విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో పెట్టుబడుల ఉపసంహకరణపై ప్రకటనలు రావడం, విశాఖ ఉక్కు యాజమాన్య సంస్థ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్‌లో నష్టాల్లో ఉన్న కంపెనీల్లో పెట్టుబడుల ఉప సంహరణకు కేంద్ర సిద్ధపడడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని సినీనటుడు శివాజీ కూడా ఓ సోషల్ మీడియాతో ప్రస్తావించారు. విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక సంఘాల నాయకుడు రామచంద్రరావు గతంలోనే ఆందోళన వ్యక్తం చేయగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విషయాలను పరిశీలిస్తే..
నష్టాల్లోకి దింపి..
విశాఖ ఉక్కు సంస్థను ఉద్దేశపూర్వకంగా యాజమన్యం నష్టాల్లోకి దింపే యత్నం చేసిందని చెబుతున్నారు. కార్మికులు రెట్టింపు సామర్థ్యంతో సంస్థను నడిపించి లాభాల్లోకి తీసుకొచ్చి నవరత్న హోదా సాధించగా 2019 తరువాత నష్టాలే ఎక్కువగా వచ్చాయి. సొంత గనులు లేకపోవడంతో వేరే కంపెనీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ కారణంగా ఒక టన్ను ఉక్కు తయారీకి రూ.3వేల అదనపు ఉత్పత్తి వ్యయం అవుతోంది. ఇక రుణాలకు వడ్డీలు చెల్లించాల్సి రావడం, రాయితీలు లేకపోవడం కూడా ఇక్కడ ప్రస్తావించవచ్చు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం గనులు కేటాయిస్తే.. విశాఖ ఉక్కు దేశంలోనే నెంబరు1 అవుతుందని కార్మికులు చెబుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని.. కేవలం ఉపాధి మార్గంగానే కార్మికులు, ప్రజలు భావించడం లేదని, విశాఖతో పాటు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా బావిస్తున్నారని, ఇప్పుడు ఆ సంస్థని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
నాన్ బైడింగ్ ఒప్పందం
ఈ కంపెనీ సెయిల్ పరిధిలో లేకపోవడంతో పెద్దల వ్యూహాలు తొందరగా అమలయ్యే అవకాశం ఏర్పడిందన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రారంభంలో 3మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొదలు కాగా 2017 నాటికి 7.3 మిలియన్ టన్నులకు ఉత్పత్తి పెరిగింది. అయితే 2019 నుంచి ప్రైవేటుకి స్కెచ్ వేశారన్న ప్రచారం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బ్రాహ్మణి స్టీల్ శంకుస్థాపన కంటే ముందుగానే పోస్కో ప్రతినిధులు అప్పట్లో ఏపీకి వచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల పోస్కోకు ఇక్కడ కేటాయింపులు జరగలేదు. ఒరిస్సాకే పరిమితమైంది. దాదాపు 12ఏళ్ల తరువాత పోస్కో మళ్లీ ఎంటరైంది. 2019 ఏప్రిల్ తరువాత పోస్కోకు, RINL (విశాఖ ఉక్కు యాజమాన్య సంస్థకి ఓ ఒప్పదం కుదిరింది. ఏటా 5 లక్షల టన్నుల ఉక్కు సరఫరాకు నాన్ బైడింగ్ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇక్కడే అసలు లాజిక్ ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వాస్తవానికి విశాఖ ఉక్కు సంస్థలో రెండు స్టీల్ మెల్టింగ్ షాప్ యూనిట్ (SMS) లు ఉన్నాయి. వీటి ద్వారా కేవలం పోస్కోకి 5లక్షల టన్నుల ఉక్కుని సరఫరా చేయడం అసాధ్యం. అసలు సామర్థ్యానికి మించి ఉక్కు సరఫరా చేస్తామని ఒప్పందం కుదర్చుకోవం వెనుకే కుట్ర ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఒప్పందం కుదిరింది కాబట్టి..చట్టపరంగా పోస్కోకు కొంత రక్షణ వచ్చింది. ఈ నేపథ్యంలో పోస్కోకు సదరు ఒప్పందం ప్రకారం ఉక్కు సరఫరా చేయాల్సిందే. లేని పక్షంలో చట్టపరంగా ఇబ్బందులు వస్తాయి. పరిహారం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మధ్యేమార్గంలో అసలు కుట్రకు తెరలేపారని చెబుతున్నారు.
