడానికి వీల్లేదు. ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు ఇక జాతీయ అవార్డు ఎందుకు వస్తుంది? మంచి కాన్సెప్ట్ తో రూపొందించిన సినిమాను కిల్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సినిమా మొత్తాన్ని రానా భుజాల మీదే మోశాడన్న ప్రచారం కోసం ఇలా చేశారనుకోవాలి. రానా ఎలివేషన్ కోసం ప్రయత్నించడం వల్లే సినిమా గాడి తప్పిందన్న విమర్శలున్నాయి. విష్ణు విశాల్ కు సంబంధించిన సన్నివేశాలను తమిళ వెర్షన్ లో ఉంచడానికి అవకాశం ఉంది. సినిమా సెకండాఫ్ మీద మరి కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. నోటి దాకా వచ్చిన హిట్ చేజారడం అంటే ఇదేనని ‘అరణ్య’ను చూస్తే అనిపిస్తుంది.
Must Read ;- అరణ్య (రివ్యూ)











