నివార్ తుఫాన్ దెబ్బకి రైతుల ఎంత నష్టపోయారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. మండలి సమావేశాలు ముగియడం ఆలస్యం రైతుల బాధలను తెలుసుకోవడానికి కార్యచరణలోకి దిగారు టీడీపీ నేత నారా లోకేష్. అందులో భాగంగా పొన్నూరు, బాపట్ల, ఈతేరు గ్రామాల్లో పర్యటించిన లోకేష్, అక్కడి రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. వారితో మమేకమై పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇంత నిర్లక్ష్యమా
నివర్ తుఫాన్ చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రైతు బాధలు చూస్తే ఎవరైన కంటతడి పెట్టకమానరు. కానీ ప్రభుత్వం మాత్రం కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు లేవు. చేతికందివచ్చిన పంట నీటపాలై కళ్లముందే కళ్లిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు వాపోతున్నారు. తమని పట్టించుకుని నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రైతుకు భరోసా ఏది?
జగన్ ప్రభుత్వంలో అన్నదాతకు భరోసా లభించడం లేదని నారా లోకేష్ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. నివార్ పంట నష్టం పక్కన పెడితే, గతంలో జరిగిన నష్టానికే ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని రైతులు చెప్పుకొచ్చారు. కనీసం రైతు భరోసా కూడా ప్రభుత్వం అందివ్వట్లేదని రైతులు వాపోయారు. అటు ప్రభుత్వ సాయం అందక, ఇటు పంట చేతికి రాక, లాభం లేకపోగా పెట్టుబడితో సహా నష్టపోయి రోడ్డున పడ్డామని రైతులు తమ వేతలను చెప్పుకొచ్చారు. ఈ-క్రాప్ ను సాకుగా చూపి కొందరి రైతులకు నష్టపరిహారం అందించకపోవడం దారుణమని ప్రభుత్వ విధానాలను నారాలోకేష్ తప్పుబట్టారు. ప్రకృతి వైపరిత్యం వల్ల నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ఇలా వివక్ష చూపడం అన్యాయం అని తెలియజేశారు. నష్టపరిహారం అందుకునే హక్కు ప్రతి ఒక్క రైతుకు ఉందని, ఇలా కొందరిని వేరు చేసి ప్రభుత్వ నేతలు వారి జేబులు నింపుకుంటున్నారని దుయ్య బట్టారు
అన్నీ అబద్దపు లెక్కలే
తాజాగా జరిగిన అసెంబ్లీలో సైతం రైతులకు ప్రభత్వం ఎంతో చేసింది, ఇంకా ఎంతో చేస్తుంది అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ ప్రభుత్వం, నేడు ఈ రైతుల ఆరోపణలకు ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ప్రతిపక్షాలు నిలదీస్తే అర్ధరాత్రి జీవోలు జారీ చేసి మాదేం తప్పులేదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నించిన తీరుని రాష్ట్రమంతా గమనించింది. అసెంబ్లీ సాక్షిగా రైతులకు కష్టం రాకుండా చూసుకుంటున్న మా ప్రభుత్వం భేష్ అంటూ తమని తాము పొగడ్తలతో ముంచెత్తుకుంటున్న ప్రభుత్వం ఒకసారి ఈ రైతుల బాధలను గమనిస్తే బాగుంటుంది. నష్టపోయిన రైతుకు అండగా మేమున్నాం అంటూ భరోసా ఇవ్వలేని ప్రభుత్వం ఉండీ ఏం లాభం?
Must Read ;- టీడీపీ కార్యకర్తలంటే భయమెందుకు: నారా లోకేష్