సీఎం జగన్మోహన్ రెడ్డి డెకాయిట్ లా తయారయ్యాడని, చివరకు గాలిపై కూడా పన్ను వేసి జనాన్ని పీడించేలా ఉన్నాడని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పరిటాల భోగి ఉత్సవాల్లో ధ్వజమెత్తారు. రైతులకు రూ.4 వేల కోట్ల ధాన్యం బకాయిలు ఇంతవరకు చెల్లించకుండా, ఏపీ సీఎం మెగా దోపిడీకి పాల్పడుతున్నాడని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు మార్కెట్ కమిటీలు కొనసాగించాలని ఆయన కేంద్రాన్ని విజ్ఙప్తి చేశారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తెచ్చిన అయిదు జీవోలను ఆయన భోగి మంటల్లో వేసి దహనం చేశారు.
మంత్రులకు మీటర్లు పెట్టాలి
మీటర్లు పెట్టాల్సింది రైతుల వ్యవసాయ మోటర్లకు కాదని, అవినీతి మంత్రులకు మీటర్లు బిగించాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైకాపా మంత్రులకు మీటర్లు పెడితే ఏ మంత్రి ఎంత దోచుకుంటున్నారో రియల్ టైమ్ లో తెలుస్తుందని ఆయన సెటైర్లు వేశారు. ఫించన్లు పెంచుకుంటూ….. పోతానని జగన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని చంద్రబాబు గుర్తుచేశారు. బ్యాంకుల వద్ద నుంచి అప్పులు చేసేందుకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పట్టణాల్లో దేనినీ వదలకుండా చివరకు చెత్తపై కూడా పన్నులు వేశారని విమర్శించారు.
Must Read ;- ఈ ముఖ్యమంత్రి మనిషేనా ? : చంద్రబాబు
కుక్కలు, పందులపై పన్ను
పెంపుడు జంతువులైన కుక్కలతోపాటు పందులపై కూడా ఈ ప్రభుత్వం పన్నుల భారం మోపిందని చంద్రబాబు విమర్శించారు. గాలి రెడ్డి కాబట్టి రేపోమాపో గాలిపైనా పన్ను వేస్తారేమోనని కాసేపు నవ్వులు పూయించారు. జనం
జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేసి గెలిపించారని, నేనేం తప్పు చేసానో నాకు తెలీదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశాను, అదే నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండని ఆయన కోరారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారు, లక్షా 30వేల కోట్ల అప్పు చేయడంతోపాటు, ప్రజలపై అదనంగా 70వేల కోట్ల పన్నుల భారం మోపారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.70 వేల రుణ భారం పడిందన్నారు.
సీఎం ఏం చేస్తున్నారు
దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. తాజాగా పాఠశాలలపై కూడా దాడులు చేసి ప్రతిపక్షాలపై నెట్టేందుకు కుట్ర పన్నారని జగన్మోహన్ రెడ్డి నుద్దేశించి చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా సీఎంపై తీవ్ర వ్యతిరేకతతో ఉంటే ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం సీఎంకు భజన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పరిణామాలపై మేధావుల మౌనం మంచిది కాదు, యువత కూడా మేల్కొని పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్రజా వ్యతిరేకత భయంతోనే సీఎం స్థానిక ఎన్నికలకు వెనుకంజ వేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే వైసీపీ నేతల అక్రమాలు సాగవని భయపడుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు వారిని ఇంటికి పంపిస్తారని చంద్రబాబు పరిటాల భోగి మంటల వద్ద ఏర్పాటు చేసిన సభలో అభిప్రాయపడ్డారు.
Also Read ;- అవినీతి కేసులో అరెస్టుచేసినందుకే.. చంద్రబాబుపై కోపమా?