బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన నవల ఆధారంగా దేవదాసు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో అక్కినేని స్టార్ అయిన సంగతి తెలిసిందే. అయితే అదే రచయిత రాసిన మరో పుస్తకం కూడా తెలుగులో సినిమాగా వచ్చిన విషయం చాలామందికి తెలియదు. అదే బాటసారి. ఈ సినిమాలో కూడా అక్కినేనే హీరోగా నటించడం విశేషం.
అక్కినేని కెరీర్ లోని మరపురాని చిత్రాల్లో బాటసారి ఒకటి. తనకు ఎంతో ఇష్టమైన టాప్-5 చిత్రాల్లో ఇది కూడా ఒకటని అక్కినేని పదే పదే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. శరత్ చంద్ర రాసిన బడదీదీ అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. ఈ మూవీని ప్రముఖ నటి భానుమతి నిర్మించారు.
నటి, గాయని, దర్శకురాలు భానుమతి నిర్మాతగా కూడా మారారు. భర్త రామకృష్ణతో కలిసి భరణి స్టుడియోస్ స్థాపించారు. శరత్ చంద్ర రాసిన బడదీదీ నవల వీళ్లను బాగా ఆకర్షించింది. ఆ నవల చదువుతున్నంత సేపు భానుమతి మదిలో ఏఎన్నారే మెదిలారంట. అలా ఆ పుస్తకం హక్కులు తీసుకొని సినిమా నిర్మించారు భానుమతి. నిజానికి భానుమతికి చెందిన భరణి స్టుడియోస్ కు, అక్కినేనికి చాలా అనుబంధం ఉంది.
లైలా మజ్ను, ప్రేమ, చక్రపాణి, రత్నమాల, బాటసారి, విప్రనారాయణ, గృహలక్ష్మి సినిమాల్లో అక్కినేని నటించారు. ఇవన్నీ భరణి స్టుడియోస్ బ్యానర్ పై వచ్చినవే. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకోవాలి. భగ్నప్రేమికుడు అనగానే, అక్కినేని నటించిన దేవదాసు సినిమానే అందరికీ గుర్తొస్తుంది. కానీ ఆ సినిమా కంటే ముందే లైలా మజ్నులో అక్కినేని భగ్నప్రేమికుడిగా కనిపించారు. కాకపోతే దేవదాసుతోనే ఆయనకు ఎక్కువ గుర్తింపు వచ్చింది.
మూగప్రేమ అనే పదానికి పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమానే. బాటసారిలో హీరోహీరోయిన్లు మాట్లాడుకోరు. కళ్లతోనే ప్రేమించుకుంటారు. అలానే విడిపోతారు. ఆ ఎలిమెంటే ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చివరికి హీరో, హీరోయిన్ ఒడిలోనే ప్రాణాలు విడవడం అనేది గుండెల్ని పిండేస్తుంది. ఏఎన్నార్, భానుమతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో షావుకారు జానకి, దేవిక, సూర్యకాంతం, రమణమూర్తి కీలక పాత్రలు పోషించారు.
భానుమతి భర్త రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాస్టర్ వేణు సంగీతం అందించారు. సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. మరీ ముఖ్యంగా ‘ఓ బాటసారి..’ అనే టైటిల్ సాంగ్ అయితే పెద్ద హిట్. అప్పట్లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కింది. 1961, జూన్ 30న విడుదలైన ఈ సినిమా 60 ఏళ్లు పూర్తిచేసుకుంది.
Must Read ;- 40 సప్తపదులు.. ఛాందస భావాలపై బాణాలు











