తెలుగు తెరపై గయ్యాళి అత్త అనగానే వెంటనే గుర్తొచ్చేపేరు ‘సూర్యకాంతం’. అత్తగా తెరపై ఆమె వేసే చిందులు చూసి అప్పట్లో పెళ్లి కావలసిన అమ్మాయిలు భయపడిపోయేవారు.
అలాంటి అత్త మాత్రం దొరకొద్దని థియేటర్లోనే దణ్ణాలు పెట్టుకునేవారు. పెళ్లిచూపులకు అబ్బాయి తరఫువాళ్లు వచ్చినప్పుడు, అబ్బాయి తల్లి సూర్యకాంతం మాదిరిగా కాస్త లావుగా కనిపిస్తే బెదిరిపోయేవారు. అబ్బాయి నచ్చినా .. నచ్చలేదనే చెప్పేవారు. ఇక తెరపై సూర్యకాంతం చేసే హడావిడికి, చిన్నపిల్లలు ఏడుపు లంకించుకోవడం, తల్లో .. తండ్రో వాళ్లను చంకనేసుకుని థియేటర్లో నుంచి బయటికి వెళ్లడం అప్పట్లో సహజంగా కనిపించే దృశ్యాలు. గయ్యాళి అత్త పాత్రల్లో సూర్యకాంతం అంతగా ఒదిగిపోయారు. అప్పట్లో ఎవరైనా కాస్త గడుసుగా .. గయ్యాళిగా మాట్లాడితే చాలు సూర్యకాంతంతో పోల్చేవారు. ఇప్పటికీ అలా అనడమేమీ ఆగలేదు.
ఇక ఆ రోజుల్లో తమ పిల్లలకు ‘సూర్యకాంతం’ అనే పేరు పెట్టడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. ఆ పేరు వలన తమ పిల్లలకు గయ్యాళి అనే ముద్ర పడుతుందేమోనని భయపడేవారు. ఒకసారి సూర్యకాంతం ఒక వేదికపై ఉన్నప్పుడే, ఈ విషయాన్ని గురించి ‘గుమ్మడి’ సరదాగా ప్రస్తావించిన్నప్పుడు ఆమె ముసిముసినవ్వులు నవ్వుకోవడం విశేషం. ఒక నటి తన పాత్రల ద్వారా ఇంతటి ప్రభావం చూపగలగడం ఒక్క సూర్యకాంతం విషయంలోనే జరిగి ఉంటుందేమో.
సూర్యకాంతం 1924 .. అక్టోబర్ 28వ తేదీన కాకినాడ సమీపంలోని ‘వెంకటరాయపురం’లో జన్మించారు. సూర్యకాంతం పెద్దగా చదువుకోలేదు. ఆమె ధ్యాస అంతా కూడా నాటకాలపైనే ఉండేది. అప్పటికే కాకినాడ నుంచి మద్రాసు వెళ్లిన కొంతమంది సినిమాల్లో స్థిరపడ్డారు. దాంతో సూర్యకాంతం దృష్టి కూడా సినిమాల వైపుకు మళ్లింది. దాంతో తన తల్లిని వెంటబెట్టుకుని ఆమె మద్రాసు చేరుకున్నారు. అక్కడ ఆమె ప్రయత్నాలు ఫలించి, ‘నారద నారది’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. 1946లో విడుదలైన ఈ సినిమానే కాలేదు, ఆ తరువాత చేసిన ‘ధర్మాంగద’ కూడా ఆమె ఉనికిని చాటలేకపోయింది.
50వ దశకం ఆరంభంలో వచ్చిన ‘సంసారం‘ సినిమాలో సూర్యకాంతం చేసిన ‘వెంకమ్మ’ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా నుంచి ఇక ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. గయ్యాళి అత్త పాత్రలు చేయడంలో తనకి సాటి మరొకరు లేరనే విషయాన్ని ప్రేక్షక ప్రపంచానికి సూర్యకాంతం చాటి చెప్పింది ఈ దశకంలోనే. డైలాగ్స్ కి తగినట్టుగా తలాడిస్తూ .. ఎడమచేయిని గాల్లో తిప్పేస్తూ .. నోరేసుకుని మీదపడిపోయే ఆమె తీరు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఆమె నోటినుంచి వచ్చే తిట్లను తియ్యగా విన్నారు .. ఆమె బాడీ లాంగ్వేజ్ ను చూసి నవ్వుకున్నారు.
