బండ్ల గణేశ్.. పేరు వినగానే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలకు తనదైన శైలి కామెడీతో కడుపుబ్బా నవ్వించిన కామెడీ స్టార్ మన కళ్ల ముందు కనబడతారు. ఎన్నికల్లో గెలవకుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే.. తనకు సీటు దక్కకుంటే.. ఇలా ప్రతి అంశంపై తనకు తానే కండీషన్లు, తనపై తానే ఒట్టు పెట్టుకుంటూ విచిత్ర రీతిలో కామెంట్లు చేసిన బండ్ల గణేశ్.. ఒకాకొన దశలో బ్లేడుతో పీక కోసుకుంటానంటూ సంచలన ప్రకటన చేసిన అందరికీ టార్గెట్ అయిపోయారు. అప్పటి నుంచి బండ్ల కనిపిస్తేనే.. అందరూ సెవెన్ ఓ క్లాక్ బ్లేడు చూపించి ఆయనను ఆట పట్టించారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆయన మెడకు బ్లేడును కట్టేసి.. తమదైన రీతిలో ఫొటోలు విడుదల చేసిన నెటిజన్లు ఆయనను నిజంగానే ఫుట్ బాల్ మాదిరి ఆడుకున్న వైనం కూడా ఠక్కున గుర్తుకు వస్తుంది. ఈ లెక్కన రాజకీయాల్లో కొనసాగింది కొన్ని నెలలు మాత్రమే అయినా.. పాలిటిక్స్ అంటే ఎంత కష్టమో, తనలాంటి మాట మీద నిలకడ లేని వారికి మరెంత కష్టమో తెలుసుకున్న బండ్ల.. ఎవరికీ చెప్పా పెట్టకుండా పాలిటిక్స్ కు వీడ్కోలు చెప్పేశారు.
బండ్ల ట్వీట్ ఇదే
అయినా ఇప్పుడు బండ్ల మాట ఎందుకూ అంటే.. ఆయనే తన గురించి మరోమారు మాట్లాడుకునేలా చేశారని చెప్పాలి. తానేదో అప్పటిదాకా వివాదాల జోలికే పోనట్లుగా.. తనను తాను వివాద రహితుడిగా చెప్పుకుని.. ట్విట్టర్ లో ఉంటే వివాదాలకు తెర తీసినట్లేనన్నట్లుగా శనివారం ఓ సంచలన ట్వీట్ చేశారు. అందులో ఆయన ఏమంటారంటే.. ‘‘త్వరలో ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేస్తున్నా. నో కాంట్రవర్సీస్. ఐ డోంట్ వాంట్ ఎనీ కాంట్రవర్సీస్ ఇన్ మై లైఫ్’’ అంటూ బండ్ల రెండు ముక్కల్లో వదిలిన ట్వీట్ తో ఇప్పుడు మళ్లీ ఆయన గురించి చర్చించుకోవాల్సి వస్తోంది. అయినా రాజకీయాల్లో బండ్ల గణేశ్ కామెడీ అయినట్టుగా మరెవరూ కాలేదేమో. వివాదాల్లో చిక్కుకుని అర్ధాంతరంగా రాజకీయాలను వదిలేసిన వారు ఉంటారేమో గానీ.. తనపై తానే జోకులు, కామెంట్లు చేసుకుని తనను తాను కామెడీ చేసేసుకుని పాలిటిక్స్ నుంచి నిష్క్రమించిన విషయంలో బండ్లను మించిన వారు మరొకరు లేరనే చెప్పాలి.
Must Read ;- కేజీఎఫ్ 3, కేజీఎఫ్ 4.. అండ్ గోస్ ఆన్











