హైదరాబాద్‌లో సంచలనం రేపిన కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మంగళవారం రాత్రి బోయినపల్లిలో కేసీఆర్ బంధువులైన జాతీయ స్థాయి హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ , సునీల్, నవీన్ లను మూడు వాహనాల్లో వచ్చిన కొందరు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లినట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు గాలింపు చేపట్టారు. కిడ్నాపర్లు తొలుత ఐటీ అధికారులమని ఇంట్లోకి చొరవడి తరువాత వారిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించినట్టు బాధితుల కుటుంబీకులు పోలీసులకు చెప్పారు. కిడ్నాపర్లు ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి కర్నూలు జిల్లాకు చెందిన భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ పేరును ప్రస్తావించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం నార్సింగి-వికారాబాద్ మార్గంలో వదిలేసి వెళ్లిపోతుండగా వికారాబాద్ ప్రాంతంలో కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. 8మంది నిందితులను అరెస్టు చేశారు. ఇక బాధితుల విషయానికి వస్తే.. వీరు కేసీఆర్‌కు బంధువులు. కేసీఆర్ పీఏ వేణుగోపాల్‌రావుకు సమీప బంధువులని తెలుస్తోంది. వీరి కుటుంబాల్లో జరిగే కార్యక్రమాలకు కేసీఆర్ కుటుంబీకులు కూడా హాజరవుతారు.
Must Read ;- కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్..

భూమా కుటుంబంతో భూ వివాదం..
హఫీజ్‌పేట ప్రాంతంలో ఉన్న 50 ఎకరాల భూ వివాదం నేపథ్యంలో కిడ్నాప్ జరినట్టు తెలుస్తోంది. మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం…భూమా నాగిరెడ్డి కుటుంబానికి, వీరి కుటుంబానికి మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. భూమా నాగిరెడ్డితో గతంలో ప్రవీణ్ రావు కుటుంబీకుడైన కృష్ణారావుకి పరిచయం ఉంది. నాగిరెడ్డి, కృష్ణారావు, మరో వ్యక్తి ముగ్గురూ కొన్ని లావాదేవీలపై చర్చించేవారని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి చనిపోయాక.. ఆస్తుల విషయంపై కృష్ణారావు, మరో వ్యక్తితో పలుమార్లు అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ చర్చించినట్టు సమచారం. హఫీజ్‌పేటలో ఉన్న భూమి తమ తండ్రి నాగిరెడ్డి ఆస్తి అని, అది కృష్ణారావు పేరుతో అప్పట్లో నాగిరెడ్డి తత్కాలికంగా రాశారని అఖిల ప్రియ సంబంధీకులు చెబుతుండగా, ఆ ఆస్తితో నాగిరెడ్డికి ఏ విధంగానూ సంబంధం లేదని, తమ సొంత ఆస్తి అని కృష్ణారావు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివాదం ముదిరింది. ఈ వ్యవహారంలో బాధితుల కుటుంబానికే చెందిన మరో వ్యక్తి, న్యాయవాది హరీష్‌రావుపైనా భూమా వర్గం ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. లాయర్ హరీష్‌రావును ఒప్పిస్తే భూమి తమకు దక్కుతుందని భావించారని, మంగళవారం రాత్రి ఆయన అందుబాటులో లేకపోవడంతో ప్రవీణ్ , సునీల్, నవీన్‌లను తీసుకెళ్లారని ప్రచారంలో ఉంది. అయితే, ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమే. ఈ అంశాల్లో వాస్తవం ఎంత, వివాదం ఏంటి, అసలు ఈ వివాదంలో అఖిలప్రియ భర్తకు సంబంధం ఉందా లేదా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
పోలీసుల ఆపరేషన్..
హైదరాబాద్‌లో దశాబ్దం క్రితం భూ వివాదాల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరిగేవి. తరువాతి కాలంలో వివాదాలు, హత్యలు, దాడులు జరుగుతున్నా.. ఈ తరహా ముఠా కిడ్నాప్‌లు చాలా తగ్గాయి. మంగళవారం కిడ్నాప్ సమాచారం అందుకున్న పోలీసులు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో క్షణాల్లో అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల పరిశీలన, తనిఖీలు చేపట్టారు. వాహనాల వివరాలు తెలుసుకున్న పోలీసులు పకడ్బంధీ వ్యూహంతో కిడ్నాపర్ల వాహనాల కదలికలను పక్కాగా సేకరించారు. మొత్తంమీద వివాదం ఎలా ఉన్నా..కిడ్నాపర్ల చెర నుంచి బాధితులను విడిపించే విషయంలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది.
Must Read ;- Online ‘లోన్స్’పై ఉచ్చుబిగిస్తోన్న తెలంగాణ పోలీసులు