Must Read ;- అభినయ సముద్రం సావిత్రి (జయంతి ప్రత్యేకం)
‘తోడికోడళ్లు’ .. ‘అప్పుచేసి పప్పుకూడు’ .. ‘వెలుగు నీడలు’ .. ‘వాగ్దానం’ చిత్రాలు ఆమె స్థాయిని మరింత పదిలం చేశాయి. 60వ దశకంలో వచ్చిన ‘గుండమ్మకథ’లో ‘గుండమ్మ’గా సూర్యకాంతం విశ్వరూప విన్యాసమే చేశారు. కన్నకూతురును గారం చేస్తూ, సవతి కూతురు పట్ల ధుమధుమలాడే పాత్రలో సూర్యకాంతం ఆవిష్కరించిన అభినయాన్ని ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ అప్పటికే స్టార్ హీరోలు. అలాంటి ఇద్దరు ప్రధాన పాత్రలను పోషించిన ఆ సినిమాకి, సూర్యకాంతం పాత్ర పేరును టైటిల్ గా పెట్టడం అప్పట్లో సంచలనం.
అందుకు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ఇద్దరూ అభ్యంతర పెట్టకపోవడానికిగల కారణం .. ఆమె పట్ల వారికి గల గౌరవం.
కథ ఏదైనా సూర్యకాంతం పాత్రను కేంద్ర బిందువుగా చేసుకునే మిగతా పాత్రలు ఆమె చుట్టూ తిరిగేవి. తల్లిగా తన మాటే నెగ్గాలనే పంతం .. అత్తగా తన మాటే వేదమనే పట్టుదల .. ఇలా రెండు వైపులా తన కత్తికి పదునే అనే తీరులో మలచబడిన పాత్రల్లో సూర్యకాంతం హాస్యాన్ని పండించిన తీరు అద్భుతం .. అసమానం అనే చెప్పాలి. ఇక ఎస్వీ రంగారావు .. రేలంగి .. రమణా రెడ్డికి భార్య పాత్రల్లో ఆమె పండించిన హాస్యం ఇప్పటికీ కితకితలు పెడుతూనే ఉంటుంది. అప్పట్లో కథలను బట్టి హీరోలు .. హీరోయిన్లు మారుతూ ఉండేవారు .. కానీ సూర్యకాంతం మాత్రం తప్పనిసరిగా ఉండేవారు.
ఆనాటి దర్శక నిర్మాతలకు ఆమె తమ సినిమాలో ఉండటం ఒక సెంటిమెంట్ గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. సూర్యకాంతానికి డైలాగ్స్ బట్టీపట్టడమనేది తెలియదు .. పాత్ర స్వభావం ఏమిటనేది దర్శకుడు చెబితే చాలు, ఆ తరువాత ఆమెనే చూసుకునేవారు. తన సహజ ధోరణిలో చేసుకుని వెళుతూ ఆ పాత్రలకు న్యాయం చేసేవారు. సూర్యకాంతం అంటే ఒక పద్ధతి .. క్రమశిక్షణ .. అంకితభావం. వందల సినిమాలు చేసినా, ఆమె ఆలస్యంగా షూటింగుకి వచ్చిన సందర్భాలు లేవు. దర్శకులు స్వేచ్ఛ ఇచ్చారుగదా అనేసి తన పాత్ర పరిధినిదాటి వెళ్లిన దాఖలాలు లేవు. అలాగే కొత్తగా వచ్చిన దర్శకులను .. నటీనటులను చిన్నబుచ్చిన సంఘటనలు లేవు.
సూర్యకాంతం గయ్యాళితనమంతా తెరపైనే .. తెర వెనుక ఆమె వెన్నలాంటి మనసున్న మనిషి. తెరపై ఎంతో గడుసుగా .. అసాధ్యురాలిగా కనిపించే ఆమె, తెరవెనుక మహా బోళామనిషి .. అమాయకురాలు. తెరపై ఆమె మాట కటువుగా కనిపిస్తుంది .. తెర వెనుక ఆమె ఎంతటి కలుపుగోలు మనిషన్నది తెలుస్తుంది. ఎదుటివారికి కష్టం వస్తే ఆమె మంచులా కరిగిపోయేవారు. అవసరాల్లో .. ఆపదల్లో ఉన్నవారికి తనకి తోచిన సాయం చేసేవారు. షూటింగుకు వస్తూ .. తనతో పాటు మిగతావారికి కూడా భోజనాలు పట్టుకొచ్చే గొప్పమనసు ఆమె సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అత్తగా ఆమె తెరపై కనిపించే అగ్నిపర్వతం! ఆ పాత్రలో నుంచి బయటికి వస్తే అమ్మ మనసుతో చల్లదనాన్ని వెదజల్లే మంచుపర్వతం!! ఈ రోజు ఆమె వర్ధంతి .. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ ఆమెను స్మరించుకుంటోంది.
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- నవ్వులకు రారాజు.. మా అన్నయ్య రాజబాబు