కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సొంత గూటిలోనే శత్రువులు తయారయ్యారా. కావాలనే ఆయనపై బుదరజల్లించడమే పనిగా పెట్టుకున్నారా.. అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ కేడర్. ఇన్నాళ్ళ రాజకీయ చరిత్రలో కిషన్‌రెడ్డికి జాతీయ నాయకత్వం గౌరవ ప్రదమైన స్థానం కల్పించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చింది. ఎంపీగా గెలిసిన తొలిసారే ఆయనకు ఈ పదవి కట్టబెట్టి పార్టీ విధేయులకు అవకాశాలు దక్కుతాయన్న సంకేతాలిచ్చింది బీజేపీ జాతీయ నాయకత్వం. కేంద్ర మంత్రి పదవి వచ్చినా ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆయన కేంద్ర మంత్రి అయినా అంబర్‌పేట ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అయినా ఆయన వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
ఒక్కసారిగా ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు..
అజాత శత్రువుగా పేరున్న ఆయనకు సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య విమర్శలు మొదలయ్యాయి. వీలు చిక్కినప్పుడల్లా కొందరు పదునైన మాటలతో విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలకు , కేడర్‌కు అండగా ఉండాల్సిన ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఉలుకూ పలుకూ లేనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. గతంలోని భైంసా ఘటన , సంజయ్‌పై కరీంనగర్ పోలీసుల దాడి, సిద్దిపేట కమిషనర్ వ్యవహరించిన తీరు ఇలా అనేక సంఘటనలను గుర్తు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇదంతా పార్టీ అభిమానులే చేస్తుండటం విస్తుగొలిపే అంశం. పార్టీ ఎదగాలంటే ఇంత సాఫ్ట్‌గా ఉంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉంటూ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంతో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నది పోస్టుల సారాంశం.
Must Read: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుచరుడు టీఆర్ఎస్‌లోకి జంప్
ఇదంతా పార్టీలో ఎంపీనే చేయిస్తున్నారంటూ ప్రచారం..
అయితే, ఓ ఎంపీ తన స్వార్దం కోసం ఇదంతా చేయిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందే పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన ఆయన ప్రజల్లో మంచి పట్టు సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇలా ఎవరినైనా విమర్శిస్తూ ప్రజల్లో , పార్టీలో మంచిపేరు సంపాదించుకున్నారు. ఆయన కేంద్ర మంత్రిని సోషల్ మీడియా వేదికగా బ్లేమ్ చేడయంతో పాటు ప్రజల్లో వ్యతిరేకత తెప్పించేలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కిషన్‌రెడ్డిని వీలైనంత బ్లేమ్ చేసి జాతీయ నాయకత్వం వద్ద మైనస్ మార్కులు తెప్పించడం ద్వారా ఆయనను మంత్రి పదవి నుండి తప్పిస్తే తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశ ఆయనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. గత కొంత కాలంగా రేవంత్‌రెడ్డి బీజేపీ వ్యవహారాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కిషన్‌రెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడం ఏంటని లోతుగా విశ్లేషణ చేసిన బీజేపీ నేతలు అసలు కుట్ర ఇదే అని వాదిస్తున్నారు. తన పదవి కోసం మరో వ్యక్తిపై ఇలా సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించడం .. ఆయనను ప్రజల్లో అవమానాల పాలు చేయడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు మాని జాతీయ నాయకత్వం దృష్టిలో మంచి పేరు సంపాదించి పదవి తెచ్చుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఆరోపణలపై తొడకొట్టిన రేవంత్