అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో దేశంలోనూ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీకి దగ్గరగా ఉండగా ఏపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ నుంచి ఇంధన దిగుమతులు చేసుకుంటున్న దేశాలపై అమెరికా ఆంక్షలు, పెట్రోల్ ఉత్పత్తి చేస్తున్న దేశాలు (OPEC) ఉత్పత్తిలో కోత విధించడం, డాలర్‌తో రూపాయి మారకపు రేటు ఇలా పలు కారణాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్ ధర 80 అమెరికన్ డార్లకు చేరింది. అయితే, గతంలో ముడిచమురు ధరలు బ్యారెల్ విలువ 58అమెరికన్ డాలర్లకు తగ్గినా దేశంలో ఇంధన ధరలు ఒకటిరెండు సందర్భాల్లో తప్న..అన్ని సమయాల్లో పెంచుతూనే వచ్చాయి. ఇప్పుడు ముడిచమురు ధరలు పెరుగుతున్నాయని క్రమేణా ధరలు పెంచుతుండడంపై సామాన్యుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
పలు దేశాల్లో భారత్ కంటే తక్కువే..
ఇక వివిధ దేశాల్లో పెట్రోల్ ధరల విషయానికి వస్తే.. పలు దేశాలతో పోల్చినప్పుడు భారత్ కంటే అక్కడి ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఆయా దేశాల కరెన్సీని రూపాయి విలువతో లెక్కిస్తే.. అమెరికాలో లీటరు పెట్రోల్ ధర రూ.53.88 ఉండగా, డీజిల్ రూ.58.9 ఉంది. నార్వే, స్వీడన్, బ్రిటన్ , నెథర్లాండ్స్ లాంటి దేశాలతో పోల్చితే ఇప్పటికీ అమెరికాలో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్‌లో రూ.65.2 ఉండగా (పాకిస్తానీ రూపీ 112.8), డీజిల్ ధర రూ.61.56 (పాకిస్తాన్ రూపీ 106.57)గా ఉంది. ఇటీవలే పాకిస్తాన్ ప్రధాని పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక శ్రీలంకలో పెట్రోల్ రూ.69.09 ఉండగా డీజిల్ రూ.51.9 ఉంది. ప్రపంచంలో ఇంధనం (గ్యాసోలైన్)పై అత్యధికంగా యూరోపియన్ దేశాలు పన్ను విధించడంతో అక్కడి ఇంధన ధరలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Must Read ;- కోతల్లేవ్, అన్నీ వాతలే.. 15 రోజుల్లో గ్యాస్ బండపై రూ.100 పెంపు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో..
ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. అన్ని ప్రాంతాల్లో ధరలు పెరుగుతున్నా..కొన్ని రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పెట్రోల్ ధర సెంచరీకి దగ్గరగా ఉంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పవర్ (ప్రీమియం) పెట్రోల్ ఇప్పటికే రూ.100 దాటింది. గడిచిన ఆరునెలల్లో మొత్తం మీద పెట్రోల్ ధర లీటరుకు రూ.25కిపైగా పెరిగింది. దీంతో ప్రైవేటు వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. హైదరాబాద్‌లో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 89.77గా, డీజిల్ ధర రూ. 83.46 గా ఉంది.

8నెలల్లో రూ.25 పెరుగుదల..
గత ఏడాది జూన్‌లో వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.75కి అటూ ఇటూగా ఉండగా ఈ సారి 90 దాటింది. రాజస్థాన్ లో పెరుగుదలతో పోల్చినప్పుడు రూ.25 పెరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ సర్కారు పెట్రోల్ పై విధిస్తున్న వ్యాట్‌లో 2శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్‌లో మమత బెనర్జీ సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఇక దక్షిణాదిలో ఏపీలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ సర్కారు పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ విధిస్తుండగా ప్రత్యేక సెస్‌లు విధిస్తుండడంతో ధరలు ఎక్కువగా ఉండేందుకు కారణమైంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల ఉంటే..ఆ మేరకు రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. అయితే, పెట్రోల్ ధరలు పెరుగుతుంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం చూసుకుంటున్నారని, తమపై ఎంత భారం పడుతుందనేది ప్రభుత్వ ఆలోచించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తం మీద ఏపీలో టాక్స్ లు, సెస్ ల రూపంలో ప్రతి లీటర్ పెట్రోల్ పై రూ.33.5 , డీజిల్ పై రూ.24 మేర ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తోంది.
సరిహద్దు ప్రాంతాల్లో డిమాండ్..
ఏపీలో పెట్రోల్ , డీజిల్‌కు అధికధరలు ఉన్న నేపథ్యంలో భారీ వాహనదారులు, సరిహద్దు సమీప ప్రాంతాల వాహనదారులు చాలామంది పక్క రాష్ట్రాల పెట్రోల్ బంకులకు వెళ్తున్నారు. అదే సమయంలో ఆయా పెట్రోల్ బంకు యజమానులు ఏపీ కంటే తమ దగ్గర పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు ఎంత తక్కువ ఉన్నాయో బోర్డులు ఏర్పాటు చేసి ఆకర్షించే యత్నం చేస్తున్నారు. 350 లీటర్ల డీజిల్ భారీ వాహనం ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే దాదాపు రూ.వెయ్యికిపైగా మిగులుతుందని, అవి టోల్ గేట్‌లకు ఉపయోగపడతాయని, ఈ నేపథ్యంలో ఏపీలో డీజిల్ పోయించుకునే అవసరం లేకుండా ప్రయాణం సాగిస్తున్నారని చెప్పవచ్చు. గతంలో దూరప్రాంతాల బస్సులు విజయవాడ సమీపంలో ఇంధన కంపెనీల సొంత డీజిల్ బంకుల్లో డీజిల్ పోయించుకునేవారు. ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏపీలో డీజిల్ పోయించుకోవడం కూడా నిలిపివేశామని బస్సులు, ట్రావెల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఏపీలో ఉన్న ట్రావెల్స్ బస్సులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయాల్లో వీలైనంతవరకు ఆయా ప్రాంతాల్లోనే డీజిల్ పోయించుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, నెల్లూరు తదితర దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మాత్రమే ఏపీలో కొంత మేర (హాఫ్ ట్యాంక్) పోయించుకుంటున్నారు. మొత్తం మీద దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు సామాన్యులకు భారం కాగా.. ఏపీలో మరింత భారమయ్యాయని చెప్పవచ్చు.
Also Read ;- దక్షిణాదిలో జగన్ సర్కార్ నెం.1! ఎలాగంటే..











