బీజేపీతో జనసేన పొత్తు బంధం అనేక మలుపులు తిరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం బండి సంజయ్ పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారని జనసేన తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈలోగా.. ఆ ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి గానీ పొత్తు గురించి ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తులు పొడవనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ కొంచెమూ చీలిపోకుండా.. తమకు లబ్ధి జరిగేలా చూడాలని.. కమలదళం ఫిక్సయింది. మంగళగిరి నుంచి తిరిగి హైదరాబాదు వచ్చిన పవన్ కల్యాణ్ తో బండి సంజయ్ భేటీ అవుతున్నారు. ఈ రెండు పార్టీలు పొత్తులతోనే పోటీచేసే అవకాశం కనిపిస్తోంది.
బీజేపీ తమ తొలిజాబితాలో ఇప్పటిదాకా 25 మంది పేర్లను మాత్రమే ప్రకటించింది. ఇంకా 125 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన ఇంకా అభ్యర్థుల జాబితా వరకు వెళ్లలేదు. నిజానికి జనసేన 40 స్థానాల వరకు పోటీచేయాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి నలభై స్థానాలు కేటాయిస్తూ పొత్తు కుదుర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.
40 డివిజన్లు వారికిచ్చేలా.. జనసేనాని కూడా నగరంలో వివిధ ప్రదేశాల్లో రోడ్ షోలలో పాల్గొనేలా ఒప్పందం కుదరవచ్చునని భావిస్తున్నారు. తొలి జాబితా విడుదల సమయానికి పొత్తు ఆలోచన ఇరువురి మధ్య లేదు. ఇప్పటిదాకా తమను ఎవరూ పొత్తుకోసం సంప్రదించలేదని బండి సంజయ్ అప్పుడు ప్రకటించారు. ఇది కొత్తగా పుట్టిన ఆలోచనే అని తెలుస్తోంది.
Must Read ;- అలాగైతే పవన్‌కు తిప్పలు తప్పవు!
ఓటు చీలకుండా
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. కలిసి పోటీచేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఎన్డీయే లో భాగస్వామి అయినప్పటికీ.. బీహార్ లో ఎల్జేపీ విడిగా పోటీచేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. భాజపా-జేడీయూ కూటమి లాభపడి తిరిగి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా.. ఎన్డీయే భాగస్వామి అయిన జనసేన విడిగా పోటీచేస్తే.. ఇక్కడ అధికార పార్టీ తెరాసకే లాభం జరుగుతుంది. అందుకే కలిసి పోటీచేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ పెద్దల జోక్యం వల్లనేనా?
జనసేనతో పొత్తులు పెట్టుకోవడంలో ఢిల్లీ పెద్దల జోక్యం కూడా ఉన్నదని తెలుస్తోంది. తొలుత బండి సంజయ్ కు అలాంటి ఆలోచన లేదు. అయితే ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకున్న తరువాతే.. పొత్తు పొడిచినట్లు కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే గనుక.. కేసీఆర్ ప్రోద్బలంతోనే జనసేన జీహెచ్ఎంసీలో పోటీకి దిగుతున్నారనే ప్రచారానికి తెర పడుతుంది.
మరోవైపు ఎంఐఎంతో కూడా పొత్తు లేకుండా.. టీఆర్ఎస్ మొత్తం 150 స్థానాలకు పోటీచేస్తోంది.
Also Read ;- ఎవరీ భూపేంద్ర?.. గ్రేటర్ బీజేపీ రాత మారుస్తారా?