నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ‘సింహా, లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టరైన నేపథ్యంలో ‘అఖండ’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ నెల 28న విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా విడుదలను వాయిదా వేసుకుంది. అంతేకాదు సినిమా షూటింగ్ కూ అంతరాయం ఏర్పడింది.
అయితే ఈ లోపు బాలయ్య.. తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టే సన్నాహాల్లో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది రవితేజ తో క్రాక్ మూవీ తీసి.. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య.. నెక్స్ట్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీ కథకు ఎంతో ఎగ్జైట్ అయిన ఆయన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.
పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ చరిత్ర కారుడి కథతో గోపీచంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బాలయ్య నెవర్ బిఫోర్ అవతారంతో కనిపిస్తారని తెలుస్తోంది. దీని కోసం ఆయన సరికొత్త మేకోవర్ అవుతున్నారట. ఇంతకు ముందు పల్నాడు బ్యాక్ డ్రాప్ లోనే బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ మూవీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. దాదాపు 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ బాలయ్య అదే నేపథ్యం కలిగిన కథాంశంలో నటించనుండడం విశేషంగా మారింది.
Must Read ;- కోవిడ్ బాధితులకు నటసింహ బాలకృష్ణ భారీ సహాయం











