( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ ఉక్కు ఉద్యమ పార్టీలకు అతీతంగా దూసుకు వెళ్లబోతోంది. రెండు దిక్కులు కలవడం ఎంత అసాధ్యమో… వారిద్దరూ కలవడం కూడా అంతే అసాధ్యం. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. కార్మిక సంఘాలకు పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది.. కూర్మన్నపాలెం గేట్ దగ్గర శుక్రవారం నుంచి రిలే దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో విశాఖ ఉక్కు రిలే దీక్షలో ఆసక్తికర పరిణామం కనిపించింది. ఒకే వేదికపై మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూర్చుకున్నారు.. ఎన్నికల తర్వాత తొలిసారి పాత మిత్రులు ఇద్దరూ కలిశారు. ఉక్కు పోరాటానిి మద్దతు ప్రకటించారు. అదే వేదికపై ఉన్న సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవంతి, గంటాలు కలిసి విశాఖ ఉక్కు కోసం చంద్రబాబు, జగన్‌లను ఒకే వేదికపైకి తీసుకురావాలని కోరారు.
గత ఎన్నికల ముందు నుంచి వైరం ..
ముత్తంశెట్టి శ్రీనివాసరావు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉండగా భీమిలి నియోజకవర్గం నుంచి ఇద్దరు సీటు ఆశించారు. గంటా శ్రీనివాసరావు అప్పటికే అదే నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఉండడం… గతంలో అదే నియోజకవర్గం ఎమ్మెల్యే గా ముత్తంశెట్టి శ్రీనివాసరావు పని చేయడం.. కారణంగా ఇద్దరిమధ్య నియోజకవర్గం కోసం పోటీ నడిచింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ రెండు వర్గాలుగా విడిపోయారు. ఎన్నికలకు ముందు ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైఎస్ఆర్సిపి పార్టీ తీర్థం తీసుకోవడంతో వివాదం సద్దుమణిగినట్టు అనిపించింది. అయితే తర్వాత క్రమంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేయడంతో మళ్లీ ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. వైసిపి హైకమాండ్ వద్ద గంటా శ్రీనివాసరావు పార్టీ చేరికను అడ్డుకుంటూ.. ముత్తంశెట్టి శ్రీనివాసరావు పైచేయి సాధించారు. చివరకు గంట ఆస్తులపై దాడులు చేసి స్వాధీనం చేసుకునే వరకు వెళ్ళింది. ఈ క్రమంలో ఇక వీరిద్దరూ కలవడం అసాధ్యం అనే వాదన మొదలైంది. ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి అఖిల పక్ష కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు కానీ… టిడిపి, వైఎస్ఆర్సిపి కలవలేదు. ఆ లోటు శుక్రవారంతో తీరినట్టు అయింది.
MuST Read ;- అగ్రిమెంట్‌తో పోస్కో ఎంటర్.. 2019 నుంచే ‘విశాఖ ఉక్కు’పై స్కెచ్..