Must Read ;- ‘విశాఖ ఉక్కు’కు ఎందరో ప్రాణత్యాగం.. మేల్కొనక పోతే అన్యాయమే

వీఆర్ఎస్ అమలు..
ఎలాగూ పోస్కోకు ఉక్కు సరఫరా చేయలేరు కాబట్టి.. సదరు SMS విభాగం పోస్కో సొంతంగా విశాఖ ఉక్కు కంపెనీలోనే ఏర్పాటు చేసుకునేలా వీలు కల్పిస్తూ అంగీకరించారు. అంటే విశాఖలో ఇప్పటికే పోస్కో ఎంటర్ అయిపోయిందని చెప్పవచ్చు. ఆ కంపెనీకి సియోల్‌లో ఉన్న యూనిట్‌లో 6వేల మంది కార్మికులతో 4మిలియన్ల మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. ఆ కోణంలో చూస్తే.. రమారమి 20వేల మంది స్కిల్డ్ ఎంప్లాయిస్ ఉంటే 12మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయవచ్చు. ఆ కోణంలోనే వీఆర్ఎస్‌కు తెరలేపారని గతంలోనే కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఇందుకు గత అక్టోబరు నుంచే స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగతోంది. నవంబరు5న కంపెనీ నుంచి ఓ సర్య్యూలర్ జారీ అయింది. 45 ఏళ్ల వయస్సు, 15ఏళ్ల సర్వీసు ఉన్నవారికి వీఆర్ఎస్ అవకాశం కల్పిస్తూ ఈ ఉత్వర్వులు జారీ చేశారు.
విశాఖ, గంగవరం పోర్టుపై కన్ను..కేంద్ర మంత్రి ఎంట్రీ..
వాస్తవానికి పోస్కో గతంలో ఒరిస్సాలో కేటాయింపుల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. పలు హింసాత్మక ఘటనలూ జరిగాయి. తాజాగా విశాఖకు రావడానికి కారణం విశాఖ ఉక్కుని మింగేయడంతోపాటు విశాఖ, గంగవరం పోర్టుల ద్వారా ఉక్కును ఎగుమతి చేసేందుకు దగ్గరగా ఉండడం కారణంగా కనిపిస్తోంది. ఇదంతా 2019నవంబరులోనే జరిగిందని, అందులో భాగంగానే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విశాఖ ఉక్కును సందర్శించారని కార్మికులు చెబుతున్నారు. అప్పట్లో కార్మికులతో జరిగిన సమావేశంలో విశాఖ ఉక్కుకు ప్రపంచ దిగ్గజ సంస్థ పోస్కోతో భాగస్వామ్యం కుదిరిందని వ్యాఖ్యానించారు. అప్పట్లోనే పోస్కో ప్రతినిధులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. విశాఖ ఉక్కు సంస్థ తమతో చేసుకున్న ఒప్పదం మేరకు ఉత్పత్తి చేయలేకపోతోంది కాబట్టి..తామే స్టీల్ రోలింగ్ మిల్ పేరుతో SMSయూనిట్ లు పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా స్టీల్ మెల్ట్‌కి అనుసంధానంగా ఉండే (ఉక్కు ద్రావకాన్ని అందించే) బ్లాస్ట్ ఫర్నేస్ లుకూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అంటే ఒక్క అగ్రిమెంట్‌తో పోస్కో విశాఖ ఉక్కు నెత్తిపై చెయ్యి పెట్టిందని, కొందరు నాయకులు పెట్టించారనే చర్చ నడుస్తోంది.
Also Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఎమ్మెల్యే గంటా రాజీనామా
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో..
ఇక విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎంతవరకయినా వెళ్తామని విశాఖపట్నం జిల్లాకు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అధికార వైసీపీ ఎంపీల వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్నతోపాటు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే చర్చ మొదలైంది. నిన్న ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్‌లో విశాఖ ఉక్కుపై ఎంపీ పిల్లి సుభాష్ మాట్లాడేందుకు ప్రయత్నించగా పార్టీ ఇంకా స్టాండ్ తీసుకోలేదని, సీఎం ఏం చెబుతారో చూశాక మాట్లాడదామని మరో ఎంపీ వ్యాఖ్యానించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.











