తెలంగాణ పీపీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. నిత్యం ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజాబలం కూడగట్టుకుంటోంది. ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరిట ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ లో ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతం దిశగా దూసుకుపోతోంది. రేవంత్ రాకతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా జోష్ పెరగడంతో పార్టీ అధిష్ఠానం ఇతర రాష్ట్రాలపై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్, రాజస్థాన్ లో పీపీసీ అధ్యక్షులను నియమించి దూకుడుగా వ్యవహరించింది.
ఏపీపై రాహుల్ ఫోకస్
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్ గాంధీ దృష్టిసారించారు. ఇటీవలే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. బలోపేతానాకి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. ఏపీలో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను మళ్లీ కదిలించేందుకు.. పార్టీలో చురుకుగా పనిచేసే విధంగా రాహుల్ గాంధీ కార్యాచరణ తయారు చేయనున్నారు. దీనికోసం పీసీసీ కార్యవర్గంలో మార్పులు, చేర్పులపై కూడా చర్చ సాగించారు.
కొత్త పీసీసీని ప్రకటించే ఛాన్స్
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మరింత బలహీనపడింది. కనీసం ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి దక్కలేదు. నిస్తేజంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ లో కొత్త రక్తం నింపాలని రాహుల్ గాంధీ భావిస్తుననారు. ఇప్పటికే పార్టీ చెందిన సీనియర్ లీడర్లను ఢిల్లీ రావాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పీసీసీ ప్రక్షాళన చేస్తేనే కాంగ్రెస్ గాడినపడుతుందని, ఏపీపీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శైలజానాథ్ ను మార్చాలని ఏఐసీసీ భావిస్తోంది. పార్టీలో సీనియర్ నేతలు పార్టీలోనే ఉన్నా.. స్తబ్దుగా ఉండటానికి కారణం ఏంటని ఆరా తీస్తోంది. ఏపీలో వైసీపీని కొట్టాలంటే బలమైన నేత ఉండాల్సిందేనని రాహుల్ గాంధీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పినట్టు తెలుస్తోంది. ఇందుకుగాను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే.. కాంగ్రెస్ బలపడుదుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ పూర్తి ప్రక్షాళనకు గురవుతుందా? అధిష్టానం కొత్త అధ్యక్షుడ్ని నియమిస్తుందా? అనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.
Must Read ;- కాంగ్రెస్‌లో ప్రియాంక శకం ప్రారంభమైనట్టేనా?










