పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా కాషాయ జెండా ఎగురువేసేందుకు బీజేపీ పట్టుదలతో ఉంది. రెండేళ్ల ముందు నుంచే అందుకోసం వ్యూహాలకు పదునుపెట్టింది. దీంతో పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా ధీటుగానే స్పందిస్తోంది. తాజాగా దేశంలో ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నా…బీజేపీ టార్గెట్ పశ్చిమబెంగాల్ అని చెప్పవచ్చు. అందులో భాగంగానే తృణమూల్ కాంగ్రెస్‌లోని కీలకనేతలను చేర్చుకోవడంతోపాటు బీజేపీ ముఖ్యులు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బహిరంగ సభలూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంతి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరులు పలుమార్లు టూర్లు వేస్తున్నారు. కాగా పశ్చిమబెంగాల్ ఎన్నికలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోందని చెప్పవచ్చు.
7లక్షల మందిలో బలప్రదర్శన..
ఇక బీజేపీ ఆదివారం కోల్‌కతలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీలో బీజేపీ బలప్రదర్శన చేస్తుందని చెప్పవచ్చు. మోదీ పర్యటన సందర్భంగా దాదాపు 7లక్షల మందితో, జైశ్రీరామ్ నినాదాలతో కాషాయ సైన్యం కవాతు ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ భద్రత, కేంద్ర బలగాల భద్రతతో పాటు పార్టీ స్వీయ భద్రతా ఏర్పాట్లు కూడా చేసుకోవడం గమనార్హం. ఈ ర్యాలీ సక్సెస్ చేస్తే..రాష్ట్రంలో తమ పార్టీ వేవ్ క్రియేట్ అవుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన నినాదాలు కూడా ఉండనున్నాయని చెబుతున్నారు.
ఇప్పుడు కాకుండే..ఎప్పుడూ ఉండదని..
ఇప్పుడు గనుక బీజేపీ ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే.. సమీప భవిష్యత్‌లో బీజేపీకి మళ్లీ ఇలాంటి అవకాశం రావడం కష్టమని పార్టీ భావిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా అక్కడ 16సీట్లు గెలిచింది. టీఎంసీ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ , వామపక్షాల ఓట్లను తమవైపు తిప్పుకుంది. 2014ఎన్నికల్లో టీఎంసీ 34స్థానాలు గెలుపొందగా 2019లో 22స్థానాలు మాత్రమే గెలిచింది. దీంతో అప్పటి నుంచి బీజేపీ పశ్చిమబెంగాల్‌లో కాషాయజెండా ఎగురవేసేందుకు కార్యాచరణను ముమ్మరం చేసింది. రెండేళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అన్నట్లు రోజూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. ఈ పోరాటంలో కాంగ్రెస్, వామపక్షాలు మూడో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. అంటే వ్యూహాత్మకంగా బీజేపీ ఆ పార్టీలను వెనక్కి నెట్టిందని చెప్పవచ్చు.
ఇక మార్చి 27నుంచి జరగనున్న 294 అసెంబ్లీ స్థానాల్లో 150 స్థానాలను గెలిచేందుకు బీజేపీ అన్ని రకాల మార్గాలను అనుసరిస్తోందని చెప్పవచ్చు. మైనార్టీల పట్టున్న, టీఎంసీ కంచుకోటలుగా భావిస్తున్న 125స్థానాల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నా.. మిగిలిన వాటిలో మెజార్టీ సీట్లు గెలిస్తే..తమ పని సులువు అవుతుందని భావిస్తోంది. అందులో భాగంగానే ర్యాలీ నిర్వహిస్తోందని చెప్పవచ్చు. కాగా ఈ ర్యాలీపై దీదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మోదీతో 30 ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేయడంపై స్పందిస్తూ..మోదీ 30 ర్యాలీలు కాకుంటే.. 120 ర్యాలీలు నిర్వహించుకున్నా తనకు నష్టం లేదని వ్యాఖ్యానించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ర్యాలీలు తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. అంతేకాదు.. పరోక్షంగా ఈసీని కూడా టార్గెట్ చేశారు. ఎన్నికలు కూడా 8విడతల్లో కాకుంటే..294 విడతల్లో చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
Must Read ;- టైమ్స్ మోదీకి, ఏబీపీ మమతకి.. మారుతున్న ఓటర్ల నాడి